Palnadu YSRCP Politics: పల్నాడు వైసీపీలో ఒకటే చర్చ.. దేని గురించంటే..
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:04 PM
పల్నాడు జిల్లా వైసిపి అధ్యక్ష పదవి కోసం వెదుకులాట ప్రారంభమైందా..? ప్రస్తుత అధ్యక్షుడు జైలు పాలు కావడంతో కొత్త అధ్యక్షుడి కోసం అన్వేషణ ప్రారంభించారు. ప్రతిపక్షం కావడం.. అందునా పల్నాడు ప్రాంతంలో రాజకీయాలు చేయడం కత్తిమీద సామే. ఇలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష పదవి ఎవరు చేపడతారనే చర్చ జోరుగా సాగుతుంది.

గుంటూరు, జులై 06: పల్నాడు జిల్లా వైసిపి అధ్యక్ష పదవి కోసం వెదుకులాట ప్రారంభమైందా..? ప్రస్తుత అధ్యక్షుడు జైలు పాలు కావడంతో కొత్త అధ్యక్షుడి కోసం అన్వేషణ ప్రారంభించారు. ప్రతిపక్షం కావడం.. అందునా పల్నాడు ప్రాంతంలో రాజకీయాలు చేయడం కత్తిమీద సామే. ఇలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష పదవి ఎవరు చేపడతారనే చర్చ జోరుగా సాగుతుంది. నేతల ప్రచారం ఎలా ఉన్నా అధ్యక్ష స్థానాన్ని మాత్రం త్వరగా భర్తీ చేయాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. పల్నాడు జిల్లా వైసిపి అధ్యక్ష ఎన్నికపై జరుగుతున్న చర్చపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..
సాధారణ ఎన్నికలు జరిగి ఏడాది ముగియడంతో వైసిపి జిల్లా అధ్యక్ష పదవుల భర్తీపై దృష్టి సారించింది. పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందుకు కూడా ఆయనే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. మంత్రి వర్గంలో స్థానం కల్పించలేకపోవడంతో ఆయనకు అప్పట్లో జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అయితే ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున హింస చెలరేగడం ఆ తర్వాత పిన్నెల్లిని అరెస్ట్ చేయడంతో ఆయన జైలుపాలయ్యారు, బెయిల్‌పై బయటకు వచ్చిన పిన్నెల్లి పెద్దగా బయటకు రాని పరిస్థితి ఉంది, దీంతో పిన్నెల్లి జిల్లా అధ్యక్షుడుగా యాక్టివ్‌గా లేకపోవడంతో కొత్త అధ్యక్షుడు ఎన్నిక ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం నుంచి సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లిని.. అరెస్ట్ అయిన సమయంలో ఆయన్ను అధ్యక్ష స్థానం నుండి తప్పించడం సరికాదన్న భావనలో పిన్నెల్లినే పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా గత ఏడాదిగా కొనసాగించారు. అయితే ప్రస్తుతం పిన్నెల్లి మాచెర్ల నియోజకవర్గంలో మరొక హత్య కేసులో ఇరుక్కున్నారు. దీంతో మరోసారి పిన్నెల్లి అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా అధ్యక్ష భాధ్యతలు వేరే ఎవరికైనా అప్పిగిస్తే బాగుంటుందన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు చర్చ జరుగుతుంది. దీంతో మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలలో ఎవరికి పదవి ఇస్తే బాగుంటుంది అనే చర్చ జరుగుతుంది. పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో నాలుగు నియోజకవర్గాలకు రెడ్లు ఇంఛార్జ్‌లుగా ఉండగా రెండు నియోజకవర్గాలకు కమ్మ మరొక నియోజవర్గానికి బిసిలు ఇంఛార్జ్ లుగా ఉన్నారు. ఈ క్రమంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకే అద్యక్ష బాద్యతలు అప్పగిస్తారని అనుకుంటున్నారు. పిన్నెల్లి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉండగా జూనియర్ అయిన సత్తెనపల్లి ఇంఛార్జ్ గజ్జెల సుధీర్ భార్గవ్ రెడ్డికి పదవి వచ్చే అవకాశం కనిపిండం లేదు. ఇక కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెదకూరపాడు ఇంఛార్జ్ నంబూరు శంకర్రావు, వినుకొండ ఇంఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడులు రేస్ లో లేరు.
ఇక మాజీ మంత్రి విడదల రజిని ఇప్పటికే వైసిపి పిఏసి మెంబర్ గా ఉన్నారు. దీంతో పోటీలో కాసు మహేష్ రెడ్డి లేదా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. వీరి ఇద్దరిలో ఎవరో ఒకరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారన్న చర్చ జరుగుతోంది. కాసు మహేష్ రెడ్డి కుటుంబానికి పల్నాడులో మంచి పేరుంది. రాజకీయ పలుకుబడి కూడా అధికంగా ఉంది. అన్ని నియోజకవర్గాల్లో కాసు అనుచరగణం ఉంది. గత ఎన్నికల్లో గురజాల నుండి పోటీ చేసి ఓడిపోయిన మహేష్ రెడ్డి అధ్యక్ష పదవి రేస్‌లో ఉన్నారు. ఇక గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి మొదట నుండి జగన్ వెంట నడిచారు. రెండు సార్లు నరసరావుపేట నియోజకవర్గం నుంచి గెలిచి మూడోసారి ఓడిపోయారు. పల్నాడు జిల్లా కేంద్ర స్థానమైన నర్సరావుపేట ఇంఛార్జ్‌గా గోపిరెడ్డి ఉన్నారు. దీంతో వీరిద్దరిలో ఎవరో ఒకరికి జిల్లా అధ్యక్ష పదవి వస్తుందన్న చర్చ పార్టీలో నడుస్తోంది. అయితే వీరిద్దిరిలో ఎవరో ఒకరిని నియమిస్తారా లేక కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకుస్తారా అని వైసిపి కార్యకర్తలు అనుకుంటున్నారు. ఏది ఏమైనా తర్వగా జిల్లా అధ్యక్షుడిని మార్చితే పార్టీ ఎక్కువగా ప్రజల్లో ఉండే అవకాశం ఉంటుందని వెంటనే జగన్ నిర్ణయం తీసుకోవాలని ప్రతి కార్యకర్త కోరుకుంటున్నారు.
Also Read:
బంపర్ ఆఫర్.. ఆ పిల్లిని పెంచితే కోట్ల ఆస్తి మీదే
బుడ్డోడి ఆవేశం మామూలుగా లేదుగా..
For More Andhra Pradesh News and Telugu News..