Share News

Sunrisers Hyderabad Victory: రైజర్స్‌ రేసులోనే

ABN , Publish Date - Apr 26 , 2025 | 03:59 AM

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి కీలక విజయం సాధించింది.హర్షల్‌ 4 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించిన మ్యాచ్‌లో చెన్నై ప్లేఆఫ్స్‌ అవకాశాలు చేజారిపోయాయి

 Sunrisers Hyderabad Victory: రైజర్స్‌  రేసులోనే

  • ఆదుకున్న ఇషాన్‌, కమిందు

  • చెన్నై ఆశలు గల్లంతే

  • హర్షల్‌కు నాలుగు వికెట్లు

  • 1 చెపాక్‌లో తొలిసారి చెన్నైని ఓడించిన సన్‌రైజర్స్‌

  • కెరీర్‌లో 400 టీ20 మ్యాచ్‌లాడిన నాలుగో భారత ఆటగాడిగా ధోనీ. రోహిత్‌ (456), దినేశ్‌ కార్తీక్‌ (412), విరాట్‌ (408) ముందున్నారు.

  • 4 ఐపీఎల్‌లో ఇన్నింగ్స్‌ తొలి బంతికే వికెట్‌ తీయడం షమికిది నాలుగోసారి.

చెన్నై: ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇరు జట్లదీ కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి. ఈ దశలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కాస్త తడబడినా కీలక విజయం అందుకుంది. ఇషాన్‌ కిషన్‌ (34 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 44), కమిందు మెండిస్‌ (22 బంతుల్లో 3 ఫోర్లతో 32 నాటౌట్‌) సమయోచిత బ్యాటింగ్‌తో 5 వికెట్ల తేడాతో గట్టెక్కించారు. అటు సొంత మైదానంలోనూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరోసారి చేతులెత్తేసింది. బౌలర్లు కాస్త ఆశలు రేపినా.. చివర్లో తడబాటుతో చెపాక్‌లో వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. దీంతో ధోనీ సేన మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో గెలిచినా ప్లేఆఫ్స్‌ బెర్త్‌ కష్టమే. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా చెన్నై 19.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. బ్రెవిస్‌ (25 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లతో 42), ఆయుష్‌ మాత్రే (19 బంతుల్లో 6 ఫోర్లతో 30), దీపక్‌ హుడా (21 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌తో 22) రాణించారు. హర్షల్‌కు 4, కమిన్స్‌, ఉనాద్కట్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో సన్‌రైజర్స్‌ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 155 రన్స్‌ చేసి నెగ్గింది. హెడ్‌ (19), అనికేత్‌ (19), నితీశ్‌ (19 నాటౌట్‌) ఆకట్టుకున్నారు. నూర్‌కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా హర్షల్‌ నిలిచాడు.


ఆరంభంలో తడబడినా..: స్వల్ప ఛేదన.. పైగా మంచు ప్రభావం కూడా ఎక్కువే ఉండడంతో సన్‌రైజర్స్‌ సునాయాసంగా మ్యాచ్‌ను ముగిస్తుందని అంతా భావించారు. కానీ స్లో పిచ్‌పై సీఎ్‌సకే బౌలర్లు పట్టు వదల్లేదు. పరుగులను కట్టడి చేయడంతో పాటు వరుస విరామాల్లో వికెట్లు తీశారు. అయితే ఇషాన్‌తో పాటు మిడిలార్డర్‌లో కమిందు, నితీశ్‌ రాణించడంతో ఊపిరిపీల్చుకుంది. అంతకుముందు ఇన్నింగ్స్‌ రెండో బంతికే ఓపెనర్‌ అభిషేక్‌ను పేసర్‌ ఖలీల్‌ డకౌట్‌ చేశాడు. ఇక మరో ఓపెనర్‌ హెడ్‌ను అన్షుల్‌ బౌల్డ్‌ చేయడంతో పవర్‌ప్లేలో జట్టు 37/2 స్కోరు మాత్రమే చేసింది. ఆ తర్వాత ప్రమాదకర క్లాసెన్‌ (7)ను జడ్డూ అవుట్‌ చేయడంతో రైజర్స్‌ షాక్‌కు గురైంది. ఈ దశలో ఇషాన్‌కు జత కలిసిన అనికేత్‌ కాసేపు పోరాడాడు. చక్కగా కుదురుకున్న ఈ జోడీని నూర్‌ వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చడంతో సీఎ్‌సకే పోటీలోకి వచ్చినట్టయ్యింది. నాలుగో వికెట్‌కు వీరి మధ్య 36 పరుగులు జత చేరాయి. అయితే డెత్‌ ఓవర్లలో బౌలర్లు లయ తప్పడంతో రైజర్స్‌ పని సులువైంది. కమిందు, నితీశ్‌ ఇబ్బంది లేకుండా ఆడేస్తూ సులువుగా బౌండరీలు రాబట్టారు. దీంతో మరో 8 బంతులుండగానే మ్యాచ్‌ ముగిసింది.


