Explosives Found in Uttarakhand: ఉత్తరాఖండ్ స్కూల్ సమీపంలో పేలుడు పదార్థాలు లభ్యం
ABN , Publish Date - Nov 23 , 2025 | 09:38 AM
ఉత్తరాఖండ్‌లోని ఓ స్కూల్ సమీపంలో జిలెటిన్ స్టిక్స్ లభించడం కలకలానికి దారి తీసింది. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. సమీప ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్‌లోని ఓ ప్రభుత్వ స్కూల్ సమీపంలో పేలుడు పదార్థాలు లభించడం కలకలానికి దారి తీసింది. అల్మోరా జిల్లాలోని దబారా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 20 కేజీల బరువున్న 161 జిలెటిన్ స్టిక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడి పొదల్లో ఇవి లభించడంతో అప్రమత్తమైన పోలీసులు సమీప ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు (Gelatin Sticks Found near Uttarakhand School).
గురువారం సాయంత్రం స్కూలుకు సమీపంలో కొన్ని అనుమానాస్పద ప్యాకెట్స్‌ను గుర్తించిన ప్రిన్సిపాల్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసు బృందాలు అక్కడకు చేరుకుని ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అక్కడికి ఎవరూ రాకుండా ఆంక్షలు విధించాయి. బాంబ్ స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్ కూడా చేరుకున్నాయి. జిలెటిన్ స్టిక్స్‌ను స్వాధీనం చేసుకున్న బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ జిలెటిన్ స్టిక్స్‌ను సీల్ చేశాయి.
సాధారణంగా వీటిని మైనింగ్ కార్యకలాపాల్లో భాగంగా రాళ్లను పేల్చేందుకు ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో జిలెటిన్ స్టిక్స్‌ను ఆ గ్రామానికి ఎవరు తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు పదార్థాల చట్టం సెక్షన్ 4(ఏ), భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 288 కింద కేసు నమోదు చేసుకున్నారు. నాలుగు పోలీసు బృందాల సారథ్యంలో లోతైన దర్యాప్తు జరుగుతోందని తెలిపారు (Explosives Found in Almora District).
ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధించి హర్యానాలో 3 వేల కిలోల పేలుడు పదార్థాలు లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో కూడా పేలుడు పదార్థాలు లభించడం కలకలానికి దారితీసింది. ఢిల్లీ పేలుడు అనంతరం దేశవ్యాప్తంగా పోలీసులు హైఅలర్ట్‌లో ఉన్నారు. నగరాల్లో పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నారన్న అనుమానాల నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు.
ఇవి కూడా చదవండి...
ఆహార ఉత్పత్తులపై ఓఆర్ఎస్ లేబుల్స్‌ను వెంటనే తొలగించాలి.. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు
పంజాబ్‌లో ఎన్‌కౌంటర్.. పోలీసుల అదుపులో ఇద్దరు ఉగ్రవాదులు