Donald Trump: పాక్‌తో అమెరికా చమురు ఒప్పందం
ABN , Publish Date - Aug 01 , 2025 | 02:38 AM
పాకిస్థాన్‌తో చమురు నిల్వలపై వాణిజ్య ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

చమురు నిల్వలపై కలిసి పనిచేస్తా
వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించిన ట్రంప్
భవిష్యత్తులో భారత్‌కు.. పాక్
చమురు విక్రయించవచ్చని జోస్యం
ఇది చరిత్రాత్మక ఒప్పందం అంటూ
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పోస్టులు
అమెరికా ఊహ ఆసక్తిని కలిగిస్తోంది
వ్యంగ్యాస్త్రాలు సంధించిన శశిథరూర్
న్యూయార్క్/ఇస్లామాబాద్, జూలై 31: పాకిస్థాన్‌తో చమురు నిల్వలపై వాణిజ్య ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. చమురు నిల్వల పెంపునకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని, భవిష్యత్‌తో భారత్‌కు పాకిస్థాన్ చమురు విక్రయించవచ్చని జోస్యం చెప్పారు. భారత్‌పై 25ు సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం..! పాక్‌తో వాణిజ్య ఒప్పందం గురించి ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో పోస్టులు పెట్టారు. పాకిస్థాన్‌తో ముడి చమురు నిల్వల వెలికితీతకు ఒక మంచి ఆయిల్ కంపెనీని ఎంచుకునే ప్రక్రియలో ఉన్న ట్లు తెలిపారు. భవిష్యత్‌లో భారత్‌కు కూడా చమురు విక్రయించేంతగా అపారమైన నిల్వలు పాక్ వద్ద ఉంటాయని వ్యాఖ్యానించారు. మరోవైపు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఈ ఒప్పందంపై సోషల్ మీడియాలో స్పందించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లో ఇరు దేశాల భాగస్వామ్యం మరింత బలంగా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. రేడియో పాకిస్థాన్ కూడా ఈ ఒప్పందంపై ప్రముఖంగా కథనాలను ప్రసారం చేసింది. ఈ ఒప్పందం కోసం వాషింగ్టన్‌లో జరిగిన సమావేశంలో పాక్ ఆర్థిక మంత్రి ఔరంగజేబు, అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లూట్నిక్, వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రియర్ పాల్గొన్నట్లు తెలిపింది. కాగా, పాక్‌తో అమెరికా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంలో తమ ప్రాంతంలోని చమురు క్షేత్రాల అన్వేషణ అంశాన్ని చేర్చడం పట్ల బలూచీ జాతీయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ తప్పుదోవ పట్టించినట్లు కనిపిస్తోందని బలూచ్ జాతీయవాద నాయకుడు మీర్ యార్ బలూచ్ ’ఎక్స్’లో వ్యాఖ్యానించారు. చమురు నిల్వలు పాక్‌లోని పంజాబ్‌లో లేవని, పాక్ ఆక్రమిత బలూచ్ భూభాగంలో ఉన్నాయని ఆయన తెలిపారు.
శశిథరూర్ వ్యంగ్యాస్త్రాలు
పాకిస్థాన్‌తో చమురు ఒప్పందంపై ట్రంప్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ నేత శశిథరూర్ వ్యంగ్యంగా స్పందించారు. ’’పాకిస్థాన్‌లో చమురు కనిపిస్తుందని అమెరికా ఊహించుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ఒప్పందంపై వాళ్లకు(అమెరికా-పాక్) శుభాకాంక్షలు! పాకిస్థాన్‌లో చమురు ఉందని నేనైతే వినలేదు. కానీ, వెతికే హక్కు అమెరికాకు ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్ భారత్‌ను ఉద్దేశించి చేసిన ‘మృత ఆర్థిక వ్యవస్థలు’ అనే వ్యాఖ్యను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. అమెరికా సుంకాలు చిన్న విషయమేమి కాదని.. ఆ దేశంతో భారత్ వాణిజ్యాన్ని తుడిచిపెట్టే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్
జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..
For More Telangana News And Telugu News