Manish Kashyap: బీజేపీకి యూట్యూబర్ మనీష్ కశ్యప్ గుడ్‌బై
ABN , Publish Date - Jun 08 , 2025 | 02:57 PM
త్వరలో జరుగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలో సూచించాలని తన అభిమానులను లైవ్ సెషన్‌లో మనీష్ కశ్యప్ కోరారు.

న్యూఢిల్లీ: బీజేపీ నేత, యూట్యూబర్ మనీష్ కశ్యప్ (Manish Kashyap) ఆ పార్టీకి ఉద్వాసన చెప్పారు. బీజేపీ నుంచి వైదొలగుతున్నట్టు ఫేస్‌బుక్ లైవ్ సెషన్‌లో ఆయన ప్రకటించారు. బీజేపీలో ఉంటూ ప్రజలకు సమర్ధవంతంగా సేవలు అందించలేకపోతున్నాననే భావనతోనే తాను పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. బిహార్, బిహారీల తరఫున పోరాడాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. కశ్యప్ 2024 ఏప్రిల్ 25న బీజేపీలో చేరారు.
'బిహార్, బిహార్ ప్రజల కోసం పారాడాలని అనుకుంటున్నాను. పార్టీలో ఉంటూ ప్రజావాణిని సమర్ధవంతంగా వినిపించలేకపోతున్నాను. ఆ కారణంగానే పార్టీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను' అని కశ్యప్ తెలిపారు. త్వరలో జరుగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలో సూచించాలని తన అభిమానులను లైవ్ సెషన్‌లో కోరారు.
పీఎంసీహెచ్ ఘటన
ఇటీవల జరిగిన పట్నా పీఎంసీహెచ్ ఆసుపత్రి ఘటన కశ్యప్ తాజా నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. ఆ ఘటనలో కశ్యప్‌పై వైద్యులు దాడి చేసినట్టు చెబుతున్నారు. బీజేపీ తనకు మద్దతుగా నిలవకపోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆయన తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. బిహార్‌లోని రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా 2025 చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కశ్యప్ నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బిహార్ ఎన్నికల బరిలో దిగుతారా?, ఏదైనా పార్టీలో చేరతారా? అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి..
జస్బీర్ ఫోన్‌లో 150 పాకిస్థాన్ కాంటాక్టులు
నక్సలైట్ల ఏరివేతలో పాల్గొన్న పోలీస్ అధికారులతో షా సమావేశం
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి