Vemulawada: అరేబియా తీరాన రాజన్న కల్యాణం
ABN , Publish Date - Feb 10 , 2025 | 05:00 AM
ఎడారిలో ఒయాసిస్సుగా భావించే ఒమాన్ సముద్ర తీరంలో మస్కట్ నగర శివారులో ప్రకృతి రమణీయమైన బర్కా ప్రాంతం రాజన్న కల్యాణానికి వేదికైంది.

మస్కట్‌లో వైభవంగా ఉత్సవం
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): అరేబియా సముద్ర తీరాన ఎములాడ రాజన్న కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వరాన్ని పావనం చేసి శివుడు దక్షిణ కాశీగా పేరొందిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ క్షేత్రానికి వస్తాడని పురాణ కథనం కాగా.. భక్తుల విశ్వాసం ఆ పరమ శివుడ్ని అరేబియా తీరానికి తెచ్చింది. ఎడారిలో ఒయాసిస్సుగా భావించే ఒమాన్ సముద్ర తీరంలో మస్కట్ నగర శివారులో ప్రకృతి రమణీయమైన బర్కా ప్రాంతం రాజన్న కల్యాణానికి వేదికైంది. ఓం నమశ్శివాయ అంటూ తెల్లవారు జాము నుంచి మొదలైన శ్రీరాజరాజేశ్వర స్వామి వారి కల్యాణం వేములవాడ నుంచి వచ్చిన ప్రత్యేక అర్చకుల బృందం, స్థానిక ప్రవాసీ బ్రాహ్మణ వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కనుల పండువగా జరిగింది.
ఒమాన్ తెలంగాణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రాజన్న కల్యాణోత్సవంతో ప్రవాసీ భక్తులు పరవశించిపోయారు. వేదిక ప్రాంగణంలో నిర్వహించిన కోడె మొక్కులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కల్యాణోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, గౌరవ అతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డిలు హాజరయ్యారు. రాజన్న కల్యాణోత్సవం వేములవాడ స్థాయిలో ఉందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. విదేశాల్లో సైతం ప్రవాసీలు హైందవ సంస్కృతిని పరిరక్షించడానికి చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు.