Share News

India: భారత్‌లో మీడియాపై సెన్సార్‌షిప్‌

ABN , Publish Date - Jul 09 , 2025 | 02:15 AM

భారత ప్రభుత్వం మీడియా సంస్థల ఎక్స్‌ ఖాతాలను స్తంభింపజేయడం ద్వారా మీడియాపై సెన్సార్‌షిప్‌కు పాల్పడుతోందని ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని ఎక్స్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

India: భారత్‌లో మీడియాపై సెన్సార్‌షిప్‌

  • ప్రభుత్వం చెప్పడంతో రాయిటర్స్‌ హ్యాండిల్‌ ఆపేశాం

  • గంటలో 2,355 ఖాతాల్ని ఆపమన్నారు

  • ‘ఎక్స్‌ ఇండియా’ సంచలన ఆరోపణ

  • ఆపరేషన్‌ సింధూర్‌ సమయంలో జరిగింది.. ఇప్పుడు కాదు: కేంద్ర ఐటీ శాఖ

న్యూఢిల్లీ, జూలై 7: భారత ప్రభుత్వం మీడియా సంస్థల ‘ఎక్స్‌’ ఖాతాలను స్తంభింపజేయడం ద్వారా మీడియాపై సెన్సార్‌షిప్‌కు పాల్పడుతోందని ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని ఎక్స్‌ ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని ఎదుర్కొనేందుకు తాము ఇప్పటికే భారతదేశంలో అవకాశమున్న అన్ని చట్టపరమైన మార్గాలను పరిశీలిస్తున్నామని తెలిపింది. ఎక్స్‌ ఖాతాదారులతో పోలిస్తే తమకు ప్రభుత్వ ఆదేశాలను కోర్టులలో సవాలు చేసే విషయంలో పరిమితులు ఉన్నాయని తెలిపింది. కాబట్టి బాధితులే కోర్టులను ఆశ్రయించాలని పిలుపునిచ్చింది. భారతదేశ సెన్సార్‌షిప్‌ విధానాలపై కొన్నేళ్లుగా ప్రభుత్వానికి, ఎక్స్‌కు మధ్య వివాదం నడుస్తోంది. ప్రభుత్వ సెన్సార్‌షిప్‌ విధానాలను సవాలుచేస్తూ ఇప్పటికే ఎక్స్‌ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. దానిపై తీర్పు వెలువడక ముందే తాజాగా ప్రముఖ వార్తాసంస్థ రాయిటర్స్‌ ఎక్స్‌ హ్యాండిల్స్‌ రెండింటిని ఆపేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో మరోసారి వివాదం రాజుకుంది. భారత ప్రభుత్వం విజ్ఞప్తి మేరకే వాటిని ఇక్కడి ప్రజలకు అందుబాటులో లేకుండా ఆపేశామని ఎక్స్‌ ఇండియా విభాగం ప్రకటించింది. రాయిటర్స్‌ ఎక్స్‌ ఖాతాలు జూలై మూడవ తేదీ సాయంత్రం నుంచి ఆరవతేదీ సోమవారం సాయంత్రం వరకు భారత్‌లో పని చేయలేదు. ఐటీ చట్టం 69(ఎ) నిబంధన కింద 2,355 ఎక్స్‌ ఖాతాలను గంట సేపట్లో బ్లాక్‌ చేయాలని భారత ప్రభుత్వం తమను ఆదేశించిందని, అందులో రాయిటర్స్‌, రాయిటర్స్‌ వరల్డ్‌ ఎక్స్‌ ఖాతాలు కూడా ఉన్నాయని ఎక్స్‌ తెలిపింది. ప్రభుత్వ ఆదేశంలో ఎలాంటి కారణాలను చూపలేదని చెప్పింది. అయితే, సాంకేతిక కారణాల వల్లే రాయిటర్స్‌ ఖాతాలు బ్లాక్‌ అయ్యాయని, వాటిని బ్లాక్‌ చేసే ఉద్దేశం లేదని, సమస్య పరిష్కారం కోసం ఎక్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని గత ఆదివారం ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎక్స్‌ ఇండియా విభాగం స్పందించింది. ఇది సాంకేతిక సమస్య కాదని, రాయిటర్స్‌ రెండు ఖాతాలే కాకుండా వాటితో పాటు మొత్తం 2,355 ఖాతాలను బ్లాక్‌ చేయమని ఆదేశాలు రావడం వల్లే తాము చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. అయితే, ఎక్స్‌ ఆరోపణలపై భారత ప్రభుత్వం ఖండించింది. జూలై 3న ఎక్స్‌ ఖాతాలను బ్లాక్‌ చేయాలని తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని చెప్పింది. మీడియా సంస్థల ఖాతాలను బ్లాక్‌ చేసినట్లు తెలియగానే వాటిని అన్‌బ్లాక్‌ చేయాలని సమాచారం ఇచ్చామని వెల్లడించింది. ఆ తర్వాత ఎక్స్‌ వాటిని అన్‌బ్లాక్‌ చేయడానికి 21 గంటల సమయం తీసుకుందని తెలిపింది.


తామే వెంటబడి వాటిని అన్‌బ్లాక్‌ చేయించామని చెప్పింది. రాయిటర్స్‌ ఖాతాలను బ్లాక్‌ చేయించాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేసింది. ఎక్స్‌ చెబుతున్న జాబితా మే 9న ఆపరేషన్‌ సింధూర్‌ సందర్భంగా ఇచ్చిన ఆదేశాలని, వాటిని అప్పుడు అమలు చేయకుండా ఇప్పుడు చేశారని అధికారులు చెబుతున్నారు. అయితే, ఆపరేషన్‌ సింధూర్‌ సందర్భంగా తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళ్లకుండా చూసేందుకు భారత ప్రభుత్వం 8,000 ఖాతాలను బ్లాక్‌ చేయమని ఆదేశించిందని మే 9వ తేదీనే ఎక్స్‌ ప్రకటించింది. వాటిని అమలు చేశామని అదే రోజు చెప్పింది. కాగా, ఖాతాల బ్లాకింగ్‌ అంశంపై ఎక్స్‌ గత మార్చిలో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ఇంటర్నెట్‌లో అభ్యంతరకరమైన పోస్టులను ఐటీ చట్టంలోని 69(ఎ) ద్వారా ఒక కమిటీ సూచించిన తర్వాత తొలగించాలని వాదించింది. కేంద్రం 79(3)(బి) సెక్షన్‌ను ఉపయోగించి సహయోగ్‌ పోర్టల్‌ ద్వారా తొలగించాల్సిన అంశాలను ఏకపక్షంగా నిర్దేశిస్తోందని తెలిపింది. ఈ కేసులో మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. సహయోగ్‌ పోర్టల్‌తో ప్రభుత్వ అధికారికి తన సొంత నిర్ణయంతో ఇష్టం వచ్చినట్లు ఏ ఖాతానైనా బ్లాక్‌ చేసే అధికారం లభించిందని ఎక్స్‌ వాదించింది.

Updated Date - Jul 09 , 2025 | 02:15 AM