Vice President Jagdeep Dhankhar: సుప్రీంకోర్టుకు ఆ అధికారం అణు క్షిపణిలా మారింది
ABN , Publish Date - Apr 18 , 2025 | 03:49 AM
సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ఉపయోగం ప్రజాస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా మారిందని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ విమర్శించారు. రాష్ట్రపతి, గవర్నర్లపై న్యాయమూర్తుల అద్భుతమైన అధికారాలపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు

ప్రజాస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా ఆర్టికల్ 142 అధికారాలు
రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఎలా నిర్దేశిస్తుంది?
ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో దొరికిన నగదుపై దర్యాప్తు ఏమైంది?
ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు కాలేదు?.. జడ్జీలు అతీతమా?
చట్టాలు చేసేది వారే.. అమలు చేసేది వారే..
వారే సూపర్ పార్లమెంట్ అన్నట్టు పరిస్థితి ఉంది
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): బిల్లులు ఆమోదించేందుకు సుప్రీంకోర్టు రాష్ట్రపతికి గడువు విధించడాన్ని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తీవ్రంగా తప్పుపట్టారు. దేశంలో చట్టాలు చేసేదీ వారే, అమలు చేసేదీ వారే అన్నట్టుగా న్యాయమూర్తులు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. వారు చట్టాలకు అతీతమన్నట్టుగా, సూపర్ పార్లమెంటు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింఠిదని విమర్శించారు. సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికారాలు కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 142.. దేశంలో ప్రజాస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా 24 గంటలూ న్యాయవ్యవస్థకు అందుబాటులో ఉన్న అణు క్షిపణిలా మారిందని వ్యాఖ్యానించారు. దేశంలో అందరికంటే అత్యున్నత స్థానంలో ఉన్న రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదని.. బిల్లులు ఆమోదించేందుకు రాష్ట్రపతికి గడువు విధించడం సరికాదని స్పష్టం చేశారు. గురువారం 6వ బ్యాచ్ రాజ్యసభ ఇంటర్నీలను ఉద్దేశించి ఉప రాష్ట్రపతి ప్రసంగించారు. రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాలకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నగదు దొరికిన అంశాలను ప్రస్తావిస్తూ... న్యాయవ్యవస్థ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
పాలకులూ వారే అన్నట్టుగా..
‘‘రాష్ట్రపతికే ఆదేశాలు జారీ చేస్తున్నామంటే మనం ఎక్కడికి వెళుతున్నామో తెలియడం లేదు. ఇది కోర్టులో సమీక్ష పిటిషన్ వేయాల్సిన చిన్న విషయం కాదు. నిర్దిష్టకాలంలో రాష్ట్రపతి నిర్ణయం తీసుకోకుంటే చట్టంగా మారినట్టే అని సుప్రీంకోర్టు పేర్కొంది. అంటే న్యాయమూర్తులే చట్టాలు చేస్తున్నారు. వారే కార్యనిర్వాహక విధులు నిర్వహిస్తున్నారు. అంటే సూపర్ పార్లమెంట్‌గా వ్యవహరిస్తున్నారు. కానీ వారికి ఏమాత్రం జవాబుదారీ లేదు. ఎందుకంటే చట్టాలు వారికి వర్తించవు’’ అని ధన్‌ఖడ్ వ్యాఖ్యానించారు.
వారు చట్టాలకు అతీతమా?
