Share News

Google: గూగుల్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపు

ABN , Publish Date - Apr 12 , 2025 | 05:14 AM

టెక్‌ కంపెనీల్లో లేఆ్‌ఫల పర్వం కొనసాగుతోంది. తాజాగా ప్రముఖ టెక్‌ సంస్థ గూగుల్‌ పెద్దఎత్తున ఉద్యోగులను తొలగించింది. తన ప్లాట్‌ఫాంలు, డివైజెస్‌ విభాగాల్లో పనిచేసే వందలాది మందికి ఉద్వాసన పలికింది.

Google: గూగుల్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపు

  • వందలాది మందికి ఉద్వాసన డెలాయిట్‌, యాక్సెంచర్‌, ఇతర

  • సంస్థలతో 5.1 బిలియన్‌ డాలర్ల ఐటీ ఒప్పందాలు రద్దు: పెంటగాన్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 11: టెక్‌ కంపెనీల్లో లేఆ్‌ఫల పర్వం కొనసాగుతోంది. తాజాగా ప్రముఖ టెక్‌ సంస్థ గూగుల్‌ పెద్దఎత్తున ఉద్యోగులను తొలగించింది. తన ప్లాట్‌ఫాంలు, డివైజెస్‌ విభాగాల్లో పనిచేసే వందలాది మందికి ఉద్వాసన పలికింది. ఆండ్రాయిడ్‌ సాఫ్ట్‌వేర్‌, పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్లు, క్రోమ్‌ బ్రౌజర్‌ విభాగాలకు చెందిన సిబ్బందిపై వేటు పడిందని ‘ది ఇన్ఫర్మేషన్‌’ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది జనవరిలో ఉద్యోగులకు ప్రకటించిన స్వచ్ఛంద విరమణ కార్యక్రమానికి అనుగుణంగా ఈ తొలగింపులు జరిగాయని పేర్కొంది. గతేడాది ఆండ్రాయిడ్‌, క్రోమ్‌ బృందాలను పిక్సెల్‌ అండ్‌ డివైజెస్‌ గ్రూప్‌లో విలీనం చేయడంతో ప్రారంభమైన కంపెనీ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. విలీనం సమయంలో ఉమ్మడి యూనిట్లలో 20వేల మందికి పైగా ఉద్యోగులు ఉండేవారు. ప్లాట్‌ఫాంలు, డివైజెస్‌ బృందం సామర్థ్యాలను, క్రియాశీలతను పెంపొందించడమే లక్ష్యంగా పునర్వ్యవస్థీకరణను చేపట్టినట్లు గూగుల్‌ అధికార ప్రతినిధి తెలిపారు.


అయితే అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా నియామకాలు కొనసాగుతున్నాయని కంపెనీ పేర్కొంది. ఇదిలా ఉండగా, యాక్సెంచర్‌, డెలాయిట్‌ వంటి ప్రముఖ సంస్థలతో 5.1 బిలియన్‌ డాలర్ల విలువైన ఐటీ సేవల ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లు పెంటగాన్‌ ప్రకటించింది. వృథా ఖర్చులు తగ్గించడంతో పాటు రక్షణ శాఖ సిబ్బంది అంతర్గత సామర్థ్యాలను మెరుగుపరచడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా రక్షణశాఖ కార్యదర్శి పీట్‌ హెగ్సేత్‌ గురువారం జారీ చేసిన మెమోలో పేర్కొన్నారు. పెంటగాన్‌ ఉద్యోగులు నిర్వహించగలిగిన సేవల కోసం థర్డ్‌ పార్టీ కన్సల్టెంట్లకు అనవసరంగా చెల్లింపులు చేయడాన్ని అరికట్టడానికే తాజా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ చర్య 5.1 బిలియన్‌ డాలర్ల వృథా ఖర్చును అరికట్టడంతో పాటు దాదాపు 4 బిలియన్‌ డాలర్లు ఆదా అవుతాయని హెగ్సేత్‌ తెలిపారు.

Updated Date - Apr 12 , 2025 | 05:14 AM