Share News

ACB Raids: ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్‌

ABN , Publish Date - Jul 19 , 2025 | 04:55 AM

రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు, సోదాలు కొనసాగుతున్నా.. లంచాలకు అలవాటు పడిన అధికారుల తీరు మారట్లేదు. 16 గుంటల భూమికి పట్టా పాస్‌ బుక్‌ జారీ చేసేందుకు రూ.2 లక్షలు లంచం డిమాండ్‌..

ACB Raids: ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్‌

  • పాస్‌బుక్‌ జారీకి 2 లక్షలు డిమాండ్‌

  • మంచిర్యాల జిల్లాలో దొరికిన ముగ్గురు కార్మికశాఖ అధికారులు

  • కొత్తగూడెం కార్పొరేషన్‌ పరిధిలోని పాల్వంచ డివిజన్‌ ఆఫీసులో సోదాలు

ములుగు/పాల్వంచ/నస్పూర్‌/మంచిర్యాల క్రైం/బెల్లింపల్లి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు, సోదాలు కొనసాగుతున్నా.. లంచాలకు అలవాటు పడిన అధికారుల తీరు మారట్లేదు. 16 గుంటల భూమికి పట్టా పాస్‌ బుక్‌ జారీ చేసేందుకు రూ.2 లక్షలు లంచం డిమాండ్‌ చేసిన ఓ డిప్యూటీ తహసీల్దార్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట జిల్లా ములుగులో ఈ ఘటన చోటు చేసుకుంది. సింగన్నగూడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 16 గుంటల భూమిని తన బంధువుల పేరిట పట్టా చేసేందుకు పెట్టుకున్న దరఖాస్తును ప్రాసెస్‌ చేసేందుకు డిప్యూటీ తహసీల్దార్‌ భవానీ రూ.2లక్షలు డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించి.. సాక్ష్యాలుగా తన వద్ద ఉన్న కాల్‌ రికార్డింగ్స్‌, భూమి ధ్రువీకరణ పత్రాలు, దరఖాస్తు చేసుకున్న జిరాక్స్‌ పత్రాలను అందించారు. దీంతో ఏసీబీ అధికారులు ములుగు తహసీల్దార్‌ కార్యాలయంలో సోదాలు చేసి డిప్యూటీ తహసీల్దార్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.


ఇక మంచిర్యాల జిల్లాలో కార్మిక శాఖకు చెందిన ముగ్గురు అధికారులు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. భవన నిర్మాణ కార్మికుడైన తన సోదరుడు మరణించడంతో ఓ వ్యక్తి లేబర్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా అందాల్సిన ప్రమాద బీమా రూ.6.30 లక్షల కోసం మంచిర్యాల సహాయ కార్మిక అధికారి (కాగజ్‌నగర్‌ ఇన్‌చార్జ్‌) కాటం రామ్మోహన్‌ను సంప్రదించాడు. దీంతో ఆయన రూ.1.50లక్షల లంచం డిమాండ్‌ చేశారు. అంత ఇవ్వలేనని చెప్పిన బాధితుడు.. చివరకు రూ.50 వేలకు ఒప్పందం చేసుకున్నాడు. అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలోనే రామ్మోహన్‌ తన ఇంట్లోనే రూ.50 వేలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. మరో ఘటనలో.. బెల్లంపల్లి సహాయ కార్మిక అధికారి సుకన్య, అసిస్టెంట్‌ రాజేశ్వరిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భవన నిర్మాణ కార్మికుడైన తన భర్త చనిపోవడంతో ఓ మహిళ.. ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1.30లక్షల బీమా డబ్బు కోసం సుకన్యను సంప్రదించింది. అయితే లంచంగా ఆమె రూ.40 వేలు డిమాండ్‌ చేశారు. దీంతో బాధితురాలు ఏసీబీని సంప్రదించింది. బాధితురాలు నుంచి కార్యాలయ అసిస్టెంట్‌ రాజేశ్వరి డబ్బులు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.


పాల్వంచ డివిజన్‌ కార్యాలయంలో సోదాలు

కొత్తగూడెం కార్పొరేషన్‌ పరిధిలోని పాల్వంచ డివిజన్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రతీ విభాగంలోని అధికారులను, సిబ్బందిని విచారించారు. అలాగే తనిఖీ చేసి.. అక్రమ పద్ధతిలో వారి వద్ద ఉన్న రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. చివరిగా కార్పొరేషన్‌ కమిషనర్‌ సుజాత, మేనేజర్‌ ఎల్వీ సత్యనారాయణ, టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ నవీన్‌కుమార్‌ను వేర్వేరుగా విచారించారు. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో అక్రమాలను గుర్తించామని, తదుపరి చర్యల నిమిత్తం ప్రభుత్వానికి నివేదిస్తామని ఏసీబీ డీఎస్పీ రమేశ్‌ తెలిపారు.


ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 19 , 2025 | 04:55 AM