AI Technology: ఏఐ భామ.. బూతుల బొమ్మ!
ABN , Publish Date - Jul 27 , 2025 | 05:12 AM
ఆకట్టుకునే రూపం.. అందమైన శరీర సౌష్టవం.. మత్తెక్కించే స్వరం.. కానీ అన్నీ అసభ్య, అశ్లీల, బూతు మాటలే. ఇదేమిటి ఇంత అందంగా, బాగా చదువుకున్న వారిలా కనిపిస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారని అనుకుంటున్నారా?. అయితే..

స్టాండప్ కామెడీలా అనిపించేలా బూతులు, అసభ్య వ్యాఖ్యలతో వీడియోలు
మహిళా క్యారెక్టర్లతో మహిళలను కించపరిచే వ్యాఖ్యలు.. పురుషులపై ద్వంద్వ అర్థాల సెటైర్లు
ఏఐ అని చెప్పినా నమ్మలేని రీతిలో రూపకల్పన
ఫేస్‌బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్‌ల్లో ఇవే ట్రెండింగ్
కాసుల కోసం కొందరు ఐటీ నిపుణుల కక్కుర్తి
విచ్చలవిడితనంపై పెరుగుతున్న ఆందోళన
హైదరాబాద్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఆకట్టుకునే రూపం.. అందమైన శరీర సౌష్టవం.. మత్తెక్కించే స్వరం.. కానీ అన్నీ అసభ్య, అశ్లీల, బూతు మాటలే!! ఇదేమిటి ఇంత అందంగా, బాగా చదువుకున్నవారిలా కనిపిస్తున్న అమ్మాయిలేంటి.. ఇలా చేస్తున్నారేమిటి అనే ఆశ్చర్యం కలగకమానదు. కానీ అది ఏఐ మాయ.. అది బూతుల బొమ్మ! కృత్రిమ మేధతో రూపొందించిన ఈ వీడియోలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో వైరల్ అవుతున్నాయి. ఎక్కడో స్టాండప్ కామెడీ తరహాలో నిలబడి జోకులు చెబుతున్నట్టుగా కనిపించేలా రూపొందిస్తున్నవి కొన్ని అయితే... కేవలం బికినీ వేసుకుని రోడ్లపై తిరుగుతూ ఇంటర్వ్యూలు చేస్తున్నట్టుగా తయారు చేస్తున్నవి మరికొన్ని. మహిళలు, యువతుల పాత్రల (క్యారెక్టర్ల)తో మహిళలను కించపర్చేలా, పురుషులపై ద్వంద అర్థాలతో సెటైర్లు వేస్తూ ఈ వీడియోలు సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి కృత్రిమ మేధను సరిగ్గా వినియోగించుకుంటే వచ్చే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. కానీ సరదాకో, వైరల్ కావాలనో, కాసుల కక్కుర్తితోనో ఇలాంటి అశ్లీల వీడియోలను ఏఐతో రూపొందిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వీటిని నియంత్రించేలా ప్రభుత్వం, సామాజిక మాధ్యమాలు దృష్టిపెట్టాలన్న డిమాండ్లు వస్తున్నాయి.
రీల్స్ మోజులో అశ్లీలం వైపు..
యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటివాటిలో ఆదాయం పొందే అవకాశం ఉండటంతో చాలా మంది సృజనాత్మక వీడియోలు చేస్తున్నారు. కొందరు ప్రత్యేక నైపుణ్యాలతో లక్షలకొద్దీ సబ్‌స్ర్కైబర్లను, ఫాలోవర్లను సంపాదించుకుంటున్నారు. ఇది కాస్త శ్రమ, ఖర్చుతో కూడిన వ్యవహారం కూడా. తామూ ఫేమస్ కావాలని సామాజిక మాధ్యమాల్లోకి వస్తున్న మరికొందరు సబ్‌స్ర్కైబర్లు, వ్యూస్ పెద్దగా రావడం లేదన్న నిరాశతో హద్దులు దాటుతున్నారు. ఏఐ సాయంతో స్టాండప్ కామెడీ పేరుతో బూతు వీడియోలు రూపొందిస్తున్నారు. అందంగా, ఆకట్టుకునేలా ఉండే యువతులు, మహిళల రూపాన్ని ఏఐతో సిద్ధం చేస్తున్నారు. ఎత్తు, రంగు, వస్త్రధారణ, భాష, మాట్లాడాల్సిన పదాలు, ఇతర వివరాలను పేర్కొంటే చాలు.. ఏమాత్రం అనుమానం రానంత పకడ్బందీగా కృత్రిమ వీడియోలను సిద్ధం చేసే ఏఐ వెబ్‌సైట్లు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. ఐటీ రంగంలో పనిచేస్తున్న కొందరు ఏఐ నిపుణులు, ఉద్యోగులు కాసుల కోసం ఇలాంటి ఏఐ వీడియోలు రూపొందిస్తూ జనం మీదికి వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
నిబంధనలను పట్టించుకునేవారెవరు?
సామాజిక మాధ్యమాల్లో పెట్టే వీడియోలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. అసభ్యత, అశ్లీలం, బాలికలపై నేరాలు, మహిళలను కించపరిచేలా వీడియోలు రూపొందించడం కేంద్ర ఐటీ చట్టం ప్రకారం నేరం. యూట్యూబ్, ఇన్‌స్టా వంటి పెద్ద సామాజిక మాధ్యమ కంపెనీలు ఏఐ వీడియోలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలు రూపొందించాయి. ముఖ్యంగా పూర్తిగా కృత్రిమ మేధ, డీప్‌ఫేక్ టెక్నాలజీతో రూపొందించిన వీడియోలకు ‘ఇది ఏఐతో రూపొందించినది’ అని స్పష్టంగా తెలిసేలా పేర్కొనాలి. అడల్ట్ కామెడీ అయితే.. ఆ వీడియోలపై ‘18+, పెద్దలకు మాత్రమే’ అని పేర్కొనాలి. కానీ చాలా మంది వీటిని పాటించడం లేదు.
ఈవార్తలు కూడా చదవండి..
పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఘోర తప్పిదం.. పోలీసుల కేసు నమోదు
Read latest Telangana News And Telugu News