Travis Head Record: చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్.. యాషెస్‌లో వేగవంతమైన సెంచరీ
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:36 PM
యాషెస్ సిరీస్ లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అలానే ఈ మ్యాచ్ లో ఆసీస్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ చరిత్ర సృష్టించాడు.
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్(Travis Head) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. పలు మ్యాచ్ లో SRH భారీ స్కోర్ చేయడంలో హెడ్ కీలక పాత్ర పోషించాడు. దీంతో ఇండియాలోనూ అతడికి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతడి విధ్వంసకర బ్యాటింగ్ ఎలా ఉంటుందో ఐపీఎల్ ద్వారా అందరూ చూశారు. అయితే తాజాగా యాషెస్ సిరీస్(Ashes 2025 Perth Test) లో కూడా మరోసారి తన ప్రతాపం చూపించాడు. అంతేకాక ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్‌లో ట్రావిస్ హెడ్ (Travis Head) అరుదైన ఘనత సాధించాడు. ఈ సిరీస్ లో అతి తక్కువ బంతుల్లోనే యాభై(Travis Head fastest fifty) పరుగుల మార్కు అందుకున్న బ్యాటర్ల జాబితాలో స్థానం సంపాదించాడు. పెర్త్ వేదికగా ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు రెండో రోజు(శనివారం) ఆట సందర్భంగా హెడ్ ఈ ఫీట్ నమోదు చేశాడు. కాగా ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ 2025-26కు శుక్రవారం తెరలేచింది. పెర్త్ స్టేడియంలో మొదలైన తొలి టెస్టులో టాస్ ఓడిన ఆతిథ్య ఆసీస్ తొలుత బౌలింగ్ చేయాల్సి వచ్చింది. చివరకు 205 పరుగుల టార్గెట్ తో ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.
మ్యాచ్ స్వరూపం మార్చిన హెడ్:
205 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్‌గా వచ్చిన హెడ్ ప్రారంభం నుంచే ఇంగ్లీష్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తాను ఆడేది టెస్టు అనే విషయాన్ని మర్చిపోయి.. టీ20 తరహాలో చెలరేగి ఆడాడు. ట్రావిస్ హెడ్ కేవలం 36 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా యాషెస్ సిరీస్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఐదో ప్లేయర్(Ashes records)గా నిలిచాడు. హెడ్ కంటే ముందు జాన్ బ్రౌన్ (33 బంతుల్లో), గ్రాహమ్ యాలోప్ (35), డేవిడ్ వార్నర్ (35), కెవిన్ పీటర్సన్ (36) ఈ ఘనత సాధించారు.
చరిత్ర సృష్టించిన హెడ్:
తక్కువ బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి..రికార్డు క్రియేట్ చేసిన హెడ్.. ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగించాడు. ఈ సారి 69 బంతుల్లోనే సెంచరీ(Travis Head 69-ball century) పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఇదే టెస్టులో మరో సరికొత్త చరిత్ర సృష్టించాడు. యాషెస్ సిరీస్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన రెండో బ్యాటర్‌గా ట్రావిస్ హెడ్ నిలిచాడు. అలానే లక్ష్య ఛేదనలో భాగంగా నాలుగో ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతకముందు ఆకాశమే హద్దుగా చెలరేగి కంగారూ జట్టు పేసర్ మిచెల్ స్టార్క్ ఏడు వికెట్లు తీశాడు. ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఇవీ చదవండి:
Ashes 2025: యాషెస్ చరిత్రలో 100 ఏళ్ల రికార్డు బద్దలు..
ఆ స్థానంపై ప్రయోగాలెందుకు?: ఆకాశ్ చోప్రా