Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడిలో టీఆర్‌ఎఫ్ పాత్ర
ABN , Publish Date - Jul 31 , 2025 | 04:07 AM
పహల్గాం దాడిలో అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టే విషయంలో భారత్ గొప్ప దౌత్య విజయం సాధించింది.

ఐరాస భద్రతా మండలి నివేదిక స్పష్టీకరణ
న్యూఢిల్లీ, జూలై 30: పహల్గాం దాడిలో అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టే విషయంలో భారత్ గొప్ప దౌత్య విజయం సాధించింది. ఈ దాడిలో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) పాత్ర ఉందని మొట్టమొదటిసారి ఐక్యరాజ్యసమతి భద్రతా మండలి (యూఎన్‌ఎ్‌ససీ) నివేదిక స్పష్టం చేసింది. లష్కరే తాయిబా మద్దతు లేకుండా ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడి జరగదని, లష్కరే తాయిబాకు, టీఆర్‌ఎ్‌ఫకు అవినాభావ సంబంధం ఉందని భద్రతా మండలికి చెందిన పర్యవేక్షక బృందం (ఎంటీ) నివేదిక వెల్లడించింది. భద్రతా మండలి 1267 ఆంక్షల కమిటీ నిర్ణయాలు, నివేదికలను ఏకాభిప్రాయంతో ఐరాస సభ్యులు ఆమోదించడంతో ఆ నివేదిక ప్రాధాన్యత సంతరించుకుందని ఐరాస వర్గాలు తెలిపాయి. పహల్గాం దాడిలో ఐదుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారని, 26 మంది అమాయక పౌరులు చనిపోయారని నివేదిక తెలిపింది. ఆ దాడులు తామే చేశామని టీఆర్‌ఎఫ్ అదేరోజు ప్రకటించడాన్ని ప్రస్తావించింది. నాలుగు రోజుల తర్వాత టీఆర్‌ఎఫ్ మాటమార్చేసిందని వెల్లడించింది. అనంతరం మరే ఉగ్రవాద సంస్థ కూడా దాడులకు బాధ్యత తీసుకోలేదని తెలిపింది. ప్రాంతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలను లష్కరే ఉపయోగించుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. లష్కరే, జేఈఎంల నుంచి దృష్టి మరల్చడానికి టీఆర్‌ఎఫ్, పీపుల్ ఎగైనెస్ట్ ఫాసిస్ట్ ఫ్రంట్ పేర్లతో జమ్మూ కశ్మీర్‌లో దాడులు చేయడానికి పాక్ చేసిన ప్రయత్నాలకు పెద్ద దెబ్బపడినట్లయింది. కాగా, లష్కరే, పాక్‌లోని ఉగ్రవాద గ్రూపుల పేర్లను నివేదికల్లో చేర్చడం 2019 తర్వాత తొలిసారి. ఎంటీ నివేదిక నుంచి టీఆర్‌ఎఫ్ పేరును తొలగించడానికి పాక్ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. తమకు సంబంధం లేదంటూ పాక్ చేసిన వాదన ఎంటీ నివేదికతో వీగిపోయింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్
ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..
For More International News And Telugu News