Aruna Roy: ఎవర్ని వివాహమాడాలో కూడా రాజ్యమే నిర్ణయిస్తుంది
ABN , Publish Date - Jan 26 , 2025 | 04:56 AM
రాజ్యాంగ విలువలను తెలియజేయడంలో విద్యాలయాలు, ఉద్యమాలు, ప్రభుత్వ వ్యవస్థలు విఫలమయ్యాయని ప్రఖ్యాత సామాజిక వేత్త అరుణారాయ్ వ్యాఖ్యానించారు.

రాజ్యాంగ విలువలను చాటిచెప్పడంలో విఫలమయ్యాం
ప్రముఖ సామాజిక వేత్త అరుణారాయ్ వ్యాఖ్య
హైదరాబాద్ సిటీ, జనవరి 25(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ విలువలను తెలియజేయడంలో విద్యాలయాలు, ఉద్యమాలు, ప్రభుత్వ వ్యవస్థలు విఫలమయ్యాయని ప్రఖ్యాత సామాజిక వేత్త అరుణారాయ్ వ్యాఖ్యానించారు. మనకు హక్కులు రాజ్యాంగం నుంచి వచ్చాయన్న విషయాన్ని విస్మరిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల జీవితంలో వ్యక్తిగతం అంటూ ఏమీ లేదని, అంతా రాజకీయమే అన్నారు. మహిళలు ఎవరిని వివాహమాడాలో కూడా రాజ్యమే నిర్ణయిస్తుందని విమర్శించారు. హైదరాబాద్ సాహితీ మహోత్సవంలో భాగంగా శనివారం సత్వా నాలెడ్జ్‌సిటీ వేదికగా అరుణా రాయ్ రచించిన ‘ది పర్సనల్ ఈజ్ పొలిటికల్-యాన్ యాక్టివిస్ట్స్ మెమోయిర్’ పుస్తకంపై సీ రామ్మోహన్‌రెడ్డి సమన్వయంలో ఆమెతో చర్చా గోష్ఠి జరిగింది.
ఈ సందర్భంగా, అనంతరం ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన ఆలోచనలు ప్రబలుతోన్న ప్రస్తుత సమయంలో పౌరులంతా సమష్టిగా రాజ్యాంగ పరిరక్షణను భుజానికెత్తుకోవాలి అని పిలుపునిచ్చారు. దేశంలో మత అసహననం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మతతత్వ రాజకీయాలను ఎదుర్కోడానికి మహాత్మాగాంధీ ప్రబోధించిన ‘ఈశ్వర్ అల్లా తేరేనామ్...’ గీతమే శరణ్యమని సూచించారు. విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రతి సమావేశాలకు ముందు ఆ పాటను సామూహికంగా ఆలపించాలన్నారు. కరుణ, శాంతి ద్వారా ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాలను పరిష్కరించగలిగిన శక్తి స్త్రీవాదానికి ఉందన్నారు. అయితే ఫెమినిజం దురదృష్టవశాత్తూ లైంగికత విషయాల చట్రంలో చిక్కుకుపోవడం బాధాకరమన్నారు.