Visa Restrictions: విద్యార్థి, హెల్త్‌కేర్ వీసాలకు బ్రేక్!
ABN , Publish Date - Jul 03 , 2025 | 05:47 AM
విదేశీ విద్యార్థులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది తమ దేశాల్లోకి అధిక సంఖ్యలో రాకుండా అడ్డుకోవాలని అమెరికా, బ్రిటన్ భావిస్తున్నాయి. వారి సంఖ్యపై ఆంక్షలు విధించాలని నిర్ణయించాయి.

ఆంక్షలకు అమెరికా, బ్రిటన్ సన్నద్ధం ఎఫ్-1, జే-1, ఎం-1
వీసాలకు నిర్దిష్ట కాలపరిమితి
ట్రంప్ సర్కారు నిబంధనల కొరడా
22 నుంచి ఇంగ్లండ్‌లో విదేశీ ఆరోగ్య సిబ్బంది నియామకాల నిలిపివేత
వాషింగ్టన్/లండన్, జూలై 2: విదేశీ విద్యార్థులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది తమ దేశాల్లోకి అధిక సంఖ్యలో రాకుండా అడ్డుకోవాలని అమెరికా, బ్రిటన్ భావిస్తున్నాయి. వారి సంఖ్యపై ఆంక్షలు విధించాలని నిర్ణయించాయి. అక్రమ వలసలపై కొరడా ఝళిపిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం.. తాజాగా ఎఫ్-1, జే-1 వీసాలపై వచ్చిన విదేశీ విద్యార్థులపై ఆంక్షలు విధించాలని, వారు అమెరికాలో నివసించే సమయాన్ని కుదించాలని భావిస్తోంది. దీనివల్ల ఆయా వీసాలపై అక్కడకు వెళ్లిన 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఇబ్బందులు పాలయ్యే అవకాశముంది. ప్రస్తుతం ఈ వీసాలతో వెళ్లేవారిపై కఠినమైన ఆంక్షలు లేవు. తామొచ్చిన కార్యక్రమాలు పూర్తయ్యేవరకు వారు అమెరికాలో ఉండే అవకాశం ఉంది. అయితే ఎక్సేంజ్ విజిటర్లుగా వచ్చేవారు ఉండేందుకు కాలవ్యవధి నిర్ధారించాలని ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2020లోనే ప్రతిపాదించారు. ఇప్పుడు అమెరికా హోంల్యాండ్ భద్రత విభాగం తాజాగా ఈ ప్రతిపాదన తెచ్చింది. ట్రంప్ యంత్రాంగం ప్రజాభిప్రాయం కోరకుండానే దీన్ని అమలు చేసే అవకాశం ఉంది.
భారత్‌లోని అమెరికా ఎంబసీ ఇటీవల విదేశీ విద్యార్థులకు మే 14న ఓ హెచ్చరిక చేసింది. నిర్ణీత గడువును మించి అమెరికాలో అక్రమంగా నివసించేవారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని స్పష్టంచేసింది. వారిని స్వదేశాలకు పంపేయడం, భవిష్యత్‌లో అమెరికాకు రాకుండా శాశ్వత నిషేధం వంటివి జరుగుతాయని తెలిపింది. ఆ తర్వాత ట్రంప్ యంత్రాంగం ఎఫ్-1, జే-1, ఎం-1 వీసాలను రద్దుచేయడమే గాక,, స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ (సెవిస్) రికార్డులను కూడా క్యాన్సిల్ చేయడంతో లక్షల సంఖ్యలో విదేశీ విద్యార్థులు అమెరికాను వీడాల్సి వచ్చింది. కాగా, జే-1 వీసా అంటే నాన్-ఇమిగ్రెంట్ వీసా. విద్య, సైన్స్, కళలు తదితర రంగాల్లో సాంస్కృతిక, మేధో సంబంధ మార్పిడిలో భాగంగా చేపట్టే విద్య, అధ్యయనం, పరిశోధన, ప్రత్యేక నైపుణ్యం, శిక్షణ కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు అమెరికా వచ్చేవారికి ఈ వీసాలిస్తారు. ఈ కార్యక్రమాలు పూర్తయ్యేంతవరకు వారు అక్కడ నివసించవచ్చు. కాలపరిమితి లేదు. ఎఫ్-1 వీసా.. అమెరికాలో ప్రముఖ విద్యాసంస్థల్లో చదువుకునేందుకు వచ్చే విదేశీ విద్యార్థులకు ఇస్తారు. దీనికీ కాలపరిమితి లేదు. చదువు, పరిశోధనలు పూర్తయ్యేవరకు వారు ఉండొచ్చు. ఎం-1 వీసా.. గుర్తింపు పొందిన విద్యాసంస్థలు..జూనియర్ కాలేజీలు, పోస్ట్-సెకండరీ వొకేషనల్ స్కూళ్లు, పోస్ట్-సెకండరీ బిజినెస్ స్కూళ్ల వంటివాటిలో వొకేషనల్ లేదా సాంకేతిక శిక్షణ కోసం వచ్చేవారికి ఇస్తారు.
యూకేలో ఆంక్షలు కఠినతరం
కొత్త వీసా విధానంలో భాగంగా యూకేలో ఈ నెల 22 నుంచి విదేశాలకు చెందిన ఆరోగ్య సంరక్షణ సిబ్బంది నియామకాలను నిలిపివేయనున్నారు. అలాగే ఉద్యోగాల కోసం రాదలచుకున్నవారి వేతన పరిమితులను బాగా పెంచారు. ఆరోగ్య సంరక్షణతో పాటు మరికొన్ని రంగాల్లో ఉద్యోగం కోసం వచ్చే వారు మరిన్ని నైపుణ్యాలు కలిగి ఉండాలన్న నిబంధన విధించారు. ఈ మేరకు కఠినతర వీసా నిబంధనలను పార్లమెంటులో మూడ్రోజుల కిందట ప్రవేశపెట్టారు.