CRIB Blood Group: సరికొత్త బ్లడ్ గ్రూప్ క్రిబ్
ABN , Publish Date - Aug 01 , 2025 | 02:50 AM
ప్రపంచంలో ఇంతకుముందెన్నడూ లేని ప్రత్యేక బ్లడ్ గ్రూప్‌ను కర్ణాటకకు చెందిన ఓ మహిళలో గుర్తించారు.

ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా కర్ణాటక మహిళలో గుర్తింపు
బెంగళూరు, జూలై 31: ప్రపంచంలో ఇంతకుముందెన్నడూ లేని ప్రత్యేక బ్లడ్ గ్రూప్‌ను కర్ణాటకకు చెందిన ఓ మహిళలో గుర్తించారు. ఈ గ్రూప్‌నకు శాస్త్రవేత్తలు సీఆర్‌ఐబీ (క్రిబ్) అని నామకరణం చేశారు. భారత్, బ్రిటన్‌లకు చెంది న శాస్త్రవేత్తలు పది నెలల సుదీర్ఘ పరిశోధన అనంతరం అత్యంత అరుదైన ఈ బ్లడ్ గ్రూప్‌ను ఆవిష్కరించారు. ఇప్పటి వరకు ఈ తరహా బ్లడ్ గ్రూప్ ఈ మహిళలో మాత్రమే ఉందని పేర్కొన్నారు. 38 ఏళ్ల మహిళ గుండె సంబంధిత వ్యాధితో గతేడాది కోలారులోని ఆర్‌ఎల్ జాలప్ప ఆస్పత్రిలో చేరారు. ఆమెకు శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఆమెది ఓ-పాజిటివ్ వర్గానికి చెందిన రక్తం కావడంతో శస్త్రచికిత్సకు రక్తమార్పిడి కోసం శాంపిళ్లను పరీక్షించారు. అయితే డాక్టర్లను ఆశ్చర్యపరుస్తూ అన్ని శాంపిళ్లలో రియాక్షన్ వచ్చింది. పేషెంట్ కుటుంబంలోని 20 మంది శాంపిళ్లు ప్రయత్నించినా ఏదీ మ్యాచ్ కాలేదు. ఆమె రక్తంలో గుర్తు తెలియని, గతంలో ఎన్నడూ చూడని యాంటిజెన్ ఉండటం వల్ల ఇలా జరుగుతోందని గుర్తించారు. చివరకు రక్తమార్పిడి చేయకుండానే శస్త్రచికిత్స పూర్తి చేశారు. అయితే ఆమె రక్తనమూనాలను బ్రిటన్‌లోని బ్రిస్టల్‌లో ఉన్న అంతర్జాతీయ బ్లడ్ గ్రూప్ రిఫరెన్స్ ల్యాబొరేటరీకి పంపారు. అక్కడ 10 నెలల పరిశోధన అనంతరం క్రోమర్ వ్యవస్థలో సరికొత్త యాంటిజెన్‌ను గుర్తించారు. దీంతో ఈ బ్లడ్ గ్రూప్‌నకు సీఆర్‌ఐబీగా నామకరణం చేశారు. సీఆర్ అంటే క్రోమర్ అని, ఐబీ అంటే ఇండియా బెంగళూరు అని అర్థం వచ్చేటట్లుగా పేరు పెట్టారు. ఈ రక్తవర్గం ప్రపంచంలోనే మొట్టమొదటిగా ప్రకటించారు. కాగా, ఐఎ్‌సబీటీ మార్గదర్శకాల ప్రకారం కూడా ఆమెను మొట్టమొదటి క్రిబ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తిగా ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్
జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..
For More Telangana News And Telugu News