Share News

Aadhaar Misuse Prevention: మీ ఆధార్‌ దుర్వినియోగాన్ని ఇలా నివారించండి.. ఈ పనులు మాత్రం చేయొద్దు

ABN , Publish Date - Jul 09 , 2025 | 07:11 PM

దేశంలో 12 అంకెల ఆధార్ కార్డ్ మన గుర్తింపునకు చిహ్నంగా ఉంది. కానీ దీని భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సైబర్, డేటా లీక్‌ వంటి మోసాల నుంచి ఆధార్‌ను (Aadhaar Misuse Prevention) ఎలా సురక్షితంగా ఉంచుకోవాలనే విషయాలను ఇక్కడ చూద్దాం.

Aadhaar Misuse Prevention: మీ ఆధార్‌ దుర్వినియోగాన్ని ఇలా నివారించండి.. ఈ పనులు మాత్రం చేయొద్దు
Aadhaar Misuse Prevention

దేశంలో ఆధార్‌ (Aadhaar) మన వ్యక్తిగత గుర్తింపు విషయంలో చాలా కీలక మైన గుర్తింపు కార్డుగా ఉంది. కానీ ఇటీవల కాలంలో దీనిని సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. దీంతోపాటు పలువురు వేరే వాళ్ల ఆధార్, పాన్ కార్డ్ తీసుకుని లోన్స్ సైతం తీసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో మీ ఆధార్ దుర్వినియోగానికి గురైతే అనేక సమస్యలు వచ్చే ఛాన్సుంది. కాబట్టి ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆధార్‌ను సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే దీనికోసం ఏం చేయాలి, ఏం చేయకూడదనే విషయాలను (Aadhaar Misuse Prevention) ఇక్కడ తెలుసుకుందాం.


మీ వివరాలు రహస్యం

మీ ఆధార్ సంఖ్య లేదా సంబంధిత వివరాలను తెలియని వ్యక్తులు లేదా సంస్థలతో ఎప్పుడూ పంచుకోవద్దు. ఆన్‌లైన్‌లో లేదా ఫోన్‌లో ఈ సమాచారాన్ని అందించేటప్పుడు జాగ్రత్త వహించాలి. వివరాలు అడిగిన వ్యక్తి లేదా సంస్థ ప్రామాణికత గురించి తెలుసుకోవాలి. మీ ఆధార్ సమాచారాన్ని గోప్యంగా ఉంచడం వల్ల మోసపూరిత కార్యకలాపాలకు అవకాశం ఉండదు.


మాస్క్ ఆధార్

మీ ఆధార్ కార్డు కాపీని ఎక్కడైనా సమర్పించాల్సి వచ్చినప్పుడు, మొదటి ఎనిమిది అంకెలను దాచే మాస్క్‌డ్‌ ఆధార్ కాపీని ఉపయోగించండి. ఇలా చేయడం ద్వారా మీ పూర్తి ఆధార్ సంఖ్య రహస్యంగా ఉంటుంది. అదే సమయంలో మాస్క్‌డ్ ఆధార్ కాపీలతో చోరీ, అనధికార యాక్సెస్‌ను నిరోధించవచ్చు. UIDAI వెబ్‌సైట్ నుంచి మాస్క్‌డ్ ఆధార్ కాపీని ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఆర్థిక లావాదేవీల పర్యవేక్షణ

మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, క్రెడిట్ రిపోర్ట్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. మీ ఆధార్ సంఖ్యతో ఉన్న లావాదేవీల్లో ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే, వెంటనే స్పందించడం ద్వారా ఆర్థిక నష్టాలను నివారించవచ్చు.


బయోమెట్రిక్ లాకింగ్‌

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ కార్డు దారులకు బయోమెట్రిక్ లాకింగ్ వంటి కీలక భద్రతా ఫీచర్‌ను అందిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా మీ వేలిముద్రలు, ఐరిస్ డేటాను తాత్కాలికంగా లాక్ చేసుకోవచ్చు. ఈ లాక్‌ను యాక్టివేట్ చేయడం ద్వారా, మీ బయోమెట్రిక్ డేటా అనధికారంగా ఉపయోగించబడకుండా నిరోధించవచ్చు. UIDAI పోర్టల్‌లో ఈ ఫీచర్‌ను సులభంగా సెట్ చేయవచ్చు. ఇది మీ ఆధార్‌కు రక్షణ కవచంగా పనిచేస్తుంది.


అనుమానాస్పద కార్యకలాపాలు

ఆధార్ అప్‌డేట్ లేదా KYC పేరుతో వచ్చే అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లను నమ్మకూడదు. మీ ఆధార్‌తో సంబంధం ఉన్న ఏదైనా అనధికార యాక్సెస్ లేదా దుర్వినియోగం జరిగినట్లు అనిపిస్తే వెంటనే, UIDAI అధికారిక వెబ్‌సైట్ లేదా హెల్ప్‌లైన్ నంబర్ (1947)ను సంప్రదించండి.

డిజిటల్ కాపీలు

సైబర్ మోసాలను కట్టడి చేసేందుకు ఆధార్ PDF లేదా డిజిటల్ కాపీలను పాస్‌వర్డ్‌తో రక్షించుకోండి. పబ్లిక్ WiFi ప్రాంతాలలో ఆధార్ వివరాలను యాక్సెస్ చేయవద్దు.


ఇవి కూడా చదవండి..

వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 09 , 2025 | 07:55 PM