Qatar: ఖతర్ నుంచి స్వదేశానికి చేరుకున్న తెలుగు పాస్టర్లు
ABN , Publish Date - Jul 22 , 2025 | 09:01 PM
ఖతర్‌లో అరెస్టయిన ముగ్గురు పాస్టర్లు జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం వారు స్వేదేశానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా వారు ఖతర్‌లోని భారతీయ రాయబారి కార్యాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తాము స్వదేశానికి చేరుకునేందుకు సహకరించిన మనీష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

ఖతర్, జులై 22: ఖతర్ దేశంలో మత ప్రచారం నిర్వహిస్తున్నారనే అభియోగంపై పోలీసులు అదుపులోకి తీసుకున్న తెలుగు పాస్టర్లకు ఊరట లభించింది. అరెస్టయిన వారిలో తొమ్మిది మంది స్ధానిక ప్రవాసీయులు కాగా.. మరో ముగ్గురు మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా ఖతర్ వచ్చారు. దీంతో దేశం విడిచి వెళ్ళకుండా ఈ ముగ్గురిపై గతంలో నిషేధాన్ని విధించారు. కానీ ఆ నిషేధాన్ని తొలగించడంతో ఈ ముగ్గురు ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని వారి వారి స్వస్ధలాలకు చేరుకోన్నారు. పశ్చిమ గోదావరి, విజయనగరం, కృష్ణా జిల్లాలకు చెందిన ఈ ముగ్గురు పాస్టర్లుగా ఉన్నారు.
అయితే వీరిలో ఇద్దరు చర్చి వార్షికోత్సవ సభలో పాల్గొనేందుకు రాగా.. మరొకరు వ్యక్తిగత కార్యక్రమం కోసం ఖతర్ వచ్చారు. ఏప్రిల్ 27వ తేదీన చర్చిలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గనేందుకు వీరు వెళ్తుండగా వీరిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం జులై 4 న వారిని విడుదల చేశారు. కానీ దేశం విడిచి వెళ్లకుండా వీరిపై ఆంక్షలు విధించారు.
ఈ నేపథ్యంలో ఖతర్‌లో సామాజిక సేవకుడు, కడప జిల్లా ప్రముఖుడు మనీష్ రెడ్డి అరుణ్ జోక్యం చేసుకుని.. అక్కడి భారతీయ రాయబారి కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లారు. వారి సహయంతో ఈ సమస్యను పరిష్కరించారు. ఆ క్రమంలో ఖతర్ జైల్లో ఉన్న వీరిని మనీష్ రెడ్డి సందర్శించి.. వారి విడుదలకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ దిశగా ఆయన ప్రయత్నాలు చేపట్టారు. అనంతరం వీరు జైలు నుంచి విడుదల కావడంతో స్వదేశం పంపేందుకు ఆయన అన్ని ఏర్పాట్లు చేశారు.
అనంతరం ఈ పాస్టర్లు మాట్లాడుతూ.. తాము ఏ రకమైన మత ప్రచారం నిర్వహించేందుకు ఖతర్ రాలేదన్నారు. కేవలం చర్చి వార్షికోత్సవం కోసం ఈ దేశానికి వచ్చినట్లు వారు వివరించారు. తమకు ఖతర్ చట్టాలపై పూర్తి గౌరవం ఉందన్నారు. ఈ సందర్భంగా ఖతర్ ప్రభుత్వంతోపాటు అక్కడి భారతీయ రాయబార కార్యాలయ సిబ్బంది, మనీష్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్నీ ఎన్నారై వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ప్రముఖ ఎన్నారై వైద్యుడు డా. పొలిచెర్ల హరనాథ్‌కు పౌర సన్మానం
డల్లాస్‌లో ఎన్నారై టీడీపీ ఆత్మీయ సమావేశం.. పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు