Share News

Commonwealth Games: అహ్మదాబాద్‌లోనే 2030 కామన్‌వెల్త్ గేమ్స్

ABN , Publish Date - Nov 26 , 2025 | 08:20 PM

2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ హక్కులు భారత్‌కే దక్కాయి. అహ్మదాబాద్ వేదికగా ఈసారి కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి. దీని కోసం నైజీరియాలోని అబుజా పోటీ పడగా.. ఎగ్జిక్యూటివ్ బోర్డు అహ్మదాబాద్ వైపే మొగ్గు చూపింది.

Commonwealth Games: అహ్మదాబాద్‌లోనే 2030 కామన్‌వెల్త్ గేమ్స్
Common wealth Games

ఇంటర్నెట్ డెస్క్: 2030 కామన్వెల్త్ గేమ్స్(Commonwealth Games) నిర్వహణ హక్కులు భారత్‌కే దక్కాయి. నెల కిందే ఇది దాదాపు ఖాయమైనప్పటికీ.. బుధవారం గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్‌ స్పోర్ట్‌ వార్షిక సర్వసభ్య సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. అయితే ఈసారి దీనికి వేదికగా అహ్మదాబాద్ నిలవనుంది. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వాలని భారత్ కోరుకుంటున్న సమయంలో.. ఈ కామన్వెల్త్ గేమ్స ఆతిథ్య హక్కులు దక్కడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రీడలకు 2030లో వందేళ్లు పూర్తి కానుండటం విశేషం. వీటి నిర్వహణ కోసం నైజీరియా నగరం అబుజా నుంచి పోటీ ఎదురు కాగా.. ఎగ్జిక్యూటివ్ బోర్డు అహ్మదాబాద్ వైపే మొగ్గు చూపింది. కాగా 2010 కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ ఢిల్లీలో ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే.


అమిత్ షా స్పందన..

‘అహ్మదాబాద్‌లో 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న సందర్భంగా ప్రతి పౌరుడికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు. మన భారత్‌ను ప్రపంచ క్రీడా కేంద్రంగా మార్చాలనే ప్రధాని మోదీ దార్శనికతకు ఇది నిదర్శం. దశాబ్దానికి పైగా సాగిన కృషితో ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను మోదీ అభివృద్ధి చేశారు. సమర్థమైన పాలన ద్వారా మన దేశ సామర్థ్యాన్ని మెరుగుపరిచారు’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.


15-17 క్రీడాంశాల్లో పోటీలు

2030 కామన్వెల్త్ గేమ్స్ మొత్తం 15-1 క్రీడాంశాల్లో పోటీలు ఉండనున్నట్లు కామన్వెల్త్ స్పోర్ట్ ధ్రువీకరించింది. వీటిలో అథ్లెటిక్స్‌, స్విమ్మింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌, నెట్‌బాల్‌, బాక్సింగ్‌ సహా మరికొన్ని ఇప్పటికే ఖరారయ్యాయి. ఇంకొన్నింటిని ఎంపిక చేసే ప్రక్రియ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. ఆర్చరీ, బ్యాడ్మింటన్‌, హాకీ, జూడో, షూటింగ్‌, స్క్వాష్‌, వీల్‌ఛైర్‌ బాస్కెట్‌బాల్‌, బీచ్‌ వాలీబాల్‌, టీ20 క్రికెట్‌, సైక్లింగ్‌, డైవింగ్‌, రగ్బీ సెవెన్స్‌ వంటివి పరిశీలనలో ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

పుజారా బావమరిది ఆత్మహత్య

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. రోహిత్ శర్మదే టాప్ ప్లేస్!

Updated Date - Nov 26 , 2025 | 08:20 PM