Maoist Surrender: 29 మంది మావోయిస్టుల లొంగుబాటు
ABN , Publish Date - Jul 13 , 2025 | 04:37 AM
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాతో పాటు భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో శనివారం మొత్తం 29 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు.

ఛత్తీస్‌గఢ్‌లో 23 మంది, కొత్తగూడెంలో ఆరుగురు
చర్ల/కొత్తగూడెం, జూలై 12 (ఆంధ్రజ్యోతి) : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాతో పాటు భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో శనివారం మొత్తం 29 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్ లోని సుకుమా జిల్లాలో 23 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిపై కోటి 18 లక్షల రివార్డు ఉందని సుకుమా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. లొంగిపోయిన వారిలో డీవీసీఎం, పీపీసీఎం, ఏసీఎం కమిటీ సభ్యులున్నారని, వారితో పాటు నలుగురు దంపతులు కూడా లొంగిపోయారని ఎస్పీ పేర్కొన్నారు. అలాగే గతంలో మాజీ కలెక్టర్ అలెక్స్ పాల్ మీనన్‌ను కిడ్నాప్ చేసిన మావోయిస్టు లోకేష్ కూడా ఉన్నాడని తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, సుకుమా, అబూజ్‌మడ్ అడవుల్లో జరిపిన పలు విధ్వంసకర ఘటనల్లో వీరంతా నిందితులని ఎస్పీ పేర్కొన్నారు. మరోవైపు ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్, సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ అధికారుల సమక్షంలో శనివారం ఆరుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు.
లొంగిపోయిన వారిలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని పూనెం లాలు అలియాస్ లాకేష్, బీజాపూర్ జిల్లాలోని గంగులూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని మడవి నందు, సుకుమా జిల్లాలోని కిష్టారం పీఎస్ పరిధిలోని మడకం దేవ అలియాస్ దీపక్, బీజాపూర్ జిల్లాలోని బాసుగూడె పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓఎం. భీమా అలియాస్ సుశీల, బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముచికి దేవా అలియాస్ అస్మాన్, దంతెవాడ జిల్లా కటకాయన పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉడివి ఉయి ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్‌రాజు మాట్లాడుతూ.. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం 300 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. వారందరికీ తగిన పునరావాసం కల్పించినట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయినవారికి తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున అందజేశారు. ఆధార్‌కార్డులు, బ్యాంకు ఖాతాలు వచ్చిన తర్వాత వారికి ఇవ్వాల్సిన రూ.10.75 లక్షలను చెక్కుల రూపంలో అందిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌సింగ్, సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
విమాన ప్రమాదం.. నివేదికలో బయటపడ్డ సంచలన విషయాలు
కుర్చీ దొరికితే వదలొద్దు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి