Car parking: అక్కడ.. 800 కార్లు పార్క్ చేయొచ్చు...
ABN , Publish Date - Nov 16 , 2025 | 01:35 PM
కారు తీసుకుని బయటకు వెళితే పార్కింగ్ సమస్య వేధిస్తుంది. కారులో వెళ్లామనే ఆనందం కన్నా... ఎక్కడ పార్కు చేయాలనే ఆందోళనే ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు నగరాల్లో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కోసం ప్రత్యేక నిర్మాణాలు చేపడుతున్నారు.
నగరాల్లో కార్ల పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు ‘మల్టీ లెవెల్ కార్ పార్కింగ్’ నిర్మాణాలు చూస్తూనే ఉన్నాం. జర్మనీలోని వోల్ఫ్స్‌బర్గ్‌లోనూ అలాంటి కార్ పార్కింగ్ టవర్స్ రెండు ఉన్నాయి. వాటి ప్రత్యేకత ఏమిటంటే...
కారు తీసుకుని బయటకు వెళితే పార్కింగ్ సమస్య వేధిస్తుంది. కారులో వెళ్లామనే ఆనందం కన్నా... ఎక్కడ పార్కు చేయాలనే ఆందోళనే ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు నగరాల్లో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కోసం ప్రత్యేక నిర్మాణాలు చేపడుతున్నారు. కోల్‌కతా, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్(Kolkata, Mumbai, Bangalore, Hyderabad) వంటి ప్రధాన నగరాల్లో ఈ తరహా పార్కింగ్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. జర్మనీలోని వోల్ఫ్స్‌బర్గ్‌లో సైతం మల్టీ లెవెల్ పార్కింగ్ కోసం రెండు భారీ టవర్స్‌ను నిర్మించారు. అయితే ఈ పార్కింగ్ వోక్స్‌వాగన్ ఫ్యాక్టరీ నుంచి తయారై వచ్చే కొత్త కార్ల కోసమే సుమా. రాత్రుళ్లు అద్దాల కాంతులతో మెరిసిపోయే ఈ టవర్స్‌లో ఒక్కోదాంట్లో 400 కార్లు (మొత్తంగా 800) పార్క్ చేసే వీలుంది. ఈ ప్రదేశాన్ని ‘ఆటోస్టాడ్’ అని పిలుస్తారు.

అత్యంత వేగవంతమైన పార్కింగ్
వోక్స్‌వాగన్ కంపెనీ పక్కనే ఈ టవర్లు ఉన్నాయి. కంపెనీలో తయారైన కార్లు అండర్‌గ్రౌండ్ టన్నెల్ ద్వారా టవర్స్ బేస్‌మెంట్‌కు చేరుకుంటాయి. ఒక కన్వేయర్ బెల్ట్ ద్వారా కార్లు పార్కింగ్ ప్రదేశానికి వస్తాయి. అక్కడి నుంచి టవర్స్‌లో వాటిని పార్క్ చేస్తారు. ఒక్కో టవర్‌లోని 20 అంతస్తుల్లో కార్లు పార్క్ చేసే వీలుంది. వినియోగదారులు ఇక్కడి నుంచి నేరుగా కార్లు కొనుగోలు చేస్తుంటారు. సందర్శకులు అక్కడికే వెళ్లి వీక్షించే సౌలభ్యమూ ఉంది. ఏటా సుమారు 2 లక్షల వాహనాలు ఇక్కడ అమ్ముడుపోతుంటాయట.

రోజూ సగటున 500 కార్లు ఇక్కడి నుంచి డెలివరీ అవుతుంటాయి. జర్మనీలో వోక్స్‌వాగన్ కారు కొనాలనుకున్న వారిలో 37 శాతం మంది ‘వోల్ఫ్స్‌బర్గ్’ వెళ్లి కొనుగోలు చేస్తుంటారు. సగటున 1 నిమిషం 44 సెకన్లలో టవర్స్‌లో నుంచి కారును తీసి వినియోగదారులకు డెలివరీ చేస్తారు. ‘ఫాస్టెస్ట్ ఆటోమెటెడ్ పార్కింగ్ ఫెసిలిటీ’ ఉన్న సంస్థ వోక్స్‌వ్యాగన్ ‘ఆటోస్టాడ్’ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. మాయా మహల్‌లా కనిపించే ఈ అత్యాధునిక టవర్స్‌ను చూసేందుకు పర్యాటకులు అమితాసక్తి కనబరుస్తుంటారు.