ఆదుకున్న బ్రెవిస్‌: టాస్‌ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు బ్యాటింగ్‌ ఎప్పటిలాగే పేలవంగా సాగింది. వీరి ఇన్నింగ్స్‌లో మొదట ఓపెనర్‌ ఆయుష్‌ మాత్రే.. మధ్య ఓవర్లలో బ్రెవిస్‌ జోరు తప్ప చెప్పుకోవడానికేమీ లేదు. ఇక సీనియర్‌ ఆటగాళ్లు జడేజా (21), దూబే (12), ధోనీ (6) కీలక సమయాల్లో వెనుదిరగడంతో ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. ఇన్నింగ్స్‌ తొలి బంతికే ఓపెనర్‌ రషీద్‌ (0)ను పేసర్‌ షమి అవుట్‌ చేయగా, సామ్‌ కర్రాన్‌ (9) వన్‌డౌన్‌లో బరిలోకి దిగాడు. మాత్రే జోరుతో పవర్‌ప్లేలో 50 పరుగులు సాధించింది. అయితే అప్పటికే వరుస ఓవర్లలో కర్రాన్‌, మాత్రే పెవిలియన్‌కు చేరారు. ఇక జడ్డూ పదో ఓవర్‌లో కమిందుకు చిక్కాడు. 74/4తో ఇబ్బందుల్లో పడిన జట్టును బ్రెవిస్‌ ఆదుకున్నాడు. మరో ఎండ్‌లో దూబే ఉన్నా రైజర్స్‌ బౌలర్లు కట్టడి చేశారు. కానీ సీఎ్‌సకే తరఫున తొలి మ్యాచ్‌ ఆడిన బ్రెవిస్‌ మాత్రం తన సహజశైలిలో చెలరేగాడు. దీనికితోడు 12వ ఓవర్‌లో మూడు సిక్సర్లతో 20 పరుగులందించాడు. ఆ వెంటనే హర్షల్‌ ఓవర్‌లోనూ భారీ సిక్స్‌ బాదినా కమిందు కళ్లు చెదిరే క్యాచ్‌తో వెనుదిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత భారీ షాట్‌కు వెళ్లి దూబే.. కాసేపటికే ధోనీ (6) పెవిలియన్‌కు చేరి ఫ్యాన్స్‌ను నిరాశపరిచారు. టెయిలెండర్లను హర్షల్‌ కుదురుకోనీయలేదు. చివర్లో దీపక్‌ హుడా కాసిన్ని పరుగులు జత చేయడంతో స్కోరు 150కి చేరగలిగింది.


స్కోరుబోర్డు

చెన్నై: షేక్‌ రషీద్‌ (సి) అభిషేక్‌ (బి) షమి 0, ఆయుష్‌ మాత్రే (సి) ఇషాన్‌ (బి) కమిన్స్‌ 30, సామ్‌ కర్రాన్‌ (సి) అనికేత్‌ (బి) హర్షల్‌ 9, జడేజా (బి) మెండిస్‌ 21, బ్రెవిస్‌ (సి) మెండిస్‌ (బి) హర్షల్‌ 42, శివమ్‌ దూబే (సి) అభిషేక్‌ (బి) ఉనాద్కట్‌ 12, దీపక్‌ హుడా (సి) అభిషేక్‌ (బి) ఉనాద్కట్‌ 22, ధోనీ (సి) అభిషేక్‌ (బి) హర్షల్‌ 6, అన్షుల్‌ (సి) క్లాసెన్‌ (బి) కమిన్స్‌ 2, నూర్‌ అహ్మద్‌ (సి) షమి (బి) హర్షల్‌ 2, ఖలీల్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 19.5 ఓవర్లలో 154 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-0, 2-39, 3-47, 4-74, 5-114, 6-118, 7-131, 8-134, 9-137, 10-154; బౌలింగ్‌: షమి 3-0-28-1, కమిన్స్‌ 4-0-21-2, జైదేవ్‌ ఉనాద్కట్‌ 2.5-0-21-2, హర్షల్‌ పటేల్‌ 4-0-28-4, జీషన్‌ అన్సారి 3-0-27-0, కమిందు మెండిస్‌ 3-0-26-1.

సన్‌రైజర్స్‌: అభిషేక్‌ (సి) ఆయుష్‌ (బి) ఖలీల్‌ 0, హెడ్‌ (బి) అన్షుల్‌ 19, ఇషాన్‌ (సి) కర్రాన్‌ (బి) నూర్‌ 44, క్లాసెన్‌ (సి) హుడా (బి) జడేజా 7, అనికేత్‌ (సి) హుడా (బి) నూర్‌ 19, మెండిస్‌ (నాటౌట్‌) 32, నితీశ్‌ (నాటౌట్‌) 19, ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 18.4 ఓవర్లలో 155/5; వికెట్ల పతనం: 1-0, 2-37, 3-54, 4-90, 5-106; బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 3-0-21-1, అన్షుల్‌ 3-0-16-1, నూర్‌ అహ్మద్‌ 4-0-42-2, జడేజా 3.4-0-22-1, కర్రాన్‌ 2-0-25-0, పథిరన 3-0-27-0.

Updated Date - Apr 26 , 2025 | 03:59 AM