Jharkhand: ఎనిమిది మంది మావోయిస్టుల హతం
ABN , Publish Date - Apr 22 , 2025 | 03:19 AM
ఝార్ఖండ్‌లో భద్రతా బలగాలు నిర్వహించిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు. వారిలో కోటి రూపాయల రివార్డు ఉన్న అగ్రనేత ప్రయాగ్ మాంఝీ కూడా ఉన్నాడు

మృతుల్లో అగ్రనేత ప్రయాగ్ మాంఝీ
అతని తలపై రూ.కోటి రివార్డు
రాంచీ/న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఝార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడైన ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక్ కూడా ఉన్నాడు. అతని తలపై రూ.కోటి రివార్డు ఉంది. సోమవారం ఉదయం 5.30 గంటల సమయంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. బొకారో జిల్లాలోని లాల్పనా ప్రాంతంలో ఉన్న లుగుహిల్స్‌లో సీఆర్పీఎఫ్‌కు చెందిన కోబ్రా కమెండోలు, ఝార్ఖండ్ పోలీసులు ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నారు. తెల్లవారుజామున కూంబింగ్ ప్రారంభించిన భద్రతా దళాలకు 5.30 గంటల సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. 8 మంది మావోయిస్టులు హతమవగా.. మిగిలిన వారు అడవుల్లోకి పారిపోయారని భద్రతా దళాలు వెల్లడించాయి. మృతులను కేంద్ర కమిటీ సభ్యుడు ప్రయాగ్ మాంఝీ, స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు అర్వింద్ యాదవ్ అలియాస్ అవినాశ్, జోనల్ కమిటీ సభ్యుడు సాహెబ్‌రామ్ మాంఝీ అలియాస్ రాహుల్ మాంఝీ, మహేశ్ మాంఝీ అలియాస్ మోటా, తాలూ, రంజు మాంఝీ, గంగారాం, మహేశ్‌గా గుర్తించినట్లు తెలిపారు. వీరిలో ప్రయాగ్‌పై రూ.కోటి రివార్డు ఉండగా.. అర్వింద్ యాదవ్‌పై రూ.25 లక్షలు, సాహెబ్‌రామ్‌పై రూ.10 లక్షల రివార్డులు ఉన్నట్లు చెప్పారు.