Rahul Gandhi: రెండు రకాల గుర్రాలు.. గుజరాత్‌లో కాంగ్రెస్ వ్యూహంపై రాహుల్
ABN , Publish Date - Apr 16 , 2025 | 05:19 PM
గుజరాత్ రాష్ట్రంలో రెండ్రోజుల పర్యటనకు బుధవారంనాడు వచ్చిన రాహుల్ గాంధీ మోడాసాలో జరిగిన కాంగ్రెస్ జిల్లా కార్యకర్తల సదస్సులో పాల్గొన్నారు. పార్టీ వ్యూహాలను వివరిస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

మోడాసా: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS), బీజేపీ (BJP)ని ఓడించగలిగే సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని, గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ నైతికస్థైర్యం కోల్పోయినట్టు కనిపిస్తున్నప్పటికీ రాష్ట్రంలో వాళ్లను (బీజేపీ) ఓడిస్తామని పార్టీ సీనియర్ నేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. పార్టీలోని అంతర్గత సవాళ్లను పరిష్కరించేందుకు రాష్ట్రంలో కొత్త నాయకత్వాన్ని పరిచయం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో రెండ్రోజుల పర్యటనకు బుధవారంనాడిక్కడ వచ్చిన రాహుల్ గాంధీ మోడాసాలో జరిగిన కాంగ్రెస్ జిల్లా కార్యకర్తల సదస్సులో పాల్గొన్నారు. పార్టీ వ్యూహాలను వివరిస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
Mamata Banerjee: యోగి అతిపెద్ద భోగి.. యూపీ సీఎంపై మమత ఫైర్, బీజేపీ కౌంటర్
గుజరాత్‌లో పార్టీని పునర్వవస్థీకరించేందుకు తీసుకుంటున్న చర్యలను రాహుల్ ప్రస్తావిస్తూ, దీనిపై చాలా నెలలుగా పార్టీ సీనియర్ నేతలు, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న పోరాటం కేవలం రాజకీయం పోరాటం కాదని, సైద్ధాంతిక పోరాటమని అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీని ఒక్క కాంగ్రెస్ మాత్రమే ఓడించగలదనే విషయం ప్రజలకు తెలుసునన్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత మార్పులు చేపట్టాల్సిన అవసరాన్ని తాము గుర్తించామని చెప్పారు. దీనిపై జిల్లాలకు చెందిన సీనియర్ నేతలను తాను కలుసుకున్నానని, చక్కటి చర్చలు జరిగాయని తెలిపారు. నాయకుల మధ్య పోటీ వినాశకరమని, నిర్మాణత్మకం కాదని నేతలు తనకు చెప్పారని అన్నారు.
రెండు రకాల గుర్రాలు
పార్టీలో నాయకత్వ సవాళ్లను గురించి మాట్లాడుతూ, గుర్రాలలో రెండు రకాలు ఉంటాయని, ఒకటి రేసులకు ఉద్దేశించినవని, రెండో రకం పెళ్లిళ్లకు ఉద్దేశించినవని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కొన్నిసార్లు వెడ్డింగ్ హార్స్‌లను రేసులకు, రేసింగ్ హార్స్‌లను పెళ్లిళ్లకు పంపుతున్నట్టు నాయకులు తన దృష్టికి తెచ్చారని చెప్పారు. సరైన నేతలకు సరైన బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉందని రాహుల్ అన్నారు. "ఈ రెండు రకాల గుర్రాలను సెపరేట్ చేయాలి. జిల్లాలను స్థానికంగానే నడపడం వల్ల అభ్యర్థులకు, ఆర్గనైజేషన్‌కు మధ్య పటిష్ట బంధం ఉంటుందనే నిశ్చితాభిప్రాయానికి పార్టీ వచ్చింది'' అని ఆయన వివరించారు.
నాయకులు తన దృష్టికి తెచ్చిన విషయాలను రాహుల్ మరింత వివరిస్తూ, అహ్మదాబాద్ నుంచి సీనియర్ నాయకులు వచ్చి రెండు రోజులు హంగామా చేసి వెళ్లిపోతుంటారని, వాళ్లు వెళ్లిపోగానే జనం కూడా మాయమై పోతుంటారని, దీని వల్ల బూత్‌లు కూడా గెలుచుకోలేకున్నామని కొందరు చెప్పినట్టు తెలిపారు. మరో అంతర్గత అంశాన్ని కూడా రాహుల్ ప్రస్తావించారు. చాలా మంది పార్టీ నేతలకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని తెలుస్తోందని, అలాంటి వారిని గుర్తించి పార్టీకి దూరంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
ఇవి కూడా చదవండి...