Tejashwi Yadav: ప్రతిపక్ష పదవిని తోసిపుచ్చిన తేజస్వి.. ఏమైందంటే
ABN , Publish Date - Nov 18 , 2025 | 06:48 PM
పార్టీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ ఆదేశాలతోనే తాను పార్టీ కార్యకలాపాలు చూసుకున్నానని, ఎన్నికల్లో గట్టిగా ప్రయత్నం చేసినప్పటకీ ఓటమి పాలయ్యామని తేజస్వి అన్నారు. ఇందుకు తాను బాధ్యత తీసుకుంటున్నట్టు చెప్పారు.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (RJD) పరాజయానికి బాధ్యత వహిస్తూ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవిని ఆ పార్టీ నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav)నిరాకరించారు. అయితే తన తండ్రి, పార్టీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ నచ్చచెప్పడంతో ఆ బాధ్యత చేపట్టేందుకు అంగీకరించారు.
పార్టీ వర్గాల కథనం ప్రకారం, ఆర్జేడీ ఓటమిపై సోమవారంనాడు సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రతిపక్ష నేత బాధ్యత తీసుకునేందుకు తేజస్వి నిరాకరించాడు. ఎమ్మెల్యేగానే కొనసాగాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. పార్టీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ ఆదేశాలతోనే తాను పార్టీ కార్యకలాపాలు చూసుకున్నానని, ఎన్నికల్లో గట్టిగా ప్రయత్నం చేసినప్పటకీ ఓటమి పాలయ్యామని అన్నారు. ఇందుకు తాను బాధ్యత తీసుకుంటున్నట్టు చెప్పారు. దీనిపై లాలూ స్పందిస్తూ, పార్టీని ముందుకు నడిపిచేందుకైనా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి భాద్యత తీసుకోవాలని తేజస్వికి సర్దిచెప్పారు.
సంజయ్ యాదవ్‌కు తేజస్వి సపోర్ట్
కాగా, లాలూ కుటుంబ వివాదంలో ప్రముఖంగా వినిపించిన ఆర్జేడీ ఎంపీ సంజయ్ యాదవ్‌ను ఈ సమావేశంలో తేజస్వి సపోర్ట్ చేయడం విశేషం. తేజస్వి, ఆయన అనుచరులైన సంజయ్ యాదవ్, రమీజ్‌లు తనను అవమానించి, దాడికి ప్రయత్నించారంటూ లాలూ కుమార్తె రోహిణి ఆచార్య ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్జేడీ సమావేశంలో సంజయ్ యాదవ్‌ను తేజస్వి సమర్థించారు. ఆర్జేడీ నిరాశజనక ఫలితాలకు సంజయ్ యాదవ్ బాధ్యతలేదని అన్నారు. అయితే ఆర్జేడీ ఎన్నికల సన్నాహకాలు, ప్రచార వ్యూహాలు, అభ్యర్థుల ఖరారులో సంజయ్ యాదవ్ కీలకంగా వ్యవహరించినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తేజస్విని ఎవరు కలవాలన్నా అతని ద్వారా వెళ్లాల్సిందే. ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురైన తేజ్ ప్రతాప్ యాదవ్ సైతం ఇటీవల సంజయ్‌పై ఆరోపణలు గుప్పించారు. తన తమ్ముడు తేజస్విని కలవాలంటే సంజయ్ యాదవ్ అడ్డుపడుతున్నాడని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
మోదీ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది.. మళ్లీ శిశథరూర్ ప్రశంసలు
ఓటమికి బాధ్యత నాదే, పొరపాట్లు సరిచేసుకుంటాం
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.