Badrinath: మంచులో 22 ప్రాణాలు!
ABN , Publish Date - Mar 01 , 2025 | 05:38 AM
ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్‌వో)కు చెందిన ఓ కార్మిక శిబిరంపై శుక్రవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో మంచు చరియలు విరిగిపడ్డాయి.

ఉత్తరాఖండ్‌లో బీఆర్వో కార్మిక శిబిరంపై మంచు చరియలు
55 మంది కార్మికులు చిక్కుకోగా 33 మందిని రక్షించిన సైన్యం
మిగిలిన వారి కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు
డెహ్రాడూన్, ఫిబ్రవరి 28: ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్‌వో)కు చెందిన ఓ కార్మిక శిబిరంపై శుక్రవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో మంచు చరియలు విరిగిపడ్డాయి. అప్పుడు ఆ శిబిరంలో ఉన్న 55 మంది కార్మికులు మంచులో చిక్కుకుపోయారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన భారత సైన్యం, బీఆర్‌వో బృందాలు కడపటి వార్తలందేసరికి 33 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరో 22 మంది మంచులోనే ఉండగా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారత్- టిబెట్ సరిహద్దులో చివరి గ్రామం, సముద్రమట్టానికి 3,200 మీటర్ల ఎత్తులో, బద్రీనాథ్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మనా అనే గ్రామంలో ఈ శిబిరం ఉంది. ఈ ప్రాంతంలో కొద్దిరోజులుగా మంచు విపరీతంగా కురుస్తుంది.
అయితే, భారత్- టిబెట్ సరిహద్దు మార్గంలో సైనిక కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు.. బీఆర్‌వోకు చెందిన కార్మికులు కొద్ది రోజులుగా అక్కడ పని చేస్తున్నారు. రహదారిపై పేరుకుపోయిన మంచును తొలగిస్తున్నారు. ఈ క్రమంలో వారు బస చేసిన శిబిరంపై మంచు చరియలు విరిగి పడడంతో మంచు కింద ఉండిపోయారు. ఆ శిబిరంలో మూడు కంటెయినర్లు, ఓ షెడ్ ఉన్నాయని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. నిరంతరాయంగా మంచు కురుస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. కాగా, ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ, ఉత్తర్‌కాశీ, రుద్రప్రయాగ్ జిల్లాల్లో 2,400 మీటర్లకు పైగా ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడే అవకాశముందని చండీగఢ్‌లోని డిఫెన్స్ జియో ఇన్ఫర్మేటిక్స్ రీసెర్చ్ ఎస్టాబ్లి్‌షమెంట్(డీజీఆర్‌ఈ) గురువారం సాయంత్రమే హెచ్చరికలు జారీ చేసింది. 3,500 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షం, మంచు కురిసే అవకాశముందని డెహ్రాడూన్‌లోని వాతావరణ కేంద్రం శుక్రవారం ఉదయం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినా ఉపయోగం లేకపోయింది.