New App for Aadhaar: ఆధార్‌కు ఇకపై కొత్త యాప్.. ప్రయోజనాలివే..
ABN , Publish Date - Nov 10 , 2025 | 06:13 PM
వినియోగదారుల సౌలభ్యం కోసం మరో కొత్త యాప్‌ను తీసుకొచ్చింది ఉడాయ్. దీని ద్వారా ఆధార్‌ను భద్రపరచుకోవడంతో పాటు అవసరమైన వివరాలను మాత్రమే షేర్ చేస్కునే వెసులుబాటు ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆధార్ కోసం కొత్త యాప్(Aadhaar App) ఆవిష్కరించింది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI). వినియోగదారులు తమ ఆధార్ వివరాలను స్మార్ట్ ఫోన్‌లో దాచుకోవడం, అవసరమైన వివరాలను మాత్రమే అత్యంత సులువుగా పంచుకునేందుకు వీలుగా రూపొందించింది. దీనిని యూజర్లు యాపిల్ స్టోర్(ఐఫోన్), ప్లేస్టోర్(ఆండ్రాయిడ్) నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఉడాయ్ తెలిపింది. ఈ మేరకు 'X' వేదికగా ప్రకటించింది.
mAadhaar పేరిట ఇదివరకే ఉడాయ్ ఓ యాప్‌ను తీసుకొచ్చింది. అదే తరహాలో మరిన్ని ప్రయోజనాలను చేర్చుతూ ఈ కొత్త యాప్‌ను అప్డేట్ చేసింది. ఎమ్ ఆధార్ తరహాలోనే ఇందులోనూ డిజిటల్ ఆధార్(Digital Aadhaar) డౌన్‌లోడ్ చేసుకోవడం సహా సులభంగా పీవీసీ కార్డు(PVC Card)కు ఆర్డర్ చేసుకునే సౌలభ్యం కల్పించింది. ఆధార్ వివరాలను భద్రపరుచుకోవడం, అవసరమైన సమచారాన్ని మాత్రమే ఇతరులతో పంచుకోవడానికి ఉద్దేశించే ఈ యాప్‌ను తీసుకొచ్చినట్టు ఉడాయ్ పేర్కొంది. ఈ-మెయిల్(E-Mail), మొబైల్ నంబర్ వెరిఫికేషన్(Mobile Number Verification), వర్చువల్ ఐడీ జనరేషన్(Virtual ID Generation) వంటి ఫీచర్లేవీ ఇందులో ఉండవని స్పష్టం చేసింది.
కొత్త యాప్ ఎలా ఉంటుందంటే..
ఆధార్ కార్డును ప్రతిసారీ వెంటపెట్టుకుని వెళ్లాల్సిన పనిలేకుండా.. డిజిటల్ రూపంలో పొందే సౌలభ్యం ఇందులో ఉంటుంది. వ్యక్తిగత వివరాలతో పాటు కుటుంబ సభ్యులందరి వివరాలూ ఇందులో పొందవచ్చు. వీటితో పాటు ఫేస్ అథంటికేషన్ ఫీచర్ ఇందులో అదనం. ఆధార్‌లో పొందుపరిచిన అన్ని వివరాలు కాకుండా ఎదుటివారు ఏవైతే వివరాలు అడిగారో వాటిని మాత్రమే విడిగా షేర్ చేస్కోవడానికి ఈ యాప్ అత్యంత అనుకూలం. వీటన్నిటికీ లాక్ ఫీచర్ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఆధార్ డేటాను చివరిసారిగా ఎక్కడ వినియోగించామో సులభంగా తెలుసుకోవడంతో పాటు లాకింగ్, అన్‌లాక్ సదుపాయం కూడా కల్పించారు.
ఉపయోగించే విధానం..
ముందుగా.. అండ్రాయిడ్ యూజర్లు ప్లేస్టోర్ నుంచి, ఐఫోన్ యూజర్లు యాపిల్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
యాప్‌నకు సంబంధించి అవసరమైన అనుమతులు ఇవ్వాలి. తర్వాత Terms and Conditions ను యాక్సెప్ట్ చేయాలి.
ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌ను అందులో ఎంటర్ చేయాలి. దీంతో ఫోన్ నంబర్ వెరిఫికేషన్ పూర్తవుతుంది.
ఆ తర్వాత ఫేస్ అథంటికేషన్ కోసం సంబంధిత రూల్స్ పరిశీలించి ఫాలో అవ్వాలి.
పై వివరాలన్నీ ఎంటర్ చేశాక సెక్యూరిటీగా పిన్ సెట్ చేస్కోవాలి.
Also Read:
హెచ్ఆర్ తప్పిదం.. ఉద్యోగులందరినీ తొలగిస్తున్నట్టు ఈమెయిల్
జగన్ అక్రమాస్తుల కేసు.. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కోర్టు ఆదేశం