Air India crash: యాడ్‌లాగే ఆ ప్రమాదం!
ABN , Publish Date - Jun 14 , 2025 | 04:33 AM
ఊహాప్రపంచం.. కళ్ల ఎదుట వాస్తవమై నిలిస్తే ఎలా ఉంటుంది? సాధారణంగా, కళాప్రపంచంలో ఈ మాటలు వింటూ ఉంటాం. కానీ, ఓ కఠిన వాస్తవానికి, ఓ ఘోర విపత్తుకు ఆ ఊహాప్రపంచం అద్దం పడితే..

గుజరాత్ విమాన దుర్ఘటనలో ఆసక్తికర కోణం
అదే రోజు ఉదయం ఓ పత్రికలో.. భవనం నుంచి విమానం బయటకొస్తున్నట్లు యాడ్
విమానం మీద ఎయిరిండియా లోగో
మధ్యాహ్నం అదే తరహాలో ప్రమాదం
న్యూఢిల్లీ, జూన్ 13: ఊహాప్రపంచం.. కళ్ల ఎదుట వాస్తవమై నిలిస్తే ఎలా ఉంటుంది? సాధారణంగా, కళాప్రపంచంలో ఈ మాటలు వింటూ ఉంటాం. కానీ, ఓ కఠిన వాస్తవానికి, ఓ ఘోర విపత్తుకు ఆ ఊహాప్రపంచం అద్దం పడితే?.. గుజరాత్‌వాసులది ఇదే పరిస్థితి. గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన దారుణ విమాన ప్రమాదం గురించి తెలియగానే.. వారికి అదే రోజు ఉదయం చూసిన ఓ న్యూస్‌పేపర్ యాడ్ గుర్తుకొచ్చింది. గుజరాత్‌లో బహుళ ప్రజాదరణ ఉన్న మిడ్ డేలో గురువారం ఉదయం ఓ ప్రకటన ప్రచురించారు. ‘ఫాదర్స్ డే’ను పురస్కరించుకొని ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకూ కిడ్‌జానియా అనే చిల్డ్రన్, ఫ్యామిటీ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్‌లో నిర్వహించే గేమ్స్ గురించి ఈ ప్రకటన. దీంట్లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఓ భవనంలోంచి ఎయిర్ ఇండియా విమానం బయటకు వస్తున్నట్లుగా ఉంటుంది. కిడ్‌జానియాలో పిల్లలు..
ఏవియేషన్ థీమ్‌తో కూడిన గేమ్స్‌లో పైలట్లుగా ఆడుకోవచ్చు అని చెప్పటానికి సంకేతంగా ఈ యాడ్‌ను ఇలా రూపొందించారు. పొద్దున పేపర్ మొదటి పేజీలో కిడ్‌జానియా ప్రకటన చూసిన గుజరాతీలు.. మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో సరిగ్గా అదే విధంగా ఎయిరిండియా విమానం కూలిపోయి, ఓ భవనంలోంచి దాని శకలం దూసుకెళ్లటం చూసి షాకయ్యారు. సోషల్ మీడియాలో కూడా పలువురు స్పందిస్తూ.. మిడ్‌డే యాడ్‌ను, విమాన దుర్ఘటన ఫొటోలను కలిపి షేర్ చేశారు. కాగా, విమాన ప్రమాదం యాదృచ్ఛికమేనని కిడ్‌జానియా తాలూకు యాడ్ సంస్థ పేర్కొంది. జరిగిన ఘటనపై కిడ్‌జానియా ఒక ప్రకటన విడుదల చేసింది. ‘పిల్లలకు విమానయానం, ఎయిర్‌పోర్టుల పనితీరు గురించి ప్రాథమిక అవగాహన కలిగించే మా ఏవియేషన్ అకాడమీ కోసం ఈ యాడ్‌ను రూపొందించాం. భారత్‌లో ఎయిరిండియాతో ఒప్పందం ఉంది. అందువల్లే ఆ యాడ్‌లో ఆ కంపెనీ లోగో వాడాం. చాలా రోజుల కిందటే ఈ యాడ్ తయారైంది. విమాన ప్రమాదం నేపథ్యంలో, ఈ యాడ్‌ను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నాం’ అని పేర్కొంది.