Prashant Kishor: ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే అనుకుంటున్నా: ప్రశాంత్ కిశోర్
ABN , Publish Date - Nov 23 , 2025 | 12:27 PM
బిహార్ ఎన్నికల్లో అవకతవకలు జరిగే ఉంటాయని తనకు అనిపిస్తోందని జన్ సురాజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. తమ పార్టీకి క్షేత్రస్థాయిలో లభించిన మద్దతుకు, పోలింగ్ సరళికి పొంతన లేదని తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సారథ్యంలోని జన్ సురాజ్ పార్టీ బిహార్ ఎలక్షన్లలో కనీసం ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ ఆదివారం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే తాను నమ్ముతున్నట్టు చెప్పారు. అయితే, ఇందుకు సంబంధించిన ఆధారాలు మాత్రం తన వద్ద లేవని అన్నారు (Prashant Kishor on Bihar Polls)
జన్ సురాజ్ పార్టీ తొలిసారిగా ఈ ఎన్నికల్లో బరిలోకి దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసింది. కానీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఇది భారీ పరాజయమేనని ప్రశాంత్ కిశోర్ అంగీకరించారు. కానీ క్షేత్రస్థాయిలో తమ ప్రచారానికి మంచి స్పందన వచ్చిందని అన్నారు. ఓటింగ్ సరళికి, పాదయాత్ర సమయంలో తమ టీమ్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌కు తేడా ఉందని అన్నారు. కాబట్టి ఏదో జరిగే ఉంటుందని తాను నమ్ముతున్నట్టు వ్యాఖ్యానించారు.
‘ఏవో అదృశ్య శక్తులు ఈ ఎన్నికల్లో పని చేశాయి. ప్రజలకు పెద్దగా పరిచయం లేని పార్టీలకు కూడా లక్షల కొద్దీ ఓట్లు వచ్చాయి. ఈ విషయంలో నేను స్పందించాలని కొందరు కోరుతున్నారు. ఈవీఎమ్‌ల విషయంలో అవకతవకలు జరిగాయని అంటున్నారు. అయితే, ఓడినప్పుడు ఇలాంటి ఆరోపణలు సహజం. కానీ నా వద్ద ఇందుకు సంబంధించిన ఆధారాలు ఏవీ లేవు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం పొంతన కుదరట్లేదు. ఏదో తేడా ఉందని మాత్రం ప్రాథమికంగా అనిపిస్తోంది. కానీ అదేంటో మాకు ప్రస్తుతానికి తెలియదు’ అని ప్రశాంత్ కిశోర్ అన్నారు.
‘ఎన్నికల ప్రకటన నాటి నుంచీ పోలింగ్ రోజు వరకూ మహిళలకు రూ.10 వేలు అందాయి. మొత్తం రూ.2 లక్షలు ఇస్తామన్న హామీలు వెళ్లాయి. ఆ పది వేలు మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ అట. ఎన్డీయేకు, నితీశ్ కుమార్‌కు ఓటేస్తే మిగిలిన మొత్తం వస్తుందట. ఇంత మంది మహిళలకు డబ్బు పంచడాన్ని నేను బిహార్‌తో సహా దేశంలో ఎక్కడా చూడలేదు’ అని ప్రశాంత్ కిశోర్ అన్నారు. తాము ఓడిపోయి ఆర్‌జేడీ గెలిస్తే జంగల్ రాజ్ వస్తుందని కూడా కొందరు భయపడ్డారని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. ఇది కూడా తమ ఓటమికి ఒక కారణమని అన్నారు.
ఇవి కూడా చదవండి...
ఆహార ఉత్పత్తులపై ఓఆర్ఎస్ లేబుల్స్‌ను వెంటనే తొలగించాలి.. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు
పంజాబ్‌లో ఎన్‌కౌంటర్.. పోలీసుల అదుపులో ఇద్దరు ఉగ్రవాదులు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి