Angelo Mathews: 16 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై.. లంక స్టార్ సంచలన నిర్ణయం!
ABN , Publish Date - May 23 , 2025 | 05:50 PM
శ్రీలంక వెటరన్ బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దశాబ్దంన్నర కాలంగా లంక బ్యాటింగ్‌కు మూలస్తంభంగా ఉంటూ వచ్చిన ఈ స్టార్ ప్లేయర్.. ఊహించని నిర్ణయంతో అభిమానులకు షాక్ ఇచ్చాడు.

శ్రీలంక జట్టుకు అన్నీ తానై నడిపిస్తున్న స్టార్ బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ రిటైర్‌మెంట్ ఇచ్చేశాడు. టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు. సోషల్ మీడియా ద్వారా తన నిర్ణయాన్ని అతడు వెల్లడించాడు. 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు అతడు తెలిపాడు. వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ అనంతరం టెస్టులకు స్వస్తి పలుకుతానని అతడు స్పష్టం చేశాడు. అయితే వైట్‌బాల్ క్రికెట్‌లో మాత్రం కొనసాగుతానని క్లారిటీ ఇచ్చాడు. దీంతో అటు అభిమానుల నుంచి ఇటు క్రికెట్ లవర్స్ వరకు అంతా భావోద్వేగానికి లోనవుతున్నారు. అసలే మునుపటి ప్రాభవం కోల్పోయి పసికూనలా మారిన లంకకు.. ఇది కోలుకోలేని దెబ్బ అనే కామెంట్స్ వస్తున్నాయి. మాథ్యూస్ రిటైర్‌మెంట్‌తో ఒక శకం ముగిసిందని.. ఇక ఆ టీమ్‌కు దిక్కెవరు అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
వాళ్ల వల్లే సాధ్యం!
ఇన్నేళ్ల పాటు దేశానికి సేవ చేసినందుకు సంతోషంగా, గర్వంగా ఉందన్నాడు మాథ్యూస్. తనకు సహకరించిన కుటుంబీకులు, మిత్రులు, సహచరులు, అభిమానులతో పాటు లంక క్రికెట్‌కు ధన్యవాదాలు తెలిపాడు. అందరి అండతోనే ఈ అందమైన ప్రయాణం సాధ్యమైందన్నాడు మాథ్యూస్. కాగా, 2009లో గాలె వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్‌తో అరంగేట్రం చేశాడీ సీనియర్ బ్యాటర్. సాలిడ్ డిఫెన్స్, స్టైలిష్ షాట్లతో అభిమానుల మనసులు దోచుకున్నాడు. మహేల జయవర్దనే, కుమార సంగక్కర లాంటి దిగ్గజాలతో కలసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నాడు. దినేష్ చండిమాల్‌తో కలసి సమర్థంగా జట్టును నడిపించాడు. గాయాల కారణంగా పూర్తిస్థాయిలో తన ప్రభావం చూపించకపోయినా వందకు పైగా టెస్టులు ఆడాడు. మొత్తంగా 118 టెస్టుల్లో 44.62 సగటుతో 8,167 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇవీ చదవండి:
రోకో రిటైర్‌మెంట్‌పై గంభీర్ రియాక్షన్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి