Share News

Mallikarjun Kharge: పెద్దనోట్ల రద్దు, కోవిడ్ లాక్‌డౌన్‌ను తలపిస్తున్న ఎస్ఐఆర్.. మండిపడిన ఖర్గే

ABN , Publish Date - Nov 23 , 2025 | 03:47 PM

బీజేపీ ఓట్ చోరీ ఇప్పుడు ప్రాణాంతకంగా మారిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో విమర్శించారు. గత 19 రోజుల్లో 16 మంది బీఎల్ఓలు మరణించినట్టు మీడియాలో వచ్చిన వార్తను ఆయన షేర్ చేశారు.

Mallikarjun Kharge: పెద్దనోట్ల రద్దు, కోవిడ్ లాక్‌డౌన్‌ను తలపిస్తున్న ఎస్ఐఆర్.. మండిపడిన ఖర్గే
Mallikarjun Kharge

న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియలో పలువురు బూత్ లెవల్ అధికారుల (BLOs) మరణాలకు బీజేపీని కాంగ్రెస్ తప్పుపట్టింది. పని ఒత్తిళ్ల కారణంగా బీఎల్ఓలు, పోలింగ్ అధికారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. హడావిడిగా ఎస్ఐఆర్ అమలు చేయాలనుకోవడం గతంలో పెద్దనోట్ల రద్దు, కోవిడ్ 19 లాక్‌డౌన్ పరిస్థితిని గుర్తుచేస్తోందని విమర్శించింది.


బీజేపీ 'ఓట్ చోరీ' ఇప్పుడు ప్రాణాంతకంగా మారిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో విమర్శించారు. గత 19 రోజుల్లో 16 మంది బీఎల్ఓలు మరణించినట్టు మీడియాలో వచ్చిన వార్తను ఆయన షేర్ చేశారు. తీవ్రమైన పని ఒత్తిళ్లతోనే బీఎల్ఓలు, పోలింగ్ అధికారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు.


'ప్రాణాలు కోల్పోయిన అధికారుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాను. క్షేత్ర స్థాయిలో అందుతున్న సమాచారం బట్టి మరణించిన వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు. ఇది చాలా బాధాకరం. ఈ కుటుంబాలకు ఎవరు న్యాయం చేస్తారు?' అని ఖర్గే ప్రశ్నించారు. అధికారాన్ని తస్కరించిన ఆనందంలో బీజేపీ ఉంటే, ఎన్నికల కమిషన్ మౌన ప్రేక్షకుడిలా చూస్తోందని ఆయన ఆరోపించారు. హడావిడిగా, ఏమాత్రం ప్రణాళిక లేకుండా బలవంతంగా ఎస్ఐఆర్ అమలు చేస్తుండటం పెద్ద నోట్ల రద్దు, కోవిడ్-19 లాక్‌డౌన్ నాటి పరిస్థితిని తలపిస్తోందని విమర్శించారు. 'జరిగిందేదో జరిగింది. ఇక చాలు. ఇప్పటికైనా మనం మేలుకోని ప్రజాస్వామ్య మూలస్తంభాలను కాపాడుకోకుంటే మనల్ని ఎవరూ కాపాడలేరు. అమాయక బీఎల్‌ఓల మరణాలకు ఎస్ఐఆర్‌, ఓట్ చోరీపై మౌనం వహిస్తున్న వారే బాధ్యులు. మీ గళం వినిపించండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి' అని ఖర్గే కోరారు.


పశ్చిమబెంగాల్‌లోని నడియా జిల్లాలో బీఎల్ఓగా పనిచేస్తున్న ఒక మహిళ శనివారంనాడు తన నివాసంలో ఉరివేసుకుని కనిపించింది. ఎస్ఐఆర్‌ పని ఒత్తిళ్ల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబసభ్యులు తెలిపినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై పశ్చిమబెంగాల్ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజంగానే పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారిందని అన్నారు. బీఎల్ఓ సూసైడ్ నోట్‌ను కూడా ముఖ్యమంత్రి షేర్ చేశారు. అయితే ఈ సూసైడ్ నోట్ అబద్ధమని బీజేపీ నేత రాహుల్ సిన్హా కొట్టివేశారు. కాగా, మధ్యప్రదేశ్‌లోని రైసేన్, దమోహ్ జిల్లాల్లోనూ బీఎల్ఏ పనుల్లో ఉన్న ఇద్దరు టీచర్లు అస్వస్థత కారణంగా గత శుక్రవారం మరణించడం మరింత ఆందోళనకరంగా మారింది.


ఇవి కూడా చదవండి..

చండీగఢ్ బిల్లుపై తుది నిర్ణయం తీసుకోలేదు.. కేంద్రం వివరణ

SIR కి వ్యతిరేకంగా గళం విప్పిన టీవీకే పార్టీ

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Nov 23 , 2025 | 03:50 PM