Share News

Earth Observation Satellite: నింగిలోకి నిసార్‌

ABN , Publish Date - Jul 31 , 2025 | 03:47 AM

అంతరిక్ష రంగంలో ఇస్రో మరో అద్భుత విజయాన్ని అందుకుంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలిసి

Earth Observation Satellite: నింగిలోకి నిసార్‌

జీఎస్ఎల్వీ-ఎఫ్‌16 ప్రయోగం విజయవంతం

  • అంతరిక్షంలోకి దూసుకెళ్లిన భూపరిశీలన ఉపగ్రహం

  • ఇస్రో-నాసా ఉమ్మడి ప్రయోగం గ్రాండ్‌ సక్సెస్‌

  • 19 నిమిషాల్లోనే నిర్దేశిత కక్ష్యలోకి నిసార్‌ ఉపగ్రహం

  • జీఎస్ఎల్వీ ప్రయోగాల్లో మరోసారి ఇస్రో సత్తా

  • సంస్థ చరిత్రలో ఇదొక మైలురాయి: నారాయణన్‌

సూళ్లూరుపేట, తడ, జూలై 30 (ఆంధ్రజ్యోతి): అంతరిక్ష రంగంలో ఇస్రో మరో అద్భుత విజయాన్ని అందుకుంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలిసి చేపట్టిన భూపరిశీలన ఉపగ్రహం నిసార్‌ (నాసా-ఇస్రో సింథటిక్‌ అపార్చర్‌ రాడార్‌) ప్రయోగం విజయవంతమైంది. యావత్‌ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన నాసా-ఇస్రో మిషన్‌ సక్సెస్‌ కావడంతో ఇస్రో ఉత్సాహం రెట్టింపైంది. ఇస్రో చరిత్రలో ఈ ప్రయోగం ఒక మైలురాయిగా నిలిచింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం-షార్‌ నుంచి బుధవారం సాయంత్రం 5:40 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌16 రాకెట్‌.. 18.59 నిమిషాల్లోనే ఉపగ్రహాన్ని నిర్దేశిత సూర్య సమకాలిక కక్ష్యలోకి చేర్చింది. మంగళవారం మధ్యాహ్నం 2:10 గంటలకు ప్రారంభమైన 27:30 గంటల కౌంట్‌డౌన్‌ పూర్తవగానే రివ్వున ఎగిరిన రాకెట్‌.. తొలి మూడు దశలనూ సునాయాసంగా పూర్తిచేసుకుంది. ఈ క్రమంలో 747 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత 2,392 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని కక్ష్యలో విడిచిపెట్టింది. ఈ వెంటనే మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అక్కడి నుంచే రాకెట్‌ గమనాన్ని పర్యవేక్షిస్తున్న ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌16 ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు. సహచర శాస్త్రవేత్తలను ఆలింగనం చేసుకొని ఆనందం పంచుకున్నారు. ఈ ఏడాది మేలో పీఎ్‌సఎల్వీ-సీ61 రాకెట్‌ ప్రయోగం విఫలమైన నేపథ్యంలో.. ఈ విజయం ఇస్రోకు భారీ ఉత్సాహాన్నిచ్చింది. ఇస్రో-నాసా సంయుక్త మిషన్‌ కావడంతో ఇస్రోతో పాటు అమెరికా నుంచి నాసా శాస్త్రవేత్తలు కూడా షార్‌కు చేరుకుని ప్రయోగాన్ని పరిశీలించారు.

తొలి సిగ్నల్స్‌ అందాయ్‌...

విజయవంతంగా కక్ష్యలోకి చేరిన నిసార్‌ ఉపగ్రహం అక్కడ స్థిరంగా ఉన్నట్లు బెంగళూరులోని హసన్‌ మాస్టర్‌ కంట్రోల్‌ సెంటర్‌ గ్రౌండ్‌ స్టేషన్‌కు సిగ్నల్స్‌ అందాయి. భూపరిశీలన కోసం నాసా-ఇస్రో ఈ ఉపగ్రహాన్ని తయారుచేశాయి. దీని బరువు 2,392 కిలోలు. ఈ కొత్తతరం ఉపగ్రహం భూమిని అణువణునా స్కాన్‌చేసి సమాచారాన్ని చేరవేస్తుంది. కొండలు, పర్వతాలు, జలవనరులు ఇలా అన్నింటినీ జల్లెడపడుతుంది. ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నారాయణన్‌కు ఇది మూడో ప్రయోగం. తొలి రెండు ప్రయోగాలూ విఫలం కావడంతో దీని విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా, నాసా-ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేయడంతో దీనికి ‘నిసార్‌’ (నాసా-ఇస్రో సింఽథటిక్‌ అపార్చర్‌ రాడార్‌) అని పేరు పెట్టారు. దీనికోసం ఇరువురూ రూ.13వేల కోట్లకుపైగా వెచ్చించినట్టు అంచనా. ఇప్పటివరకు అంతరిక్షంలోకి చేర్చిన అత్యంత శక్తిమంతమైన భూపరిశీలన ఉపగ్రహాల్లో ఇదీ ఒకటి.


పల్లీలు తింటూ.. ప్రయోగాన్ని వీక్షిస్తూ..

