Labor Trafficking Arrests: బలవంతపు చాకిరీ నుంచి 36 మందికి విముక్తి
ABN , Publish Date - Jul 23 , 2025 | 04:47 AM
నెలకు రూ.15 వేల జీతం.. రోజూ 2 గంటలే పని.. ఉచితంగా ఆహారంతోపాటు మద్యం సరఫరా చేస్తామని ఆశ చూపి..

8 మంది నిందితుల అరెస్టు
పరారీలో నలుగురు మధ్యవర్తులు
నల్లగొండ క్రైం, జూలై 22 (ఆంధ్రజ్యోతి): నెలకు రూ.15 వేల జీతం.. రోజూ 2 గంటలే పని.. ఉచితంగా ఆహారంతోపాటు మద్యం సరఫరా చేస్తామని ఆశ చూపి సుదూర ప్రాంతాల నుంచి మానవుల అక్రమ రవాణాకు పాల్పడ్డ ముఠా గుట్టు రట్టయింది. ఈ ముఠా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, బిహార్, ఒడిశా రాష్ట్రాల నుంచి నలుగురు బాల కార్మికులతోపాటు 36 మంది వలస కార్మికులను ఒక్కొక్కరికి రూ.1500 కమీషన్ ఇచ్చి హైదరాబాద్, విజయవాడ నుంచి నల్లగొండ జిల్లా దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని కొండమల్లేపల్లికి తీసుకొచ్చిందీ ముఠా. అక్కడికి చేరుకున్నాక ఈ ముఠా సభ్యులు వారి వద్ద సెల్‌ఫోన్లు తీసేసుకుని.. రాత్రి వేళ మోటారు సైకిళ్లపై నేరేడుగొమ్ము మండలం బాణాలకుంట, వైజాగ్ కాలనీలకు.. అక్కడ కృష్ణా నదిలోకి తీసుకెళ్లి.. చేపల వలలు లాగిస్తారు. కానీ, రోజుకు 2 పూటలే భోజనం పెట్టడంతోపాటు తమపై పనిభారం పెరుగుతోందని, చేసిన పనికి డబ్బు ఇవ్వమన్న వారిని చిత్రహింసల పాల్జేశారు. తమతో బలవంతపు చాకిరీ చేయించుకుంటున్నారని స్థానికులకు వలస కూలీలు వెల్లబోసుకున్న గోడు.. పోలీసులతోపాటు రెవెన్యూ, బాలల సంక్షేమశాఖల అధికారులకు చేరింది. ఆ శాఖల అధికారులు బృందాలుగా కూలీలున్న ప్రాంతాలకెళ్లి 8 మంది నిందితులను అరెస్టు చేసి, 36 మంది వలస కార్మికులకు విముక్తి కలిగించారు. పరారీలో ఉన్న నలుగురు మధ్యవర్తుల కోసం ప్రత్యేక బృందా లు గాలిస్తున్నాయని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం మీడియాకు చెప్పారు. దేవరకొండ ఏఎస్పీ మౌనిక పర్యవేక్షణలో నిందితులను అరెస్టు చేసిన డిండి, కొండ మల్లేపల్లి సీఐలతో పాటు గుడిపల్లి, నేరేడుగొమ్ము, గుర్రంపోడ్ ఎస్‌ఐలను ఎస్పీ అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి