BCCI Central Contracts: రోహిత్, విరాట్ టాప్‌లోనే
ABN , Publish Date - Apr 22 , 2025 | 03:32 AM
బీసీసీఐ విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్టుల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎ+ గ్రేడ్‌లో కొనసాగుతున్నారు. శ్రేయాస్, ఇషాన్ తిరిగి జాబితాలోకి వచ్చారు. తెలుగు ఆటగాళ్లలో సిరాజ్, నితీశ్ కుమార్, తిలక్ వర్మకు చోటు దక్కింది

శ్రేయాస్, ఇషాన్‌కు చాన్స్
గ్రేడ్ ‘సి’లో నితీశ్, తిలక్, అభిషేక్
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ల విడుదల
న్యూఢిల్లీ: స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో తమ ఎ+ గ్రేడ్‌ను నిలబెట్టుకున్నారు. టీ20 కెరీర్‌కు వీడ్కోలు పలకడంతో వీరికి దక్కే గ్రేడ్‌పై ఉత్కంఠ నెలకొంది. తాజాగా సోమవారం 34 మందితో కూడిన ఎ+, ఎ, బి, సి కాంట్రాక్ట్ జాబితాను బోర్డు ప్రకటించింది. అయితే ఈ జాబితా 2024 అక్టోబరు 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు మాత్రమే వర్తించనుంది. దీంట్లో ఎప్పటిలాగే కెప్టెన్ రోహిత్, విరాట్‌లకు ఎ+ గ్రేడ్ దక్కింది. పేసర్ బుమ్రా, రవీంద్ర జడేజా కూడా వీరితో పాటున్నారు. జడ్డూ కూడా పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే నిబంధనల ప్రకారం మూడు ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన కనబర్చిన ప్లేయర్లకే ఏ+ గ్రేడ్‌లో చోటు దక్కుతుంది. కానీ రోహిత్, విరాట్, జడేజా ప్రస్తుతం రెండు ఫార్మాట్లకే పరిమితమయ్యారు. మరి వీరికి ఎ+లో ఎందుకు చోటు కల్పించారనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘గతేడాది అక్టోబరు నుంచి వర్తించే ఈ జాబితాలో 2023 ప్రదర్శన ఆధారంగానే ఆటగాళ్ల ఎంపిక ఉంటుంది. కాబట్టి వారు ఆ సమయంలో టీ20 వరల్డ్‌క్‌పతో పాటు మూడు ఫార్మాట్లలోనూ ఆడారు’ అని బోర్డు అధికారి పేర్కొన్నాడు. ఈ నలుగురికి ఏడాదికి రూ.7 కోట్లు అందుతాయి.
శ్రేయాస్, ఇషాన్ వచ్చేశారు: దేశవాళీ క్రికెట్‌ను విస్మరించినందుకు గతేడాది కాంట్రాక్ట్ జాబితా నుంచి శ్రేయాస్, ఇషాన్‌లను బోర్డు తొలగించింది. అయితే తాజాగా శ్రేయా్‌సకు నేరుగా గ్రూప్ ‘బి’లో చోటు దక్కగా.. ఇషాన్‌ను గ్రూప్ ‘సి’లో చేర్చారు. అలాగే రిషభ్ పంత్.. అశ్విన్ స్థానంలో గ్రూప్ ‘ఎ’కు ప్రమోట్ అయ్యాడు. ఇక గ్రూప్ ‘సి’లో 17 నుంచి 19కి ఆటగాళ్ల సంఖ్యను పెంచారు. సర్ఫరాజ్, జురెల్‌తో పాటు ఆంధ్ర క్రికెటర్ నితీశ్‌కుమార్, అభిషేక్, హర్షిత్, వరుణ్‌లకు తొలిసారి చోటు దక్కింది. మరోవైపు గ్రేడ్ ‘సి’లో ఉన్న శార్దూల్, కేఎస్ భరత్, జితేశ్, అవేశ్‌లను జాబితా నుంచి తొలగించారు. తెలుగు ఆటగాళ్లను పరిశీలిస్తే..గ్రేడ్-ఎలో సిరాజ్, గ్రేడ్-సిలో నితీశ్ కుమార్, తిలక్‌వర్మ ఉన్నారు.