నిసార్‌ ఉపగ్రహ ప్రయోగ సమయంలో శ్రీహరికోటలోని మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌లో నాసా శాస్త్రవేత్తలు పల్లీలు తింటూ కనిపించారు. ప్రయోగాన్ని పరిశీలిస్తున్న సమయంలో వారి చేతుల్లో చిన్న డబ్బాలు కనిపించాయి. రాకెట్‌ గమనాన్ని వీక్షిస్తున్నంతసేపూ వాళ్లు అందులో ఉన్న పల్లీలు పంచుకుని తింటూ ఉన్నారు. దీనిపై ఇస్రో పూర్వ ఉద్యోగిని ప్రశ్నించగా.. ‘ప్రతి ప్రయోగ సమయంలోనూ వాళ్లు ఇలాగే పల్లీలు తింటారు.. ఇది వాళ్ల సెంటిమెంట్‌’ అని చెప్పారు.

బలపడిన ఇస్రో-నాసా బంధం

‘భూపరిశీలన ఉపగ్రహం కోసం ఇస్రో-నాసా మధ్య 2014లో ఒప్పందం కుదిరింది. అప్పట్నుంచి రెండు బృందాలు నిసార్‌ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశారు. ఇద్దరూ కలిసి చేపడుతున్న తొలి ప్రయోగమే అయినా.. మా మధ్య బంధం మరింత బలపడింది. రాబోయే కాలంలో ఇద్దరం కలిసి మరో మూడు ప్రయోగాలు చేపట్టేందుకు ఒప్పందం చేసుకున్నాం’ అని ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌ అన్నారు. జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌16 ప్రయోగం విజయానంతరం ఆయన మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి మాట్లాడారు. శాస్త్రవేత్తల సమష్టి కృషితోనే నిసార్‌ విజయవంతమైందన్నారు. రాబోయే రోజుల్లో చంద్రయాన్‌-4 ప్రయోగ పనులకు శ్రీకారం చుడుతున్నామన్నారు. ఈ ఏడాది చివరికి గగన్‌యాన్‌-1 పేరుతో రోబో వ్యోమమిత్రను అంతరిక్షంలోకి పంపే ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పీఎ్‌సఎల్వీ సిరీ్‌సలో కూడా మరో నాలుగు ప్రయోగాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. కాగా, ఇస్రో తమకు చక్కని సహకారం అందించినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఇస్రో చైర్మన్‌తోపాటు షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌, వీఎ్‌సఎ్‌ససీ డైరెక్టర్‌ ఉన్నికృష్ణన్‌ నాయర్‌, శాటిలైట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ చైత్రరావు, జీఎ్‌సఎల్వీ మిషన్‌ డైరెక్టర్‌ థామస్‌ కురియన్‌ తదితరులు ఉన్నారు.

నిసార్‌ విశేషాలు

  • ఉమ్మడిగా భూపరిశీలన ఉపగ్రహ మిషన్‌ను ప్రారంభించేందుకు నాసా, ఇస్రో 2014 సెప్టెంబరులో ఒప్పందం చేసుకున్నాయి. నాసా-ఇస్రో మధ్య కుదిరిన తొలి భారీ ఒప్పందమిది.

  • భూమిపై పొరల్లో ఒక్క సెంటీమీటరు మార్పులు సంభవించినా గుర్తించేందుకు వీలుగా దీనిలో డబుల్‌ ఎల్‌, ఎస్‌-బ్యాండ్‌ రాడార్‌ ఫ్రీక్వెన్సీలను ఉపయోగించారు. ఈ రాడార్లు పగలు, రాత్రి మేఘాలు, పొగ, వర్షం, పొగమంచులోనూ స్పష్టంగా ఫొటోలు తీసి పంపగలవు.

  • సైన్స్‌ డేటా కోసం ఎల్‌-బ్యాండ్‌ సింథటిక్‌ అపార్చర్‌ రాడార్‌, జీపీఎస్‌ రిసీవర్లను నాసా అందించగా.. ఉపగ్రహం, ఎస్‌-బ్యాండ్‌ రాడార్‌, ప్రయోగానికి అవసరమైన జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌16 రాకెట్‌ను ఇస్రో సమకూర్చింది.


  • భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు, కొండచరియలు, పర్వత ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడే పరిస్థితులను ముందే గుర్తిస్తుంది.

  • నిసార్‌ భూమిపై, సముద్రాల్లో మంచు పరిస్థితి ఎలా ఉంది.. ఎంత మందంలో ఉంది? ఆ మంచు కరిగి నీరుగా మారే అవకాశాలను కచ్చితత్వంతో గుర్తిస్తుంది. భూమిని, మంచును 3డీలో చూపిస్తుంది. ఇది 12 రోజుల వ్యవధిలో భూమి మొత్తాన్నీ స్కాన్‌ చేస్తుంది.

  • అడవులు, పంటల విస్తీర్ణం, పచ్చదనంలో తేడా లు, నేల తేమ, నీటి వనరులు, తేడాలను గుర్తిస్తుంది.

  • నిసార్‌ డేటాతో ప్రభుత్వాలు ప్రకృతి విపత్తులు, ప్రమాదాలను అంచనావేసి తగుజాగ్రత్తలు తీసుకోవచ్చు.

  • జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌16 ద్వారా ఇస్రో సూర్య సమకాలిక కక్ష్యలోకి ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే తొలిసారి. శ్రీహరికోట నుంచి ఇస్రోకు ఇది 102వ ప్రయోగం.


ఈ వార్తలు కూడా చదవండి..

తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్

ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..

For More International News And Telugu News

Updated Date - Jul 31 , 2025 | 03:47 AM