KTR: పరకాలలో కేటీఆర్ పర్యటన.. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో కేసీఆర్ కిట్లు పంపిణి
ABN, Publish Date - Jul 27 , 2025 | 08:51 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం భూపాలపల్లి జిల్లాతోపాటు పరకాలలో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

నిన్న అయినా.. రేపు అయినా బీసీలకు న్యాయం చేసేది బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ మాత్రమేనని ఆ పార్టీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు.

కాకతీయ టెక్స్‌టైల్ పార్క్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడి దోపిడి చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నేతల గుండాయిజంతో పరిశ్రమలు పారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బంపర్ మెజార్టీతో గెలిపిస్తేనే రేవంత్ ప్రభుత్వం సెట్ రైట్ అవుతుందని కేడర్‌కు ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం పరకాలలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు కుట్టు మిషన్లు, కేసీఆర్ కిట్లను మాజీ మంత్రి కేటీఆర్ అందజేశారు.

దేశంలోనే అతిపెద్ద కాకతీయ టెక్స్ టైల్ పార్క్ లో 25 వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన కీటెక్స్ సంస్థను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. తాము చెప్పిన వారికే ఉద్యోగాలు ఇవ్వాలన్న కాంగ్రెస్ గుండాయిజంతో పరిశ్రమలు పారిపోయే పరిస్థితి దాపురించిందన్నారు.

కాకతీయ టెక్స్ టైల్ పార్కులో కాలువ నిర్మాణానికి జనవరిలో రూపొందించిన 137 కోట్ల రూపాయల అంచనాలు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల ధనదాహంతో 297 కోట్ల రూపాయలకు పెరిగాయన్నారు. కాలువ నిర్మాణం పేరుతో వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు 167 కోట్ల రూపాయలు దోచుకోవాలనుకున్నారని చెప్పారు.

కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు కు పరిశ్రమలను తెప్పించి తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని బీఆర్ఎస్ అనుకుంటే, కాంగ్రెస్ నేతలు మాత్రం దాన్ని నిలువు దోపిడి చేసే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించకపోతే కాంగ్రెస్ నేతలు చేస్తున్న దోపిడీ ఆగదన్న కేటీఆర్, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అక్రమాలపై నిలదీస్తామన్నారు.

తెలంగాణ కొంగు బంగారం సింగరేణిని కాంగ్రెస్, బీజేపీలు ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు ఆరోపించారు. ఆ రెండు పార్టీల నాయకులకు తెలంగాణ మీద ప్రేమ అస్సలే లేదన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు కొట్లాడేది ఒక్క కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్‌తో 117 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారన్నారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి చేతకాని తనానికి నిలువెత్తు నిదర్శనమని మండిపడ్డారు. రేవంత్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత.. మూడు వేల మంది గురుకుల విద్యార్థులు విషాహారంతో ఆసుపత్రి పాలయ్యారని గుర్తు చేశారు.
Updated at - Jul 27 , 2025 | 08:52 PM