Heathrow Outrage: భారతీయులపై బ్రిటన్ మహిళ ఫైర్.. అందరినీ డిపోర్టు చేయాలంటూ డిమాండ్
ABN , Publish Date - Jul 08 , 2025 | 03:07 PM
హీత్రూ ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్న భారతీయులు, ఇతర ఆసియా దేశాల వారిని వెంటనే డిపోర్టు చేయాలంటూ ఓ బ్రిటన్ మహిళ పెట్టిన పోస్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెపై జనాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: భారతీయులపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన ఓ బ్రిటన్ మహిళపై ప్రస్తుతం నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారతీయులను వెంటనే డిపోర్ట్ చేయాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. లూసీ వైట్ అనే మహిళ ఎక్స్ వేదికగా పెట్టిన ఈ పోస్టుపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు (Heathrow Airport Racist Remarks).
పబ్లిక్ పాలసీ స్పెషలిస్టు అయిన లూసీ వైట్ తనకు లండన్ హీత్రూ ఎయిర్‌పోర్టులో ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ ఈ పోస్టు పెట్టారు. ‘జస్ట్ ఇప్పుడే లండన్ హీత్రూ ఎయిర్‌పోర్టులో దిగాను. ఇక్కడ అధిక శాతం సిబ్బంది భారత్, ఆసియా దేశాల వారే. ఒక్కరు కూడా ఇంగ్లిష్ మాట్లాడటం లేదు. ఇంగ్లిష్‌లో మాట్లాడాలని నేను వారితో అంటే జాత్యాహంకారం ప్రదర్శించొద్దని నాకు వారు రిప్లై ఇచ్చారు. నేను చెప్పేది కరక్టేనని వాళ్లకూ తెలుసు. అందుకే వారు జాత్యాహంకారం సాకు చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్లందరినీ వెంటనే ఇక్కడి నుంచి పంపించేయాలని. బ్రిటన్‌కు పాయింట్ ఆఫ్ ఎంట్రీ అయిన చోట అసలు వీళ్లు ఎందుకు పని చేస్తున్నారు. టూరిస్టులు ఏమనుకుంటారు’ అని ఆమె పోస్టు పెట్టారు.
ఈ పోస్టుపై సహజంగానే నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. అనేక మంది ఆమెపై మండిపడ్డారు. ‘మరి బ్రిటన్ వాళ్లు ఈ జాబ్స్‌కు ఎందుకు దరఖాస్తు చేసుకోవట్లేదు. బ్రిటీష్ వాళ్లు చేరి ఉంటే ఇండియన్ల అవసరమే ఉండేది కాదు కదా’ అని ఓ వ్యక్తి ప్రశ్నించారు. ‘అయితే, జాత్యాహంకారం వద్దని మాత్రం ఇంగ్లిష్‌లో నీకు అర్థమయ్యేలా చెప్పారంటావ్’ అని మరో వ్యక్తి ఎద్దేవా చేశారు. ఇదంతా ఆసియా వారిపై వ్యతిరేక ప్రచారమని మరో వ్యక్తి అభిప్రాయపడ్డారు. భాషతో పాటు యాసను కూడా సరి చూసుకున్నాకే అక్కడ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని తెలిపారు.
కొందరు మాత్రం లూసీ వైట్‌తో ఏకీభవించారు. ‘ఈ విషయంలో మీతో ఏకీభవించక తప్పట్లేదు. ఇది విచారకరమే. గతేడాది నేను హీత్రూ ఎయిర్‌పోర్టులో దిగాను. ఆ తరువాత నాకు చుక్కలు కనిపించాయి’ అని ఓ వ్యక్తి తెలిపాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇవీ చదవండి:
పీహెచ్‌డీ చేసినా డెలివరీ బాయ్‌గా జీవనం.. ఇతడి స్టోరీ తెలిస్తే..
నా కుటుంబాన్నే అవమానిస్తారా.. నెట్టింట డాక్టర్‌తో భారత్ చెస్ గ్రాండ్‌మాస్టర్ వాగ్వాదం