French Open 2025 Final: ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆల్‌టైమ్ రికార్డ్.. 134 ఏళ్లలో ఇదే తొలిసారి!
ABN , Publish Date - Jun 09 , 2025 | 09:10 AM
ఫ్రెంచ్ ఓపెన్ 2025 ఫైనల్‌లో ఓ ఆల్‌టైమ్ రికార్డ్ నమోదైంది. ఇప్పటివరకు ఎర్రమట్టి కోటలో ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతను కార్లోస్ అల్కరాజ్-సిన్నర్ సొంతం చేసుకున్నారు.

సాధారణంగా టెన్నిస్ మ్యాచులు పూర్తవడానికి కనీసం గంటన్నర సమయం పడుతుంది. ఒకవేళ బరిలో ఉన్న ప్లేయర్లు నువ్వానేనా అంటూ హోరాహోరీగా తలపడితే మ్యాచ్ ముగియడానికి 2 నుంచి రెండున్నర గంటల సమయం కూడా పడుతుంది. ఓటమి ఒప్పుకోని కొందరు దిగ్గజాలు మ్యాచుల్ని 4 నుంచి 5 గంటలకు తీసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. నొవాక్ జొకోవిచ్, రఫేల్ నడాల్, ఫెడరర్ వంటి మోడ్నర్స్ మాస్టర్స్ గంటల కొద్దీ ఆడుతూ టెన్నిస్‌పై ఆసక్తిని మరింత పెంచేశారు. అయితే ఈ గేమ్‌లో ఎన్నో అసాధ్యమైన రికార్డులు అందుకున్న వీరు ఎర్రమట్టి కోటలో ఓ అరుదైన ఘనతను మిస్ అయ్యారు. దాన్ని కార్లోస్ అల్కరాజ్-సిన్నర్ సాధించి చూపించారు. 43 ఏళ్ల రికార్డును వీళ్లు బద్దలుకొట్టారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
వాటే మ్యాచ్..
ఫ్రెంచ్ ఓపెన్-2025ను డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం రాత్రి జరిగిన టైటిల్ ఫైట్‌లో 4-6, 6-7 (4-7), 6-4, 7-6 (7-3), 7-6 (10-2)తో టాప్ సీడ్ సిన్నర్ మీద చిరస్మరణీయ విజయం సాధించాడు. తొలి రెండు సెట్లు కోల్పోయాక, ఓటమి తప్పదనే పరిస్థితి నుంచి పుంజుకొని అల్కరాజ్ ట్రోఫీని కైవసం చేసుకోవడం హైలైట్ అనే చెప్పాలి. ఈ మ్యాచ్ 5 గంటల 29 నిమిషాల పాటు సాగడం మరో విశేషం. 134 ఏళ్ల రొలాండ్ గారోస్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన ఫైనల్‌గా ఈ మ్యాచ్ రికార్డులకెక్కింది. ఆ రకంగా అల్కరాజ్-సిన్నర్ ఆల్‌టైర్ రికార్డులో భాగమయ్యారు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్-1982 మ్యాచ్ 4 గంటల 47 నిమిషాల పాటు సాగింది. గెలుపు కోసం మాట్స్ విలాండర్-గులెర్మో విలాస్ చివరి వరకు పోరాడారు. ఆ రికార్డును అల్కరాజ్-సిన్నర్ బ్రేక్ చేసి ఆల్‌టైమ్ రికార్డ్ నెలకొల్పారు.
ఇవీ చదవండి:
మరిన్నిక్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి