Share News

AUS vs IND: వర్షార్పణం.. తొలి టీ20 రద్దు

ABN , Publish Date - Oct 29 , 2025 | 05:17 PM

టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య కాన్‌బెర్రా వేదికగా బుధవారం మొదలైన తొలి టీ20 వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దు అయింది. కేవలం 9.4 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆట నిలిచిపోయే సమయానికి వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.

AUS vs IND: వర్షార్పణం.. తొలి టీ20 రద్దు

కాన్‌బెర్రా, అక్టోబర్ 29: టీమిండియా-ఆస్ట్రేలియా (AUS vs IND)మధ్య కాన్‌బెర్రా వేదికగా బుధవారం మొదలైన తొలి టీ20(Canberra T20) వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దు అయింది. కేవలం 9.4 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆట నిలిచిపోయే సమయానికి వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.


బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా(Team India) మొదటి నుంచే దూకుడుగా ఆడే ప్రయత్నం చేసింది. ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ(Abhishek Sharma) క్రీజులో ఉన్నంత సేపు దూకుడు ప్రదర్శించినా అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు. నాథన్ ఎల్లిస్(Nathan Ellis) బౌలింగ్‌లో అతడు ఫీల్డర్ మీదుగా ఫోర్ కొట్టే ప్రయత్నంలో బంతిని గాల్లోకి లేపాడు. దాన్ని టిమ్ డేవిడ్ ఎలాంటి పొరపాటు చేయకుండా ఒడిసి పట్టుకున్నాడు. దీంతో అభిషేక్ శర్మ 19 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా తన తొలి వికెట్‌ను 35 పరుగుల వద్ద కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, గిల్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.


ఈ క్రమంలో 5 ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. తర్వాత కాసేపటికి వాన ఆగిపోవడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. అయితే ఆటను అప్పటికే 18 ఓవర్లకు కుదించారు. సూర్య 18 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. జేవియర్ బ్రేట్‌లెట్ బౌలింగ్‌లో సూర్య ఇచ్చిన క్యాచ్‌ను జోష్ ఫిలిఫ్ పట్టుకోలేకపోయాడు. అనంతరం మరింత జాగ్రత్తగా ఆడిన గిల్, సూర్య రెండో వికెట్‌కు 32 బంతుల్లోనే అర్థ శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.


రికార్డు సృష్టించిన సూర్య..

టీమిండియా ఆటగాళ్లు మరింత దూకుడుగా ఆడుతున్న తరుణంలోనే 9.4 ఓవర్ల వద్ద వరుణుడు మరోసారి ఆటకు ఆటంకం కలిగించాడు. అప్పటికి భారత్ స్కోర్ వికెట్ నష్టానికి 97 పరుగులు. రెండోసారి మ్యాచ్ ఆగడానికి ముందు నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో సూర్య సూపర్ సిక్స్ బాదాడు. ఇది అతడికి టీ20ల్లో 150వ సిక్స్. అతడు 86 ఇన్నింగ్స్‌ల్లో, 1649 బంతులు ఎదుర్కొని ఈ ఘనతను సాధించాడు. తర్వాత ఆటను కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను అర్ధాంతరంగా ముగించారు. మ్యాచ్ ఆగే సమయానికి క్రీజులో శుభ్‌మన్ గిల్(37), సూర్యకుమార్ యాదవ్(39) నాటౌట్‌గా నిలిచారు.


Also Read:

రింకూ సింగ్-ప్రియ సరోజ్ లవ్ స్టోరీ రివీల్

సూర్య బ్యాట్‌తోనే సమాధానం ఇస్తాడు: అభిషేక్ నాయర్

Updated Date - Oct 29 , 2025 | 05:17 PM