యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో సంబంధాల్లేవ్: పోలీసులు
ABN , Publish Date - May 22 , 2025 | 10:43 AM
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ నిఘా కార్యకర్తలతో సంప్రదింపులు జరిపిందని, అయితే, ఉగ్రవాదంతో ఆమెకు ఎటువంటి సంబంధాలు లేవని పోలీసులు తేల్చారు.

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఉపశమనం లభిస్తోంది. పాకిస్తాన్ నిఘా కార్యకర్తలతో జ్యోతి సంప్రదింపులు జరిపిందని, అయితే, ఉగ్రవాదంతో ఆమెకు ఎటువంటి సంబంధాలు లేవని పోలీసులు తేల్చారు. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ నిఘా కార్యకర్తలతో తెలిసి సంభాషించినప్పటికీ, ఆమెకు ఉగ్రవాద కార్యకలాపాలు లేదా గ్రూపులతో సంబంధం ఉందని ఎటువంటి ఆధారాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు.
అంతేకాకుండా, సాయుధ దళాల గురించి లేదా వారి ప్రణాళికల గురించి మల్హోత్రాకు ఎటువంటి అవగాహన లేదని హిసార్ పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. ఆమె కాంటాక్ట్‌లలో కొందరు పాకిస్తానీ నిఘా కార్యకర్తలని తెలిసినప్పటికీ, ఆమె వారితో టచ్‌లో ఉందని ఆయన అన్నారు.
“ఇప్పటివరకు, ఆమె ఏదైనా ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నట్లు లేదా ఏదైనా ఉగ్రవాద సంస్థతో ఆమె అనుబంధానికి సంబంధించిన ఆధారాలు మాకు దొరకలేదు. ఆమె ఏదైనా PIOలను వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు లేదా మతం మార్చుకోవాలనుకుంటున్నట్లు చిత్రీకరించే ఏ పత్రాన్ని మేము కనుగొనలేదు” అని ఎస్పీ చెప్పారు.
మల్హోత్రాకి చెందిన మూడు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, వీటితోపాటు, మే 18న అరెస్టయిన వీసా ఏజెంట్ హర్కిరత్ సింగ్‌కు చెందిన రెండు మొబైల్ ఫోన్‌లను విశ్లేషణ కోసం ల్యాబ్స్‌కు పంపినట్లు ఎస్పీ వెల్లడించారు.
“జ్యోతి మల్హోత్రా ఐదురోజుల రిమాండ్‌లో ఆమెను కొన్ని కేంద్ర సంస్థలు విచారించాయి, కానీ ఆమె కస్టడీని మరే ఇతర ఏజెన్సీకి ఇవ్వలేదు. పబ్లిక్ డొమైన్‌లో వస్తున్నట్టు ఆమె ‘డైరీ’లోని పేజీలు మా దగ్గర లేవు. తమ దగ్గర ఎటువంటి డైరీ లేదు,” అని ఎస్పీ స్పష్టం చేశారు.
ఇలా ఉండగా, 33 ఏళ్ల ట్రావెల్ బ్లాగర్ అయిన జ్యోతి మల్హోత్రాను మే 16న పాకిస్తాన్ కార్యకర్తలతో సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నారనే ఆరోపణలతో అరెస్టు చేశారు. ఆమెపై అధికారిక రహస్యాల చట్టం, 1923లోని సెక్షన్లు 3,5 ఇంకా భారతీయ న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్ 152 కింద కేసు నమోదు చేశారు. రిమాండ్ కాలంలో ఆమెను, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అధికారులు ప్రశ్నించారు.