Share News

Sangareddy: నా హెలికాప్టర్‌ ఎగరడం లేదు

ABN , Publish Date - Apr 22 , 2025 | 03:54 AM

ఏదైనా వస్తువును కొన్న తర్వాత అది పనిచేయకపోతే దిగాలు పడడమో లేదా అమ్మిన వారిపై కాసేపు ఆగ్రహం వ్యక్తం చేసి ఊరుకోవడమో చేస్తుంటాం.

Sangareddy: నా హెలికాప్టర్‌ ఎగరడం లేదు

  • అమ్మిన వ్యాపారిపై పోలీసులకు బుడ్డోడి ఫిర్యాదు

  • సముదాయించి పంపిన సంగారెడ్డి జిల్లా కంగ్టి పోలీసులు

కంగ్టి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఏదైనా వస్తువును కొన్న తర్వాత అది పనిచేయకపోతే దిగాలు పడడమో లేదా అమ్మిన వారిపై కాసేపు ఆగ్రహం వ్యక్తం చేసి ఊరుకోవడమో చేస్తుంటాం. అయితే ఓ పదేళ్ల బాలుడు తాను కొన్న బొమ్మ హెలికాప్టర్‌ పనిచేయకపోవడంతో, వ్యాపారిపై చర్యలు తీసుకోవాలంటూ ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాడు. తల్లిదండ్రులతో కలిసి కర్ణాటకలోని బర్మానాగన్‌పల్లిలో ఉంటున్న వీరారెడ్డి (10) సిద్దేశ్వర జాతర ఉత్సవాల కోసం నాలుగు రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా కంగ్టిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. జాతరలో ఓ వ్యాపారి వద్ద రూ. మూడు వందలకు బొమ్మ హెలికాప్టర్‌ను కొనుగోలు చేశాడు. ఇంటికి తీసుకొని వెళ్లాక అది పని చేయలేదు.


దీంతో ఆ బాలుడు దాన్ని తీసుకెళ్లి వ్యాపారికి పనిచేయడం లేదని చెప్పడంతో మొదలు తీసుకున్న దాన్ని మార్చి వేరేది ఇచ్చాడు. ఇంటికి వెళ్లాక అది కూడా పని చేయలేదు. ఇలా పలుమార్లు మార్చినప్పటికీ నాలుగోసారి మళ్లీ వచ్చిన బాలుడిపై వ్యాపారి ఆగ్రహం వ్యక్తం చేయడంతో వీరారెడ్డి నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు. తనను మోసం చేసిన వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న బాలుడి తాత పోలీసులతో మాట్లాడారు. తన మనవడు ఇంతకు ముందు తనతోపాటు పోలీ్‌సస్టేషన్‌కు వచ్చాడని, అదే దైర్యంతో బొమ్మ హెలికాప్టర్‌ ఎగరడం లేదని చెప్పేందుకు వచ్చి ఉంటాడని తెలిపారు. దీంతో పోలీసులు బాలుడిని సముదాయించి పంపించారు. పదేళ్ల బాలుడు వ్యాపారిపై పోలీసులకు పిర్యాదు చేసేందుకు వెళ్లడం పట్ల అతని ధైర్యాన్ని పలువురు అభినందిస్తున్నారు.

Updated Date - Apr 22 , 2025 | 03:54 AM