Dogs Bark Saves 67 lives: కుక్క అరుపు.. 67 మంది ప్రాణాలతో బయటపడ్డారు.. అసలేం జరిగిందంటే..
ABN , Publish Date - Jul 08 , 2025 | 01:56 PM
హిమాచల్‌ప్రదేశ్‌లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఆ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిల్లో ఓ కుక్క అరుపు వల్ల 67 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) వంటి పర్వత ప్రాంతాల్లో వర్షాకాలం చాలా భయంభయంగా ఉంటుంది. ఆగకుండా వర్షాలు పడితే ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి ఉత్పాతాలు సంభవిస్తుంటాయి (Rains in Himachal Pradesh). అలాంటి ప్రమాదాల్లో ఇప్పటికే ఎన్నో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఆ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ కుక్క అరుపు (Dog bark) వల్ల 67 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మండి జిల్లాలోని సియతి గ్రామంలో జూన్ 30వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఓ భారీ కొండచరియ విరిగిపడింది. అర్ధరాత్రి సమయం కావడంతో ఆ గ్రామస్థులెవరికీ ఆ విషయం తెలియలేదు. అయితే ఓ ఇంటి రెండో అంతస్థులో నిద్రపోతున్న కుక్క ఆ విషయాన్ని పసిగట్టింది. ఆ కుక్క గట్టిగా అరుస్తూ యజమానిని నిద్రలేపింది. యజమాని అక్కడకు వచ్చి చూసే సరికి ఇంటి గోడకు పగుళ్లు ఏర్పడి నీళ్లు లోపలికి వచ్చేస్తున్నాయి. వెంటనే అతడు ఇంట్లో నిద్రపోతున్న వారందరినీ లేపాడు.
తన ఇంటికి చుట్టుపక్కల వాళ్లందరినీ కూడా నిద్రలేపి పరిస్థితి వివరించాడు. అందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. వాళ్లు అలా వెళ్లగానే ఆ గ్రామంపై మరో భారీ కొండచరియ విరిగిపడింది. నాలుగైదు ఇళ్లు తప్ప మిగతా ఇళ్లన్నీ నేలమట్టం అయిపోయాయి. ఎంతో ఆస్తి నష్టం సంభవించింది. అయితే ప్రాణనష్టం తలెత్తకుండా మాత్రం ఆ కుక్క కాపాడింది. ప్రస్తుతం వారందరూ పక్క గ్రామంలోని ఓ ఆలయంలో తలదాచుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
తాగేసి పడిపోయిన యజమాని.. ఎద్దు అతడిని ఇంటికి ఎలా తీసుకెళ్తోందో చూడండి..
మీది డేగ చూపు అయితే.. ఈ ఫొటోలో 99ల మధ్యనున్న 96ను 5 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..