Share News

Starlink India: భారతదేశంలో ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ సేవలకు లైసెన్స్

ABN , Publish Date - Jun 06 , 2025 | 05:22 PM

ఎలాన్ మస్క్ సంస్థ స్టార్‌లింక్ నుంచి కీలక అప్‎డేట్ వచ్చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికామ్ (DOT) నుంచి తాజాగా లైసెన్స్ సాధించిన స్టార్‌లింక్, దేశవ్యాప్తంగా అత్యాధునిక టెలికాం సేవలను అందించేందుకు సిద్ధమైంది.

Starlink India: భారతదేశంలో ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ సేవలకు లైసెన్స్
Starlink India Elon Musk

న్యూఢిల్లీ: ఎలాన్ మస్క్ (Elon Musk) స్థాపించిన స్టార్‌లింక్ (Starlink) ఇప్పుడు భారతదేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ (satcom) సేవలను అందించేందుకు లైసెన్స్ పొందింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం (DoT) నుంచి లైసెన్స్ పొందిన ఈ సంస్థ.. భారతదేశంలో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు సిద్ధమైంది. దీంతో స్టార్‌లింక్, DoT నుంచి లైసెన్స్ పొందిన మూడో కంపెనీగా నిలిచింది. దీని ప్రకారం ఈ సంస్థకు 15-20 రోజుల్లో ట్రయల్ స్పెక్ట్రమ్ (trial spectrum) లభిస్తుంది. అంటే, త్వరలో భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు మొదలుకానున్నాయి.


ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో..

ఈ నిర్ణయం భారత్‌లో ఇంటర్నెట్ కనెక్టివిటీని విప్లవాత్మకంగా మార్చనుంది. ప్రస్తుతం భారతదేశంలోని అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా వేగవంతమైన ఇంటర్నెట్‌ సౌకర్యం లేదు. ఇప్పుడు స్టార్‌లింక్ వంటి సంస్థలు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించడం ద్వారా, ఈ ప్రాంతాల్లోనూ మెరుగైన డిజిటల్ సేవలు లభిస్తాయి.


ఈ కంపెనీలతో ఒప్పందం..

ప్రస్తుతం భారత్‌లో ప్రముఖ టెలికాం సంస్థ అయిన భారతి ఎయిర్‌టెల్(Bharti Airtel).. ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ సంస్థతో కలిసి సేవలను అందించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు స్టార్‌లింక్ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించనుంది. మరోవైపు ప్రముఖ డిజిటల్ సేవల సంస్థ అయిన రిలయన్స్ జియో (Reliance Jio) కూడా స్టార్‌లింక్‎తో ఒప్పందం చేసుకుంది. జియో తన బ్రాడ్‌బాండ్ నెట్‌వర్క్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను వినియోగదారులకు అందించనుంది.


ప్లాన్లు ఎలా ఉంటాయ్..

స్టార్‌లింక్ ఇటీవల బంగ్లాదేశ్‌లో తన సేవలను ప్రారంభించింది. ఇందులో నెలకు సుమారు రూ. 3,000 విలువైన ఇంటర్నెట్, ఒకసారి తీసుకునే హార్డ్‌వేర్ ఖర్చు రూ. 33,000. అయితే, భారత్‌లో ఈ కంపెనీ మరింత తక్కువ ధరతో ప్లాన్లను ప్రకటించే ఛాన్సుంది. విశ్లేషకుల ప్రకారం స్టార్‌లింక్ 10 డాలర్ల (సుమారు రూ. 840) కింద ఒక ప్రమోషనల్ ధరతో అన్ లిమిటెడ్ డేటా ప్లాన్లను అందించనుంది. దీని ద్వారా కంపెనీ తన వినియోగదారుల బేస్‌ను త్వరగా పెంచుకోవాలని, 10 మిలియన్ సభ్యులను లక్ష్యంగా పెట్టుకుని, ఇంటర్నెట్‌ సేవలను అందించాలని చూస్తోంది. ఈ సంస్థ 2021 నుంచి భారత మార్కెట్లోకి రావాలని ఆసక్తితో ఉంది.


ఇవీ చదవండి:

ఆ నంబర్ల నుంచి వచ్చే ఫోన్లు అస్సలు లిఫ్ట్ చేయకండి..

సెకెండ్ హ్యాండ్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 06 , 2025 | 06:02 PM