Poisoning In School: విద్యార్థులపై విష ప్రయోగం.. సంచలనం రేపుతున్న ఘటన..
ABN , Publish Date - Apr 16 , 2025 | 02:59 PM
శనివారం, ఆదివారం, సోమవారం వరసగా మూడు రోజులపాటు పాఠశాలకు సెలవులు వచ్చాయి. దీంతో పాఠశాల అన్ని గదులు సహా విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వండే పాత్రలు ఉన్న గదికి సైతం తాళాలు వేశారు సిబ్బంది.

ఆదిలాబాద్: జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇచ్చోడ మండలం ధరంపూరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ప్రాణాలు తీసేందుకు కుట్ర జరిగింది. 30 మంది చిన్నారులను హతమార్చాలని చూశారు కొందరు దుర్మార్గులు. ఈ మేరకు విష ప్రయోగం చేశారు. పాఠశాల వాటర్ ట్యాంక్‌లో పురుగులమందు కలిపారు కేటుగాళ్లు. మధ్యాహ్న భోజనం వండే పాత్రలపైనా విషం చల్లారు. పాఠశాల సిబ్బంది అప్రమత్తం కాడవంతో పెను ప్రమాదం తప్పింది.
అసలేం జరిగిందంటే..
శనివారం, ఆదివారం, సోమవారం వరసగా మూడు రోజులపాటు పాఠశాలకు సెలవులు వచ్చాయి. దీంతో పాఠశాల అన్ని గదులు సహా విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వండే పాత్రలు ఉన్న గదికి సైతం తాళాలు వేశారు సిబ్బంది. అయితే స్కూల్ రీఓపన్ కాగా.. నేడు భోజనం వండేందుకు మధ్యాహ్న భోజన కార్మికులు వంట పాత్రలు శుభ్రం చేసేందుకు బయటకు తీశారు. ఈ క్రమంలో దుర్వాసన, నీళ్లతో కడుతుంటే నురగ వచ్చింది. అప్రమత్తమైన కార్మికులు విషయాన్ని వెంటనే ప్రధానోపాధ్యాయుడు, టీచర్లకు తెలియజేశారు.
దీంతో వారంతా పాఠశాల ఆవరణను తనిఖీ చేయగా.. పురుగులమందు డబ్బాలు దర్శనమిచ్చాయి. ఒక్కసారిగా ఉలిక్కిపడిన పాఠశాల సిబ్బంది మరింతగా తనిఖీ చేశారు. ఈ మేరకు వాటర్ ట్యాంక్‌లోనూ పురుగులమందు కలిపినట్లు గుర్తించారు. దీంతో విద్యార్థులను మంచినీరు తాగొద్దని హెచ్చరించారు. పోలీసులకు వెంటనే సమాచారం అందించగా హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. విషం డబ్బాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విషయం కాస్త విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో అంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
గ్రామస్థులతో కలిసి స్కూల్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. తమ పిల్లలు భోజనం చేసినా, మంచినీరు తాగినా ప్రాణాలు కోల్పోయేవారని ఆవేదన వ్యక్తం చేశారు. అభంశుభం తెలియని చిన్నారులను చంపేందుకు కుట్రలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, విద్యార్థులను చంపేందుకు విషం కలిపిన ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Supreme Court: సెలవుల్లో బుల్డోజర్లు దింపాల్సిన అవసరం ఏంటి.. సర్కార్‌కు సుప్రీం సూటి ప్రశ్న
Faheem Fake Letter Controversy: సీఎంకు చెడ్డ పేరు వచ్చేలా చేయను.. చేయబోను