Viral Video:ఈ పిల్లాడు మామూలోడు కాదు.. బొమ్మ హెలికాఫ్టర్ ఎగరటం లేదని పోలీస్ కంప్లైంట్..
ABN , Publish Date - Apr 22 , 2025 | 03:18 PM
Sangareddy Boy: వినయ్ రెడ్డి అనే బాలుడు సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో ఉండే తన అమ్మమ్మ ఇంటి వద్ద జరిగే జాతరకు వెళ్లాడు. జాతరలో రూ.300 పెట్టి ఒక బొమ్మ హెలికాప్టర్ కొన్నాడు. ఇంటికి తీసుకెళ్లి దాన్ని ఎగరేయడానికి చూశాడు. అయితే, అది ఎగరలేదు.

2010 తర్వాత పుట్టిన పిల్లల బుర్రలు పాదరసంలా పని చేస్తున్నాయి. అభిమన్యుడిలా అన్నీ తల్లి కడుపులోనే నేర్చుకుని వచ్చేస్తున్నారు. వాళ్ల తెలివి తేటల ముందు నైంటీస్ కిడ్స్ తెలివి తేటలు ఎందుకూ పనికి రావని చెప్పొచ్చు. ఇందుకు తాజాగా జరిగిన ఓ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. బొమ్మ హెలికాఫ్టర్ ఎగరటం లేదన్న కోపంతో ఓ పిల్లాడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తనకు బొమ్మ హెలికాఫ్టర్ అమ్మిన వ్యక్తిపై ఫిర్యాదు చేశాడు. షాపతను తనను మోసం చేశాడంటూ పోలీసుల ముందే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. వినయ్ రెడ్డి అనే 10 ఏళ్ల పిల్లాడు సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని అమ్మమ్మ ఇంటికి జాతరకు వచ్చాడు. తాతతో కలిసి బొమ్మలు కొనడానికి వెళ్లాడు. జాతరలో 300 రూపాయలు పెట్టి ఓ బొమ్మ హెలికాఫ్టర్ కొన్నాడు. ఇంటికి తీసుకెళ్లి దాన్ని ఎగరేయడానికి చూశాడు. అయితే, అది ఎగరలేదు. దీంతో షాపు దగ్గరకు వెళ్లాడు. బొమ్మ వెనక్కు ఇచ్చి వేరేది తీసుకున్నాడు. అది కూడా ఎగరలేదు. దీంతో షాపతను మరో బొమ్మ హెలికాఫ్టర్‌ను అతడికి ఇచ్చాడు. ఇలా మూడు సార్లు బొమ్మ హెలికాఫ్టర్‌ను మార్చి ఇచ్చాడు.
నాలుగో సారి తీసుకున్న బొమ్మ కూడా ఎగరలేదు. వినయ్ దాన్ని కూడా వెనక్కు ఇచ్చే ప్రయత్నం చేశాడు. షాపతనికి కోపం వచ్చింది. వినయ్‌పై కోప్పడ్డాడు. దీంతో షాపు యజమాని తనను మోసం చేశాడని బాలుడు భావించాడు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ షాపు యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలుడి ఫిర్యాదు మేరకు..ఎస్‌ఐ జాతరకు కానిస్టేబుల్‌ను పంపాడు. అయితే, అప్పటికే ఆ షాపు యజమాని జాతర నుండి వెళ్లిపోయాడు. పోలీసులు బాలుడి తాతను పిలిపించారు. బాలుడిని సముదాయించి ఇంటికి పంపేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
Viral Video: విజయనగరం కాలేజీలో లెక్చరర్‌పై విద్యార్థిని చెప్పు దాడి
Home Minister Anitha: తప్పు చేస్తే చట్టప్రకారం చర్యలు.. హెంమంత్రి అనిత వార్నింగ్