Murali Rao: మురళీధర్‌రావు లాకర్ గోప్యం?
ABN , Publish Date - Jul 25 , 2025 | 05:34 AM
నీటిపారుదల శాఖ విశ్రాంత ఇంజనీర్ చీటి మురళీధర్ రావు అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు గురువారం బ్యాంకు లాకర్లను పరిశీలించారు.

వివరాలు వెల్లడించని ఏసీబీ అధికారులు
నీటిపారుదల శాఖ విశ్రాంత ఇంజనీరు కేసు
రిటైర్ అయినా.. ఐదు పోస్టుల్లో ఆయనే బాస్
ఆదాయానికి మించి ఖర్చుల నిర్ధారణ
స్థిరాస్తులు ఎలా కొన్నారు? ఏసీబీ ఆరా
కుమారుడి కంపెనీ కాంట్రాక్ట్‌లపైనా నజర్
హైదరాబాద్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): నీటిపారుదల శాఖ విశ్రాంత ఇంజనీర్ చీటి మురళీధర్ రావు అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు గురువారం బ్యాంకు లాకర్లను పరిశీలించారు. ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించిన ఏసీబీ.. బ్యాంకు లాకర్లలో కనుగొన్న సొత్తు వివరాలను మాత్రం గోప్యంగా పెట్టింది. ఐదు రోజుల(ఆదివారం వరకు) ఏసీబీ కస్టడీలో భాగంగా మురళీధర్‌రావును విచారించే క్రమంలో అధికారులు లాకర్లను తనిఖీ చేశారు. మురళీధర్ రావు 1976లో సర్వీసులో చేరగా.. పదవీ విరమణ తర్వాత కూడా (2024 వరకు) వివిధ పోస్టుల్లో బాస్‌గా పనిచేశారు. ఆయన సర్వీసులో వచ్చిన జీతభత్యాలను కలిపి రూ.6,50,00,000గా ఏసీబీ లెక్క తేల్చింది. ఈ మేరకు వివరాలను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. అయితే.. ఆయన ఖర్చులు ఆదాయం కంటే ఎక్కువగా.. రూ.6,96,52,778గా ఉన్నట్లు స్పష్టం చేసింది. అంటే.. ఆదాయానికి మించి ఆయన రూ.46,51,778 మేర అదనంగా ఖర్చుచేశారు. ఆయన ఆస్తుల డాక్యుమెంట్ల విలువ రూ. 9,02,68,017 కాగా, అదనపు ఖర్చులతో కలిపి రూ.9,49,19,795గా ఏసీబీ లెక్క తేల్చినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనగా.. డాక్యుమెంట్ విలువ కంటే.. మార్కెట్ రేటు వంద రెట్లు ఎక్కువగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంతర్గత సంభాషణల్లో స్పష్టం చేస్తున్నారు.
కాగా.. మురళీధర్ రావు పదవీ విరమణ తర్వాత కూడా కీలకమైన ఐదు పోస్టుల్లో పనిచేశారు. కాలేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు డైరక్టర్‌గా, మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ డైరక్టర్‌గా, తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ డైరక్టర్‌గా, తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్స్ ఇన్‌ఫ్రా అండ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ డైరక్టర్‌గా, మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరక్టర్‌గా పనిచేశారు. అన్నీ కీలక బాధ్యతలు నిర్వర్తించిన నేపథ్యంలో.. ఆయన స్థిరాస్తులను సొంతంగా కొన్నారా? లేక నజరానాల రూపంలో రాబట్టారా? అనే కోణంపై ఏసీబీ దృష్టిసారించింది. అదే సమయంలో.. మురళీధర్‌రావు కుమారుడు అభిషేక్‌కు సంబంధించిన కంపెనీలు, ఆయనకు లభించిన కాంట్రాక్టులపైనా విచారణ కొనసాగుతుందని ఏసీబీ అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే
మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ అధికారుల సోదాలు
Read latest Telangana News And Telugu News