Sand Mining: ఇసుక అక్రమాలకు పాల్పడితే లైసెన్సుల రద్దు
ABN , Publish Date - Feb 18 , 2025 | 03:37 AM
ఇసుక అక్రమాలకు పాల్పడే కాంట్రాక్టర్ల లైసెన్సులను రద్దు చేస్తామని, కాంట్రాక్టు సంస్థలను బ్లాక్ లిస్టులో పెడతామని గనులు, భూగర్భ వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ హెచ్చరించారు.

కాంట్రాక్టు సంస్థలు బ్లాక్ లిస్ట్‌లో..
రీచ్‌ల్లో సీసీ కెమెరాలు, వే బ్రిడ్జిలు
వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్
రూ.570 కోట్ల పెండింగ్
బిల్లులను త్వరలో చెల్లిస్తాం
మైనింగ్ ముఖ్య కార్యదర్శి శ్రీధర్
అక్రమాలపై ఫిర్యాదులకు 98480 94373, 70939 14343
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ఇసుక అక్రమాలకు పాల్పడే కాంట్రాక్టర్ల లైసెన్సులను రద్దు చేస్తామని, కాంట్రాక్టు సంస్థలను బ్లాక్ లిస్టులో పెడతామని గనులు, భూగర్భ వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ హెచ్చరించారు. రాబోయే నెల రోజుల్లోగా రీచ్‌లు, స్టాక్ యార్డుల్లో సీసీ కెమెరాలు, వే బ్రిడ్జిలను ఏర్పాటు చేస్తామని, వాహనాలకు జీపీఎస్ ట్రా కింగ్ సిస్టంను అమలు చేస్తామని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా నిరోధానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. ఇసుక అక్రమాలపై సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనం, ఇతర మీడియాల్లో వస్తోన్న వార్తలపై స్పందిస్తూ సచివాలయంలో ఆయ న విలేకరులతో మాట్లాడారు. ‘‘గతంలో మూడు షిఫ్టు ల్లో మాత్రమే ఆన్‌లైన్ బుకింగ్‌కు అవకాశముండేది. ఇప్పుడు ఇసుక అక్రమాలకు తావు లేకుండా 24 గంటలపాటు ఆన్‌లైన్ బుకింగ్ అవకాశం కల్పించాం. మైనింగ్, పోలీసు, రెవెన్యూ, రవాణా శాఖల బృందాలు నిరంతరం స్టాక్ యార్డులు, రీచ్‌లలో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. రీచ్‌లలో ఇదివరకు రోజుకు 50 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉండేది. ఇప్పుడు దానిని లక్ష మెట్రిక్ టన్నులకు పెంచాం’’ అని వివరించారు. అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టడానికి ఎక్కువ మొత్తంలో ఇసుకను అందుబాటులో ఉంచుతున్నామన్నారు.
ఈనెల 10న ఇసుక లభ్యతపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి.. సరఫరాను పెంచాలని, పేదలకు తక్కువ ధరకే విక్రయించాలని, ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా సరఫరా చేయాలని, అక్రమ ఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని, ఓవర్ లోడ్‌తో వెళ్లే వాహనాలపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారని గుర్తు చేశారు. ఇసుక ఎక్కువగా హైదరాబాద్‌కే వస్తుంటుందని, ఈ దృష్ట్యా నగర పోలీసు కమిషనర్, హైడ్రా కమిషనర్, రవాణా శాఖ కమిషనర్ ఆధ్వర్యం లో నిఘాను పెంచామన్నారు. ఈనెల 10 నుంచి ఇప్పటి వరకు 1,529 వాహనాలను తనిఖీ చేశామని, ఓవర్ లోడ్, వే బిల్లులు లేకుండా వెళ్లే వాహనాలపై 162 కేసులు నమోదు చేశామని, 131 వాహనాలను సీజ్ చేశామని, రూ.26 లక్షల జరిమానాను వసూలు చేశామని పేర్కొన్నారు. ‘‘కొంతమంది టన్ను ఇసుకను రూ.3000 నుంచి రూ.5000 వరకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. కానీ, టన్నును రూ.1,600కు మించి విక్రయించడానికి వీల్లేదు. అధిక ధరలను నియంత్రించడానికే ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఇసుకను అందుబాటులో ఉంచుతోంది’’ అని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సం వత్సరంలో ఇసుక విక్రయాల ద్వారా ఈనెల 16వ తేదీ వరకు రూ.628 కోట్ల రాబడి వచ్చిందని, గత ఏడాది ఇదే కాలానికి రూ.567 కోట్లు వచ్చాయరు. కాంట్రాక్టర్లకు దాదాపు రూ.570 కోట్ల వరకు ఉన్న పెండింగ్ బిల్లులను త్వరలో చెల్లిస్తామని చెప్పారు. ఇసుక అక్రమాలకు సంబంధించి ఎలాంటి సమాచారాన్నైనా టీజీఎండీసీలో ఏర్పాటు చేస్తున్న ఫోన్ నంబర్లు 98480 94373 లేదా 70939 14343లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో గనులు, భూగర్భ వనరుల శాఖ కమిషనర్ శశాంక్, టీజీఎండీసీ ఎండీ సుశీల్‌కుమార్ పాల్గొన్నారు.