Share News

Tahawwur Rana: ఇండియాకు తహవూర్ రాణా.. ఆ జైలుకే తరలింపు

ABN , Publish Date - Apr 10 , 2025 | 07:44 AM

భారత్ సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న తరుణం మరికొన్ని గంటల్లో రాబోతుంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, 2008 ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణా మరికొన్ని గంటల్లో ఇండియా రానున్నాడని తెలుస్తోంది. ఆ వివరాలు...

Tahawwur Rana: ఇండియాకు తహవూర్ రాణా.. ఆ జైలుకే తరలింపు
Tahawwur Rana

ఢిల్లీ: సుమారు పదిహేడేళ్ల క్రితం జరిగిన ముంబయి 26/11 మారణహోమం కుట్రదారుడు తహవూర్ రాణా మరికొన్ని గంటల్లో ఇండియాకు రానున్నాడు. అతడు అమెరికాలో ఉండేందుకు చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలూ మూసుకుపోవడంతో.. భారత్‌కు రాణా విషయంలో లైన్ క్లియర్ అయ్యిది. ఈ నేపథ్యంలో అమెరికా అధికారులు తహవూర్ రాణాని భారత్‌కు అప్పగించారు. తనను ఇండియాకు అప్పగించవద్దంటూ.. అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు రాణా. కానీ న్యాయస్థానం అతడి అభ్యర్థనను తోసిపుచ్చింది. దాంతో రాణాను ఇండియా తీసుకువచ్చేందుకు ఎన్ఐఏ, రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (ఆర్ఏడబ్ల్యూ) సంయుక్త బృందం అమెరికాకు చేరుకున్నారు. నేడు (గురువారం) ప్రత్యేక విమానంలో రాణాను ఇండియాకు తీసుకొస్తున్నారు. గురువారం మధ్యాహ్నం ఈ విమానం ఢిల్లీకి చేరుకోనుందని తెలుస్తుంది. అనంతరం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అతడిని అరెస్టు చేసి.. విచారిస్తుందని సమాచారం.


రాణాను అదుపులోకి తీసుకున్న వెంటనే ఢిల్లీలోని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆ తర్వాత అతడిని తీహార్ జైలుకు తరలిస్తారని ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే జైలు అధికారులు ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారని.. కోర్టు ఆర్డర్ కోసం జైలు అధికారులు ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. ఇక కసబ్ మాదిరి ఇతడికి ప్రత్యేక సెల్, బిర్యానీ వంటి సదుపాయాలు ఉండవంటున్నారు అధికారులు. ఇక రాణాపై నేరపూరిత కుట్ర, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం, హత్య, ఫోర్జరీతో పాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టాల కింద కేసులు నమోదయ్యాయి.


ఎవరీ రాణా..

పాకిస్థాన్ మూలాలున్న కెనడా పౌరుడైన రాణా బిజినెస్‌మ్యాన్‌గా చికాగోలో సెటిల్ అయ్యాడు. 2008లో ముంబయి ఉగ్రదాడిలో కీలక సూత్రధారి అయిన రాణా.. గత కొన్నాళ్లుగా లాస్ ఏంజెల్స్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 26/11 ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడు అయిన పాకిస్థానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్‌మన్ హెడ్లీతో.. రాణాకు సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీలో ఉద్యోగిగా నటిస్తూ దాడులకు ముందు ముంబయిలో రాణా రెక్కీ నిర్వహించాడని తెలిపారు. అంతేకాక లష్కరే తోయిబాకు రాణా మద్దతుదారుడని అధికారులు వెల్లడించారు.


దీంతో ముంబయి ఉగ్రదాడి జరిగిన ఏడాది తర్వాత అక్టోబరు 2009లో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) రాణాను చికాగోలో అరెస్టు చేసింది. అయితే రాణాను ఇండియా రప్పించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. చివరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా.. వైట్‌హౌస్‌లో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో రాణాను భారత్‌కు అప్పగించడానికి ఆమోదం తెలిపినట్టు ట్రంప్ ప్రకటించాడు. అయితే చివరి నిమిషం వరకు కూడా రాణా తనను ఇండియాకు అప్పగించవద్దంటూ అమెరికా న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తూనే ఉన్నాడు. కానీ సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చడంతో.. ఎట్టకేలకు అతడు ఇండియాకు రానున్నాడు.

ఇవి కూడా చదవండి:

కలికాలం.. ముగ్గురు పిల్లలను వదిలిపెట్టి.. ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి

అక్బర్ కుమార్తెతో హిందూ రాజు వివాహం.. రాజ్‌పుత్-మొఘల్ కూటమి వెనుక అసలు కథ ఇదే..

Updated Date - Apr 10 , 2025 | 07:53 AM