Mothers Skin Grafts: తన చర్మాన్నేబిడ్డకు కవచంగా.. ఓ తల్లి వీరోచిత పోరాటం
ABN , Publish Date - Jul 28 , 2025 | 03:30 PM
తల్లి చర్మాన్ని కవచ కుండలంగా చేసుకుని ఆ ఎనిమిది నెలల బాలుడు ఎట్టకేలకు బ్రతికి బయటపడ్డాడు. ఎగిసిపడుతున్న మంటలు.. తీవ్రమైన వేడి, దట్టమైన పొగను లెక్క చేయక, తమ ప్రాణాల్ని రక్షించుకోవడమేకాదు, తన చర్మాన్ని దానంగా ఇచ్చి..

ఇంటర్నెట్ డెస్క్: జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో అతి పిన్న వయస్కుడు (8 నెలలు) ధ్యాన్ష్ ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, దీని వెనుక అతని తల్లి వీరోచిత ధీర గాధ ఉంది. IC171 విమానం మెడికల్ హాస్టల్ భవనంలోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డ సంగతి తెలిసిందే. బిల్డింగ్ పక్కన ఉన్న ఇళ్లలోకి మంటలు వ్యాపించడంతో ఒక ఇంట్లో ఉన్న శిశువుతో పాటు, అతని తల్లి మనీషా కచ్చాడియాకి కూడా కాలిన గాయాలయ్యాయి.
అయితే, ఆ తల్లి.. కాలిన గాయాలతోపాటు, ఎగిసిపడుతున్న మంటల్ని లెక్కచేయకుండా పిల్లాడితో బయటకు పరుగులు తీసింది. మనీషా ముఖం, చేతులకు 25% కాలిన గాయాలు, ధ్యాన్ష్ ముఖం, రెండు చేతులు, ఛాతీ, కడుపు అంతటా 36% కాలిన గాయాలతో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో బాలుడు బ్రతకలంటే, అతనికి ఎవరైనా చర్మం దానం చేయాల్సిన పరిస్థితి. తనకు సైతం కాలిన గాయాలైనప్పటికీ.. తానే బిడ్డకు చర్మం దానం చేస్తానని చెప్పిన.. మనీషా తన చర్మాన్ని గ్రాఫ్టింగ్ కోసం ధ్యాన్ష్‌కు పలు దఫాలుగా దానం చేసింది. దాదాపు నెలా పదిహేను రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఇప్పుడు, తల్లి, కొడుకు క్షేమంగా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.
జూన్ 12న అహ్మదాబాద్‌లోని బిజె మెడికల్ కాలేజీ భవనంతోపాటు, చుట్టుపక్కల నివాస గృహాలపై ఎయిర్ ఇండియా IC171 కూలి 260 మంది మృతి చెందగా పలువురు గాయాలపాలయ్యారు. మనీషా కచ్చాడియా తన ఎనిమిది నెలల కుమారుడు ధ్యాన్ష్‌ను మంటల నుండి రక్షించుకోవడానికి చేసిన ప్రయత్నం ఒక తల్లి చేసిన వీరోచిత పోరాటమనే చెప్పాలి. ఇదే మనీషా భర్త కూడా అంటున్నారు. చెలరేగుతున్న మంటలు.. తీవ్రమైన వేడి, దట్టమైన పొగ ఉన్నప్పటికీ, ఆమె ఏకైక లక్ష్యం తన చిన్నారిని రక్షించుకోవడమేనని బాలుడు ధ్యాన్ష్ తండ్రి కపిల్ చెబుతున్నారు. ఇక, బాలుడి తండ్రి కపిల్ కచ్చాడియా బిజె మెడికల్ కాలేజీలో సూపర్-స్పెషాలిటీ ఎంసిహెచ్ యూరాలజీ విద్యార్థి. జూన్ 12న విమానం హాస్టల్‌లోకి కూలిపోయినప్పుడు అదృష్టవశాత్తూ కపిల్ ఆసుపత్రిలో విధుల్లో ఉన్నాడు.
ఇవి కూడా చదవండి..
శ్రీనగర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. పహల్గామ్ ఉగ్రవాదులు హతం..!
ఆపరేషన్ సిందూర్ చర్చపై శశి థరూర్ దూరం ఎందుకు?
For More National News and Telugu News..