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా నగదు దొరకడాన్ని ప్రస్తావిస్తూ ధన్‌ఖడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘మార్చి 14న రాత్రి జడ్జి నివాసంలో జరిగిన ఘటన గురించి వారం దాకా ఎవరికీ తెలియదు. ఎందుకీ ఆలస్యం? అది సమర్థనీయమేనా? సాధారణ న్యాయసూత్రాల ప్రకారం పరిస్థితి వేరుగా ఉండేది. కానీ జడ్జి కాబట్టి భిన్నంగా జరిగింది. మార్చి 21న ఓ వార్తాపత్రికలో ఈ విషయం చూసి దేశ ప్రజలు దిగ్ర్భాంతి చెందారు. కానీ ఆ న్యాయమూర్తిపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ దాఖలు కాలేదు. ఉప రాష్ట్రపతి అయిన నాతో సహా దేశంలో ఎవరిపై అయినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవచ్చు. రూల్ ఆఫ్ లాను అమలు చేసేందుకు ఏ అనుమతీ అక్కర్లేదు. కానీ న్యాయమూర్తులపై నేరుగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేం. న్యాయ వ్యవస్థలో సంబంధిత వ్యక్తులు ఆమోదించాల్సి ఉంటుంది. దేశంలో రాష్ట్రపతి, గవర్నర్‌లకు మాత్రమే ప్రాసిక్యూషన్ నుంచి రాజ్యాంగం మినహాయింపు ఇచ్చింది. కానీ న్యాయమూర్తులకు అందుకు అతీతంగా ఎలా మినహాయింపు అందుతోంది?’’ అని ధన్‌ఖడ్ నిలదీశారు. భారీగా నగదు దొరకడాన్ని ప్రస్తావిస్తూ.. మరెవరి విషయంలోనైనా ఇలా జరిగి ఉంటే రాకెట్ వేగంతో విచారణ సాగేదని, కానీ ఈ విషయంలో ఎడ్లబండి నడకలా కూడా సాగడం లేదని వ్యాఖ్యానించారు. దర్యాప్తు అనేది కార్యనిర్వాహకవర్గం బాధ్యత అని ధన్‌ఖడ్ గుర్తు చేశారు. జడ్జి ఇంట్లో నగదు దొరికిన కేసును పోలీసు దర్యాప్తు చేయకుండా.. ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ఎందుకు విచారిస్తోందని ప్రశ్నించారు. ఆ జడ్జీల కమిటీకి పార్లమెంట్ చేసిన ఏ చట్టం నుంచైనా అనుమతి లభించిందా? అని నిలదీశారు. అయినా జడ్జీల కమిటీ మహా అయితే సిఫార్సు చేస్తుందని, దానికి ఎలాంటి చట్టబద్ధత ఉండదని స్పష్టం చేశారు. చివరికి పార్లమెంట్ మాత్రమే చర్య తీసుకోగలదని తెలిపారు.
విశ్వాసం తగ్గిపోతోంది..
న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం రోజురోజుకూ తగ్గిపోతోందని, ఇటీవల ఒక మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో తేలిందని ఉప రాష్ట్రపతి చెప్పారు. న్యాయవ్యవస్థ, చట్టసభలు, కార్యనిర్వాహకవర్గం పారదర్శకంగా, జవాబుదారీగా వ్యవహరించాలని సూచించారు. చట్టం ముందు అందరూ సమానమనే దాన్ని విస్మరించవద్దని సూచించారు. న్యాయవ్యవేస్థ ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తిస్తే ఎలాగని, అది ఎవరికి జవాబుదారీ అవుతుందని ప్రశ్నించారు. ఈ ఏడాది జనవరి 27న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల లోక్‌పాల్ బెంచ్.. కొందరు హైకోర్టు న్యాయమూర్తులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టిందని ధన్‌ఖడ్ గుర్తు చేశారు. కానీ దానిని సుప్రీంకోర్టు తనంతట తానే స్వాధీనంలోకి తీసుకుందన్నారు. ఇతర దేశాల్లో న్యాయవ్యవస్థలు ఇలా తమంతట తాము విచారణలను స్వాధీనంలోకి తీసుకున్న సందర్భాలు లేవని స్పష్టం చేశారు. సంస్థలు పారదర్శకతతో వ్యవహరించాలని, దర్యాప్తులు, విచారణలు లేనప్పుడు పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ఎలాంటి పరిశీలన లేకుండా వ్యక్తులకు మనం ఆరాధనీయమైన స్థానం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రైవేట్ ఆస్పత్రి పొమ్మంటే.. సర్కారు దవాఖానా ప్రాణాలు నిలిపింది
తెలంగాణ పోలీసులకు సీఎం అభినందనలు
Read Latest Telangana News and National News