French Open Final 2025: సబలెంకా వర్సెస్ కోకోగాఫ్.. ఎర్రమట్టి కోటకు కొత్త క్వీన్ ఎవరో?
ABN , Publish Date - Jun 07 , 2025 | 02:12 PM
ఎర్రమట్టి కోటను కైవసం చేసుకునేందుకు ఇద్దరు యోధులు ప్రయత్నిస్తున్నారు. కోటకు కొత్త రాణి ఎవరనేది ఇవాళ తేలిపోనుంది. ఇద్దరిలో ఎవరు నెగ్గినా కొత్త చరిత్రే అవుతుంది.

ఇద్దరు సమవుజ్జీలు. గెలుపు కోసం చివరి వరకు పోరాడే యోధులు. ఓటమిని ఒప్పుకోని తత్వం వారిది. బరిలోకి దిగితే చివరి క్షణం వరకు పోరాడుతూనే ఉంటారు. ఇద్దరూ ఎదురుపడిన ప్రతిసారి మైదానం యుద్ధక్షేత్రంలా మారిపోతుంది. మ్యాచ్ ఆడుతున్నారా? యుద్ధం చేస్తున్నారా? అనేలా వాళ్ల పోరాటం సాగుతుంది. వాళ్లు మరెవరో కాదు.. స్టార్ టెన్నిస్ ప్లేయర్లు సబలెంకా (బెలారస్), కోకోగాఫ్ (అమెరికా). ఢీ అంటే ఢీ అంటూ పోరాడే ఈ ఇద్దరి మధ్య ఇవాళ కీలక పోరు జరగనుంది. ఫ్రెంచ్ ఓపెన్-2025 ఫైనల్‌లో తలపడుతున్నారు సబలెంకా-కోకోగాఫ్. ఎవరు గెలిచినా కొత్త చరిత్రే అవుతుంది. మరి.. వీళ్లలో ఎవరి వైపు మొగ్గు ఎక్కువగా ఉందో ఇప్పుడు చూద్దాం..
ఎవరు ఫేవరెట్..
ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్‌కు సర్వం సిద్ధమైంది. ఎర్రమట్టి కోటకు కొత్త రాణి అవ్వాలని అటు సబలెంకా.. ఇటు కోకోగాఫ్ ఇద్దరూ తహతహలాడుతున్నారు. ఇప్పటికే 3 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించిన సబలెంకా.. మరో ట్రోఫీని సొంతం చేసుకోవాలని చూస్తోంది. రెండో సీడ్ కోకోగాఫ్ కూడా ఈ చాన్స్‌ను అస్సలు వదలొద్దనే పట్టుదలతో కనిపిస్తోంది. అయితే సబలెంకా దూకుడు ముందు కోకోగాఫ్ నిలుస్తుందా అనేది సందేహమే. ఎందుకంటే 26 వరుస విక్టరీలతో బ్రేకుల్లేని బుల్డోజర్‌లా దూసుకెళ్తున్న ఇగా స్వైటెక్‌ను సెమీఫైనల్‌లో ఓడించింది సబలెంకా. కాబట్టి ఆమెనే ఫేవరెట్‌గా కనిపిస్తోంది.
ఢీ అంటే ఢీ..
సబలెంకా-కోకోగాఫ్ ఇప్పటివరకు 10 సార్లు తలపడ్డారు. ఇద్దరూ చెరో ఐదు మ్యాచుల్లో విజయఢంకా మోగించారు. గ్రాండ్‌స్లామ్స్‌లో రెండుసార్లు ఎదురుపడి ఒక్కో మ్యాచ్ నెగ్గారు. వీళ్ల మధ్య రికార్డు 1-1తో సమంగా ఉంది. యూఎస్ ఓపెన్-2023 ఫైనల్‌లో సబలెంకను కొకొగాఫ్ మట్టికరిపించగా.. ఈ ఏడాది జరిగిన మాడ్రిడ్ ఓపెన్ ఫైనల్‌లో గాఫ్ మీద సబలెంకా విక్టరీ కొట్టింది. రికార్డుల పరంగా ఇద్దరూ సమంగానే ఉన్నా.. ఫామ్ పరంగా సబలెంకా ముందంజలో ఉంది. ఫ్రెంచ్ ఓపెన్-2013 అనంతరం రొలాండ్ గారోస్‌లో టాప్-2 సీడ్స్ ఎదురుపడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి