Share News

Manga Doomsday: జపాన్‌లో సునామీ అంటూ జనాల్లో భయాలు.. ఎందుకో తెలిస్తే..

ABN , Publish Date - Jul 03 , 2025 | 09:24 PM

ఎల్లుండి జపాన్‌‌ను సునామీ ముంచెత్తుతుందన్న భయాలు హాంకాంగ్‌లో మిన్నంటాయి. దీంతో, పర్యాటకుల రాక భారీగా పడిపోయింది. సునామీకి సంబంధించి ఓ ఆర్టిస్ట్ తన రేఖా చిత్రాల్లో చేసిన హెచ్చరికలు గతంలో నిజం కావడంతో ఈసారి కూడా విపత్తు తప్పదని జనాలు వణికిపోతున్నారు.

Manga Doomsday: జపాన్‌లో సునామీ అంటూ జనాల్లో భయాలు.. ఎందుకో తెలిస్తే..
Japan Manga Doomsday Prediction

ఇంటర్నెట్ డెస్క్: జులై 5న జపాన్‌లో సునామీ సంభవిస్తుందన్న భయాలు ఆకాశాన్నంటాయి. ఓ మాంగా కార్టూన్ జోస్యం నిజమవుతుందన్న భయంతో వణికిపోతున్న హాంకాంగ్ పర్యాటకులు జపాన్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఈ జోస్యం నెట్టింట కూడా వైరల్ కావడంతో పర్యాటకులు తమ ముందస్తు ప్లాన్‌లు అన్నీ రద్దు చేసుకుంటున్నారు. హోటల్ గదుల బుకింగ్, ఫ్లైట్ టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకుంటున్నారు (Japan Manga Doomsday Prediction).

ఏప్రిల్‌లో జపాన్‌కు పర్యాటకులు రికార్డు స్థాయిలో పోటెత్తారు. ఏకంగా 3.9 మిలియన్‌ల మంది జపాన్‌ను సందర్శించారు. అయితే, మే నెల నుంచీ సీన్ తిరగబడింది. పర్యాటకుల రాక ఏకంగా 11 శాతం తగ్గింది. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారిన మాంగా కార్టూనే ఈ పరిస్థితికి కారణమని జపాన్‌లోని హోటళ్ల యజమానులు టూరిస్టు ఆపరేటర్లు వాపోతున్నారు. ఈ రూమర్లు భారీ ప్రభావం చూపించాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూకంప ఇన్సూరెన్సులు, భారీ డిస్కౌంట్‌ల ఆఫర్‌లు లేకపోయి ఉంటే పర్యాటకుల రాక పూర్తిగా తగ్గిపోయి ఉండేదని చెప్పారు.


ఏమిటీ మాంగా స్టైల్ కార్టూన్ జోస్యం

రోయో టాట్సూకీ అనే చిత్రకారిణి ఈ మాంగా కార్టున్‌లను చిత్రించారు. 1999లో ఆమె ‘ది ఫ్యూచర్ ఐ సా’ పేరిట కొన్ని మాంగా చిత్రాలను వేశారు. 2011లో సునామీ సంభవిస్తుందని పేర్కొన్నారు. అప్పట్లో ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. రోయోకు కూడా ఆశించిన గుర్తింపు దక్కలేదు. అయితే, ఆమె చెప్పినట్టే 2011లో సునామీ జనాల్ని ముంచెత్తింది. అపార ప్రాణ నష్టం సంభవించింది. ఆ తరువాత 2021 తన మాంగా చిత్రాలతో ఆమె రెండో ఎడిషన్ విడుదల చేశారు. ఈసారి చిత్రాల్లో మరో ప్రకృతి విపత్తు గురించి పేర్కొన్నారు. 2025 జులై 5న మరో సునామీ తప్పదని అన్నారు.


దీంతో, ఎల్లుండి సునామీ తప్పదన్న భయం హాంకాంగ్ జనాలు పెరిగిపోయింది. దీంతో, వారు జపాన్ వైపు కన్నెత్తి చూడటం మానేశారు. ఇక ఈ భయాలు శృతి మించుతుండటంతో చిత్రకారిణి స్పందించారు. భవిష్యత్తును దర్శించే శక్తి ఏదీ తన వద్ద లేదని స్పష్టం చేశారు. కానీ జనాల్లో మాత్రం భయం తగ్గలేదు. ఇక ఈ ట్రెండ్‌పై శాస్త్రవేత్తలు కూడా స్పందించారు. సునామీ ఎప్పుడు వచ్చేది శాస్త్రపరంగా కూడా అంచనా వేయడం సాధ్యం కాదని అంటున్నారు. కాబట్టి, జోస్యాన్ని చూసి భయపడిపోవడం అర్థరహితమని అంటున్నారు.

ఇవీ చదవండి:

చాట్‌జీపీటీతో 30 రోజుల్లో రూ.10 లక్షల అప్పు తీర్చేసిన మహిళా రియల్టర్

అమెరికన్లు మరీ ఇలాంటోళ్లని అనుకోలేదు.. ఎన్నారైకి దిమ్మతిరిగే షాక్

Read Latest and Viral News

Updated Date - Jul 03 , 2025 | 10:13 PM