IN-SPACe Starlink Approval: భారతదేశంలో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలకు ఆమోదం.. లైసెన్స్ మంజూరు
ABN , Publish Date - Jul 09 , 2025 | 08:11 PM
భారత ఇంటర్నెట్ రంగంలో విప్లవాత్మక మార్పులకు సమయం ఆసన్నమైంది. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్‌లింక్ తాజాగా భారత అంతరిక్ష నియంత్రణ సంస్థ ఇన్-స్పేస్ నుంచి ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు లైసెన్స్ (IN-SPACe Starlink Approval) పొందింది.

దేశంలో ఇంటర్నెట్ సేవల్లో ఒక కొత్త ట్రెండ్ సృష్టించేందుకు స్టార్‌లింక్ సిద్ధమైంది. భారత అంతరిక్ష నియంత్రణ సంస్థ ఇన్-స్పేస్.. బిలియనీర్, వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్‌లింక్‌కు దేశంలో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు లైసెన్స్ మంజూరు (IN-SPACe Starlink Approval) చేసింది. ఈ నిర్ణయం భారతదేశంలో డిజిటల్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసే విషయంలో కీలక నిర్ణయమని చెప్పవచ్చు. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) తమ వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది.
ఇంటర్నెట్ సేవల్లో విప్లవం
స్టార్‌లింక్ జెన్1 కాన్స్టెలేషన్ సామర్థ్యాన్ని ఉపయోగించి దేశవ్యాప్తంగా హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు పొందిన ఈ ఆమోదం ఐదు సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది. స్టార్‌లింక్ ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ సంస్థ ఆధ్వర్యంలో పనిచేసే ఒక ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సర్వీస్. ఈ సేవలు భూమి తక్కువ కక్ష్యలో (లో ఎర్త్ ఆర్బిట్) ఉన్న వేలాది ఉపగ్రహాల ద్వారా అందించబడతాయి. ఈ ఉపగ్రహాలు గ్రామీణ, మారుమూల ప్రాంతాలతో సహా ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేని ప్రదేశాలకు కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తాయి.
భారత మార్కెట్‌పై స్టార్‌లింక్ దృష్టి
2022 నుంచి స్టార్‌లింక్ భారత మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుంది. భారతదేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను మెరుగుపరచాలనే లక్ష్యంతో ఈ సంస్థ తన వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేసింది. భారత ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్టివిటీని విస్తరించేందుకు కృషి చేస్తున్న నేపథ్యంలో, స్టార్‌లింక్ సేవలు ఈ లక్ష్యాన్ని సాకారం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ ఆమోదంతో స్టార్‌లింక్ భారతదేశంలో తన సేవలను అధికారికంగా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది.
స్టార్‌లింక్ సేవల ప్రయోజనాలు
హై-స్పీడ్ ఇంటర్నెట్: స్టార్‌లింక్ ఉపగ్రహాలు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్‌ను అందిస్తాయి. ఇది వీడియో స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్, వర్క్-ఫ్రమ్-హోమ్ వంటి అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుంది.
గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ: సాంప్రదాయ ఇంటర్నెట్ సేవలు అందని మారుమూల గ్రామాల్లో కూడా స్టార్‌లింక్ ఇంటర్నెట్ అందిస్తారు
సులభమైన ఇన్‌స్టాలేషన్: స్టార్‌లింక్ కిట్‌ను సులభంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు, దీనికి పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేదు.
విశ్వసనీయత: స్టార్‌లింక్ ఉపగ్రహాలు వాతావరణ పరిస్థితులపై తక్కువ ఆధారపడతాయి. దీనివల్ల స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ అందుతుంది.
భారతదేశంలో స్టార్‌లింక్ భవిష్యత్తు
స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవల ద్వారా భారతదేశంలో విద్య, వ్యాపారం, ఆరోగ్యం, వినోద రంగాల్లో కొత్త అవకాశాలను తీసుకురానున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఆన్‌లైన్ విద్యకు, చిన్న వ్యాపారులు డిజిటల్ మార్కెటింగ్‌కు, ఆరోగ్య సంస్థలు టెలిమెడిసిన్ సేవలకు స్టార్‌లింక్ ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇది భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయనుంది. అయితే స్టార్‌లింక్ సేవలు సరసమైన ధరల్లో అందుబాటులో ఉండాలని, అలాగే స్థానిక ఇంటర్నెట్ సేవలతో పోటీపడే విధంగా ఉండాలని వినియోగదారులు ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి